Balka Suman | హైదరాబాద్ : తెలంగాణ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తోంది అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలను రాష్ట్రం మీదికి వదిలేసిండు అని సుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుటుంబ పాలన అని రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శలు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన అన్నదమ్ముళ్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్రం మీదికి వదిలేసిండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గమైన సంస్కృతికి తెరలేపిండు. ఆయన అన్నదమ్ముళ్లకు ఏమైన పదవులు ఉన్నాయా..? ప్రజాప్రతినిధులా..? అధికారిక హోదా ఏమైనా ఉందా..? అలాంటివి కూడా ఏం లేవు. కానీ అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ అధ్యక్షతన జరిగిన వికారాబాద్ జిల్లా అభివృద్ధి సమీక్షకు సంబంధించిన అధికారిక సమావేశంలో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి వేదికపై కూర్చున్నాడు. ఇదే తిరుపతి రెడ్డికి ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వేదికపై కూర్చున్నాడు. అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జడ్పీటీసీలు, ఎంపీటీసీలను పక్కనపెట్టి ఆయన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశాడు అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
మరో సోదరుడు కొండల్ రెడ్డి ఏకంగా ఓ బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిండు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని పక్క సీట్లో కూర్చోబెట్టి.. కొండల్ రెడ్డి మధ్య సీట్లో కూర్చున్నాడు. ఏ హోదాలో కొండల్ రెడ్డి ఆస్ట్రేలియాకు బృందాన్ని తీసుకొని వెళ్లిండు. వందలాది కార్ల కాన్వాయ్‌తో కామారెడ్డి, కొడంగల్, షాద్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 2+2 గన్‌మెన్ సెక్యూరిటీతో తిరుగుతున్నాడు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు ఎస్కార్ట్ వాహనాలను సమకూరుస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్‌తో కొండల్ రెడ్డి పర్యటిస్తున్నాడు అని బాల్క సుమన్ తెలిపారు.
ముఖ్యమంత్రి మరో సోదరుడు జగదీశ్వర్ రెడ్డి.. స్వచ్ఛ్ బయో అనే ఓ కంపెనీతో వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో అధికారికంగా ట్వీట్ చేస్తూ వెల్లడించింది. ఈ కంపెనీ భాగస్వామి ఎవరంటే సీఎం సోదరుడు జగదీశ్వర్ రెడ్డిది. ఈ కంపెనీ 15 రోజుల కిందట పుట్టింది. 15 రోజుల కింద పుట్టిన ఈ కంపెనీ తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుంది..? ఇక్కడ ఒప్పందం జరిగితే మీడియా ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పి అమెరికా వేదికగా ఒప్పందం చేసుకున్నారు. 500 మందికి ఉద్యోగాలు కల్పించి, తెలంగాణ సుస్థిర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని ఈ కంపెనీ ప్రకటించడం సిగ్గుచేటుగా ఉందన్నారు బాల్క సుమన్.
గడిచిన రెండు మూడు నెలల్లో రేవంత్ రెడ్డి కుటుంబం కొత్తగా ఐదారు కంపెనీలు తెరిచింది. సీఎం సోదరులే ఈ కంపెనీల్లో డైరెక్టర్లు. అర్బన్ ఫ్రీజం ఇన్ఫ్రా ఎల్ఎల్పీ.. ఈ కంపెనీలో మేజర్ పార్ట్నర్ తిరుపతి రెడ్డి అనుముల, స్వచ్ఛ్ బయో గ్రీన్ కంపెనీలో మేజర్ పార్ట్నర్ జగదీశ్వర్ రెడ్డి అనుముల, ఆర్నెన్ ప్రాపర్టీస్‌లో మేజర్ పార్ట్నర్స్ కృష్ణారెడ్డి అనుముల, తిరుపతిరెడ్డి అనుముల, ఆర్నెన్ కన్స్ట్రక్షన్స్లో కూడా కృష్ణారెడ్డి అనుముల, తిరుపతి రెడ్డి అనుముల మేజర్ పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. గడిచిన మూడు నెలల్లో ఈ నాలుగు కొత్త కంపెనీలు ప్రారంభించారు. ఇవే కాకుండా వీరి దోస్తులను పెట్టి పది, పదిహేను కంపెనీలను ఓపెన్ చేశారు. ఈ అన్నదమ్ముళ్లను సెక్రటేరియట్ వేదికగా ఎవరు నడిపిస్తున్నారో అందరికీ తెలిసిందే. రియల్టర్లను, పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేసిన డబ్బులను ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి.. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే కుట్ర జరుగుతుంది అని బాల్క సుమన్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
Samantha | సౌతిండియా రికార్డ్.. సమంత పారితోషికం తెలిస్తే షాకే.. !
Leopard | నిజామాబాద్ జిల్లాలో పశువులపై చిరుతపులి దాడి