– సీఐటీయూ, అంగన్వాడీ యూనియన్ నాయకుల డిమాండ్
– నల్లగొండలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన
రామగిరి, జూలై 24 : కష్టపడి పనిచేస్తున్న బీఎల్ఓ (BLO)లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ అవుట రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలు చేతబూని నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఎల్ఓలు డ్యూటీలు చేయరని, కూర్చున్నా, నిద్రపోయినా అకౌంట్లో జీతాలు పడతాయని నిండు సభలో సీఎం అవహేళనగా మాట్లాడటం బాధాకరం అన్నారు. బీఎల్ఏలకు ఉత్తేజం నింపాలనుకుంటే ఇవ్వాలి కానీ, బీఎల్ఓలను బలి పశువులను చేస్తూ అవాకులు చవాకులు మాట్లాడటం సీఎం పదవిలో ఉన్న వారికి తగదు అని మండిపడ్డారు.
రాష్ట్రంలో 84 శాతం ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తి చేసింది బీఎల్ఓలేనని గుర్తు చేశారు. కనీస వేతనాలు లేకుండా గౌరవ వేతనాలతో పని చేస్తున్న అంగన్వాడీ, ఆశా, ఆర్పీ, వీవోఏలకు ఎలాంటి అదనపు వేతనం ఇవ్వకుండా బీఎల్ఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు పి.సరిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సునంద, పాడురి లక్ష్మి, మణిరూప, యాదమ్మ, జి.కృపావతి, కె.సరోజ, రేణుక, అరుంధతి, అనిత, పల్లవి, విజయకుమారి, జి.పద్మ పాల్గొన్నారు.