హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రూ. 22,700 కోట్లు రుణం తీసుకుంటూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 8.32% వార్షిక వడ్డీ రేటుతో రుణం తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు ప్రభుత్వ గ్యారంటీతో మార్క్‌ఫెడ్ రుణం తీసుకొని ఆ నిధులను సివిల్ సప్లయ్‌కి అందించనున్నది. అప్పు ద్వారా తీసుకొచ్చిన నిధులతో సివిల్ సప్లయ్ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు చేయనున్నది. ఈ సీజన్లో సుమారు 95 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.