న్యూఢిల్లీ: కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ మధ్య కీలక మార్గంలో 3, 4వ రైల్వే లైన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ చేసింది. (Karnataka-Andhra Rail Route) కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు రైల్వే డివిజన్లలో 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణ ప్రాజెక్స్ను రూ. 1,264 కోట్లతో చేపట్టనున్నారు. 2028-29 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రతిపాదించారు.
కాగా, కర్ణాటక, ఆంధ్రాలోని మూడు జిల్లాల గుండా సాగే ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ రైల్వే నెట్వర్క్ సుమారు 46 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఏడు లక్షల జనాభా కలిగిన సుమారు 99 గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుంది. బళ్లారి కోట, కుమార స్వామి ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
అలాగే ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, ఇనుము, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటి సరుకుల రవాణాకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ఒక కీలక మార్గంగా ఉంటుంది. ఏటా అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.