బాసర, మార్చి 18 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మృతి చెందిన విద్యార్థిని తేజస్విని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ 500 మందికిపైగా విద్యార్థులు మంగళవారం రాత్రి నుంచి అడ్మినిష్ర్టేషన్ భవనం, వీసీ గెస్ట్‌హౌస్ ఎదుట బైఠాయించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న మెదక్ జిల్లా రాంచంద్రాపూర్‌కు చెందిన తేజస్విని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ట్రిపుల్ ఐటీలో చికి త్స చేయించగా తగ్గకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని గాంధీకి తీసుకెళ్లగా ఈ నెల 16న లుకేమియా వ్యాధితో మృతి చెందినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఏఎస్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలోని వీసీ గెస్ట్‌హౌస్ ఎదుట మంగళవారం రాత్రంతా రోడ్డుపైనే ఆందోళనకు దిగి అక్కడే నిద్రించారు. బుధవారం ఉదయం వేకువ జామున ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై వైస్ చాన్స్‌లర్ గోవర్ధన్‌తో సమావేశమై చర్చించారు. ఎస్పీ సూచనల మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు. యూనివర్సిటీ అడ్మినిష్ర్టేషన్ తమ సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంలో ఎస్పీ సహకరించడంతో విద్యార్థులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ దుర్భాషలాడినట్టు వీడియో వైరల్
విద్యార్థినులపై ఎస్పీ జానకీ షర్మిల దుర్భాషలాడినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. విద్యార్థులను పోలీసులు దూషించారని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవమని నిర్మల్ పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. ఎస్పీ వాయిస్ మార్ఫింగ్ చేసి తప్పుదారి పట్టించేలా ఆ వీడియో ఉన్నదని, ఈ ప్రచారాన్ని విద్యార్థులు, ప్రజలు నమ్మవద్దని పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎస్పీ దూషించినట్టు సోషల్ మీడియాలో తాము ఎలాంటి వీడియోలను ప్రచారం చేయలేదని విద్యార్థులు కూడా ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎస్పీ రాజేశ్వర్‌ను డీజీపీ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్‌కు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భైంసా ఏఎస్పీ రాజేశ్మీనన్కు ఇన్చార్జి డీఎస్పీ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.