Jeevan Reddy | నిజామాబాద్ ఖలీల్ వాడి : మాటతప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్న పేటెంట్ హక్కు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. గద్దెనెక్కగానే మాట మార్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌కు కొత్తకాదని, ఇది నూరేళ్ళ భాగోతమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చే ఎన్నికల హామీలు ఒక నాటకమని, ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు పచ్చి బూటకమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసలు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలే పెద్ద డ్రామాగా, ప్రజలపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పాట్లు పడుతోందని, మరోమారు ప్రజలను ఏమార్చడానికి పగటి వేషాలు వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అంటేనే అవినీతి గని, దేశానికి పట్టిన శని అని ఆయన అన్నారు. నమ్మి ఓటేసిన చేతినే కాటేసే కాలనాగు కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. మళ్లీ ఓట్ల కోసం గ్రామాలకొచ్చే కాంగ్రెస్ నేతలను నిలేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని తిరగబడాలి. గ్రామ పొలిమేరలు దాటే వరకూ తరిమి కొట్టాలి. డిసెంబర్ 9, 2023కు రుణమాఫీ చేస్తామన్నరు చేయలేదు. ఆగస్ట్ 15, 2024 వరకు రుణమాఫీ అని చెప్పిన మాట మార్చిండ్రు. మళ్లీ దసరా వరకు రుణమాఫీ అని చెప్పి నేటి వరకు చేయలేదు. ఇంకా 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ జరగలేదు. రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10 వేలు, డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకుంటే రైతు భరోసా 15 వేలు అన్నరు. రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తమన్నరు. మాట మార్చి 26 జనవరికి అన్నరు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నరు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసిండు. దీనిపై రైతులంతా ఏకమై మీ ఊళ్ళకొచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుకొని నిలదీయాలి. మా కడుపులు ఎందుకు కొట్టారని తిరగబడాలి అని జీవన్ రెడ్డి సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు ద్రోహం చేస్తూ కాంగ్రెస్ నిజస్వరూపం బయట పెట్టుకుందన్నారు. తూతూ మంత్రంగా సర్వే చేశారు. బీసీ కమిషన్ చైర్మన్ కూడా సర్వే రిపోర్ట్‌ను తప్పు బట్టారు. 30 లక్షల మేర బీసీల జనాభాను తక్కువ చేసి చూపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ శరాఘాతంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని తిడుతుండు. మళ్ళీ సర్వే చేయాల్సిందే. కేసీఆర్ బీసీ సంక్షేమం కోసం ఎంతో చేశారు. ఉన్నత పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆరే. అన్నీ స్థాయిల్లో బీసీలకు మంచి అవకాశాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. బీసీ లకు ఆత్మ గౌరవ భవనాలు కట్టించింది కేసీఆర్. కులవృత్తులకు ప్రోత్సాహం ఇచ్చింది కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | అరవింద్ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం.. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి పిలుపు!