Balka Suman | హైదరాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది గాలి వార్త అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుంది అని వస్తున్న పుకార్లపై బాల్క సుమన్ స్పందించారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
24 సంవత్సరాల నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వారు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వారు, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనటువంటి వారు, తెలంగాణ అస్థిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వారు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, తెలంగాణ అస్థిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండొద్దని కోరుకుంటున్నట్టు ఉంది. ఆ భ్రమల్లో ఉన్నారు. 24 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నారు. కానీ మా పార్టీ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లు పోరాటం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మా పార్టీ. ఈ పదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే సమున్నతంగా నిలిపాం. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర అస్థిత్వానికి ప్రతీకగా, జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైన, మట్టికైన మనోడు ఉండాలన్నట్టు మన ఇంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఉంటుంది అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తాం. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాలు చేపడుతాం. ఈ ప్రభుత్వం భరత పడుతాం. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం వెంటపడుతాం. చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మేం పట్టించుకోం. ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు బట్ట కాల్చి మీద వేస్తరు. అయినప్పటికీ మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే 100 సంవత్సరాలు కూడా మా పార్టీ సుస్థిరంగా ఉంటుందని బాల్క సుమన్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం