Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల మన తెలంగాణ బిడ్డ.. మనకు నాన్ లోకల్ అవుతున్నాడు అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33 సమగ్రంగా లేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు చెనేలో పడ్డట్టు ఉంది. రాష్ట్ర భవిష్యత్‌ను, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తుంది. నిన్న మెడికల్ ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చింది. మన తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఆ నోటిఫికేషన్లో నిబంధనలు ఉన్నాయి. అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉంది. కనీసం అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాల మీద జరిగింది. నియామకాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం మన ఆకాంక్షలను నిజం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాల్లో 60 శాతం లోకల్, 40 శాతం నాన్ లోకల్ రిజర్వేషన్లు ఉండే. 70 శాతం లోకల్, 30 శాతం నాన్‌లోకల్‌గా కూడా నింపేవారు. కానీ కేసీఆర్ శ్రద్ధ పెట్టి ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి 95 శాతం లోకల్‌కు, 5 శాతం ఓపెన్ కోటాగా నిర్ణయించారు. జీవో నంబర్ 124.. 2018లో విడుదల చేశాం. దీని వల్ల రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా రిజర్వేషన్లు సాధించాం. గతంలో 40 శాతం మంది పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఓపెన్ కోటాలో ఉద్యోగాలు పొందేవారు. కానీ కేసీఆర్ రాష్ట్రపతి, ప్రధానిని కలిసి 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా సవరణలు చేశారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
విద్యాలయాల్లో ప్రవేశాల విషయంలో కూడా మనం సవరణలు చేసుకోవాల్సి ఉండే. కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో పదేండ్ల పాటు పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. అంటే 15 శాతం ఓపెన్ కోటా ఉందో.. ఆంధ్రాలో తెలంగాణ విద్యార్థులు, తెలంగాణలో ఆంధ్రా విద్యార్థులు 15 శాతం ఓపెన్ కోటాలో వెళ్లొచ్చని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. కాబట్టి మార్చలేకపోయాం అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
డాక్టర్ కావాలని చాలా మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు కలలు కంటుంటారు. ఆ విధంగా చదివిస్తారు. అలాంటి పిల్లల భవిష్యత్‌తో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. 2014కు ముందు తెలంగాణలో మొత్తం 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. కేసీఆర్ వచ్చాక ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 9వేలకు పెంచారు. ఈ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. పెంచిన సీట్లు తెలంగాణ బిడ్డలకు దక్కేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. తెలంగాణలో 2014లో 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండే. ఈ సీట్లలో 280 సీట్లు ఓపెన్ కోటాలో ఉండే. కానీ మేం బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత 20గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్యను 30 మెడికల్ కాలేజీలకు తీసుకెళ్లాం. తెలంగాణ వచ్చిన నాటికి ఉన్న కాలేజీల్లో 15 శాతం ఓపెన్ కోటా పెడుతాం. మేం పెట్టిన కాలేజీల్లో మాత్రం ఓపెన్ కోటా ఇవ్వలేదు.. 100 శాతం మా పిల్లలకు సీట్లు ఇస్తామని చెప్పి జీవో తీసుకువచ్చాం.. దాంతో 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికాయి. గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్త కాలేజీల్లో కూడా ఇతర రాష్ట్రాల వారు వచ్చేవారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో 15 శాతం కోటా ఉంటది.. కానీ తర్వాత ఏర్పడ్డ కాలేజీల్లో మా పిల్లలకు దక్కాలని జీవో సవరణ చేశాం అని హరీశ్‌రావు తెలిపారు.
ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరి సీట్లు ఉంటాయి. బీ కేటగిరిలో గతంలో దేశంలోని ఎక్కడి వారైనా చదివే అవకాశం ఉండేది. మేం పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో ఇతరులు చదవడానికి వీల్లేకుండా బీ కేటగిరి సీట్లలో తెలంగాణ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని జీవో సవరించి వెసులుబాటు కల్పించాం. 24 మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్లు తేవడంతో 1071 సీట్లు దక్కాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో 520 ఎంబీబీఎస్ సీట్లు, బీ కేటగిరిలో లోకల్ రిజర్వేషన్లతో 1071 సీట్లు దక్కాయి. తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావాలి.. మన పిల్లలకు మేలు జరగాలనే తనపనతో ఈ పని చేశాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబీబీఎస్ అడ్మిషన్లలో అనాలోచితంగా తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేలా జీవో తీసుకొచ్చారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
1979లో 646 అనే జీవో తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం నాటి ఏపీని మూడు భాగాలుగా విభజించారు. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ. ఈ మూడు ప్రాంతాల్లో 85 శాతం సీట్లు వారి వారి ప్రాంతాల పిల్లలకు దక్కేలా జీవోలో పేర్కొన్నారు. మిగతా 15 శాతం ఓపెన్ కాంపిటీషన్ అని పేర్కొన్నారు. దీని తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగ నియామకాలకు నిబంధన పెట్టలేదు. కేవలం విద్యాలయాల్లో ప్రవేశాలకు మాత్రమే నిబంధన పెట్టారు. విద్యా ప్రవేశాల విషయంలో పాత జీవోను 10 ఏండ్లు పాటించాలని కేంద్రం ఆదేశించింది. అదే జీవోను యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాం. 2024 జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావడంతో.. తెలంగాణ రాష్ట్రం స్థానికతను నిర్ధారించుకునేందుకు సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునేందుకు అవకాశం దక్కింది. మన పిల్లలకు విద్యా ప్రవేశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్థానికతను నిర్ధారించేందుకు నియమ నిబంధనలు తయారు చేయాలి. కానీ అలాంటిదేమీ చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్స్ కోసం జీవో నంబర్ 33 ఇచ్చింది. చివరి విద్యాసంవత్సరం నుంచి నాలుగేండ్లు ఎక్కడ చదవితే అక్కడ లోకల్ అని చెప్పారు. అంటే 9 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివితే అది లోకల్ అని పేర్కొన్నారు. ఇది ఆల్రెడీ 1979 జీవోలో ఉంది. 2017 జీవోలో కూడా అదే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 అసమగ్రంగా ఉంది. ఈ జీవో కారణంగా మన తెలంగాణ బిడ్డలు.. స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం