హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 4.50లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమ లుకావడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూద నాచారి పేర్కొన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో డబుల్ ఇండ్ల కేటాయింపులపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులకు ఇండ్లు కేటాయించడం వల్ల నిజమైన లబ్ధిదారులు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇండ్లు పారదర్శకంగా కేటాయించామని గుర్తుచేశారు.
సింగరేణి ప్రాంతంలో దుర్భర పరిస్థితులు
ఈ నెల మొదటి వారం నుంచే సింగరేణి ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని మధుసూదనాచారి తెలిపారు. బుధవారం శాసనమండలిలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటడం, ఓపెన్‌కాస్ట్‌ల వల్ల వేడి, ఉకపోతతో బయటికి రాలేని పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభావిత పట్టణాలు, గ్రామాల్లో నిరంతరం వాటర్ స్ప్రే, నీటి సరఫరా టాంకర్ల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు.
జీపీలకు రూ.10లక్షల హామీ నిలబెట్టుకోవాలి: పోచంపల్లి
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రతి జీపీకి స్పెషల్ ఫండ్ కింద రూ.10 లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించి నెలలు గడుస్తున్నా విడుదల కాలేదని గుర్తుచేశారు. ఆర్థిక సంఘం విడుదల చేసే నిధులు గ్రామాలకు సరిపోవడం లేదని, వెంటనే ప్రత్యేక నిధిని విడుదల చేయాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: తక్కెళ్లపల్లి
జర్నలిస్టుల సమస్యలను మానవీయ కోణంలో చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కోరారు. జర్నలిస్టులు, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల అంశాలపై బు ధవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మా ట్లాడారు. జీవో 252ను సవరించి అర్హత ఉన్న ప్రతి జ ర్నలిస్టుకూ అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలని, ఉద్యోగుల మాదిరిగా క్యాష్‌లెస్ హెల్త్‌కార్డులు అందించి ప్రైవేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారాన్ని సమయానికి ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులకు సంబంధించి పీఏసీఎస్‌కు తప్ప ఇతర కొనుగోలు కేంద్రాలకు రవాణా సౌకర్యం లేదని అన్ని చోట్లకు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
హైడ్రా చర్యలతో 650 ఇండ్లకు రహదారి సమస్య: శంభీపూర్
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : హైడ్రా అధికారుల చర్యలతో బాచుపల్లిలో 650 కుటుంబాలకు వెళ్లేందుకు రహదారి లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆవేదన వ్యక్తంచేశారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ప్రణీత్ అంటీలియా వారు 2012లో ఇండ్ల నిర్మాణం చేపట్టారని, హైడ్రా శనివారం నోటీసులిచ్చి, ఆదివారం కాంపౌండ్ వాల్‌ను కూలగొట్టడం వల్ల రోడ్డు లేకుండా అయ్యిందని, సమస్యను పరి ష్కరిం చాలని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో సీఎం రేవంత్ పాల్గొన్న హైడ్రా కార్యక్రమంలో శాసనమండలి సభ్యులకు ప్రొటోకాల్ విషయంలో అవమానం జరిగిందన్నారు.
‘వెలుగుమట్ల’ బాధితులందరికీ పట్టాలివ్వాలి: తాతా మధు
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అమానవీయంగా పేదల ఇండ్లను ప్రభు త్వం నేలమట్టం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఉన్నవి కూలగొట్టి, పేదలను నిర్వాసితులుగా మార్చారని ధ్వజమెత్తా రు. బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం..1,895 మంది బాధితులు ఉంటే.. 311మందికి మాత్రమే పట్టాలిచ్చిందని అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు.
మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: రమణ
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న మక్కజొన్న రైతుల కోసం ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ దళారులు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయడం వల్ల రైతులు మోసపోతున్నారని పేర్కొన్నారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి నిధులివ్వాలి: వాణీదేవి
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు కేటాయించ లేదని, బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతి పట్ల ప్రభు త్వానికి చిత్తశుద్ధి లోపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. మండలిలో బుధవారం జీరో అవర్‌లో ఆమె మా ట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటుతో పాటు విద్యార్థుల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ పథకాన్ని అమలుచేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత కరువు: దేశపతి
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి ప్రొ ఫెషనల్ ట్యాక్స్ వసూలు చేయాలనే నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం జీరో అవర్‌లో ఆయన మా ట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ టీచర్లకు సంక్షేమ, ఉద్యోగ భద్రతను యాజమాన్యాలు పూర్తిగా విస్మరించాయని మం డిపడ్డారు. పనిగంటలు పెంచి శ్రమదోపిడీ చేస్తున్నారని, మెజారిటీ పాఠశాలల్లో పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.
నిధులు, సిబ్బందిని కేటాయించాలి: నవీన్‌కుమార్
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హై దరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు కమిషనరేట్లుగా విభజించడంతో పాలన స్తంభించిందని, అవసరానికి తగిన నిధులు, సిబ్బందిని కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ కోరారు. బుధవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. మూడు కమిషనరేట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి: నవీన్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి కోరారు. షాద్‌నగర్ ని యోజకవర్గంలో ఇండ్లు మంజూరై పునాది తీసిన తర్వాత ఎ మ్మెల్యే ఒత్తిడితో రద్దు చేసిన అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.