– మహిళల ఆర్థిక సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
బీబీనగర్, జూలై 24 : బీబీనగర్ మండల మహిళా సమాఖ్యతో పాటు బీబీనగర్ 4వ గ్రామ సంఘం శ్రీ వెంకటేశ్వర గ్రామ సంఘాలను ఎన్ఆర్ఎల్ఎం బృందం శుక్రవారం సందర్శించి సంఘాల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించింది. సంఘ సభ్యులు తీసుకున్న రుణాల వినియోగం, వాటి ద్వారా సాధించిన అభివృద్ధి, జీవనోపాధి పురోగతిపై సభ్యులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విజన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో గ్రామ సంఘాల అభివృద్ధి ప్రణాళికలు, గ్రామ సంఘాల లక్ష్యాలు, సభ్యుల ఆకాంక్షలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మండల సమాఖ్య సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, పుస్తకాల నిర్వహణ, డిజిటల్ లావాదేవీల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ మహిళలు చేపడుతున్న జీవనోపాధి, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ఎన్ఆర్ఎల్ఎం బృందం అభినందించారు. మహిళా సంఘాలు మరింత బలోపేతమై గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఎల్ఎం బృందం సభ్యులు మొహమ్మద్ దర్శన్, గిరీష్ ప్రధాన్, సెర్ప్ డైరెక్టర్ నవీన్ కుమార్, ఎస్పీఎం స్వర్ణలత, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రజావాణి, డీపీఎం ప్రభాకర్, ఏపీఎం మీనా, సీసీలు శ్రీలత, నర్మద, పరిశ్రమ సమతతో పాటు గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.