హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌బోర్డు చెలగాటమాడుతున్నదా?.. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నదా?.. అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని మమ అనిపించేస్తున్నారా.. అంటే నిజమనే సమాధానాలొస్తున్నాయి. మూల్యాంకనాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులు హడావుడి చేయడమే ఇందుకు నిదర్శనం. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 4న సంస్కృతం పేపర్‌తో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులను ఏర్పాటు చేసి మూల్యాంకనం చేయిస్తున్నారు. మూల్యాంకన క్యాంపు వేళలను పెంచారు. ఎగ్జామినర్లకు రోజుకు 45 పేపర్లు ఇస్తున్నారు. వేగంగా మూల్యాంకనం చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇలా హడావుడిగా మూల్యాంకనం చేయించడంపై లెక్చరర్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 26వ తేదీకల్లా మూల్యాంకనాన్ని పూర్తిచేయాలని తమపై ఒత్తిడి పెంచుతున్నారని లెక్చరర్లు వాపోతున్నారు. రోజుకు 30 పేపర్లు ఇవ్వాల్సి ఉండగా, 45 పేపర్లు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మమ అనిపించేస్తున్నారంతే..
24 పేజీల బుక్లెట్. ఒక్కో పేజీకి కనీసంగా అర నిమిషం తీసుకున్నా.. ఒక పేపర్ దిద్దాలంటే 10-12 నిమిషాలు పడుతుంది. ఇక జవాబులను పరిశీలించడమే కాదు.. మొత్తం మార్కులను లెక్కించాలి. మార్కులు బంబ్లింగ్ చేయాలి. ఇందుకు మరో రెండు మూడు నిమిషాలు పడుతుంది. స్పీడ్‌గా చేస్తే 15 నిమిషాలు. కానీ త్వరగా చేయాలన్న ఆదేశాలతో ఒక్కో జవాబుపత్రాన్ని ఆరేడు నిమిషాల్లోపే పూర్తిచేయాల్సి వస్తుందని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని టార్గెట్లు పెడుతున్నారని అంటున్నారు. క్యాంపుల్లో సరిపడా స్టాఫ్ కూడా లేరని, ఉన్న వారితోనే మమ అనిపించేస్తున్నారని వాపోతున్నారు.
పండుగ పూట సైతం..
మూల్యాంకన క్యాంపుల వేళలు పెంచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగాల్సిన క్యాంపు సమయాన్ని 9 గంటల నుంచి 5:30కు పొడిగించారు. ఖమ్మం జిల్లాలో ఉదయం 9గంటలకే మూల్యాంకన క్యాంపు ప్రారంభమైనట్టు లెక్చరర్లు వాపోయారు. ఒక్కో పేపర్ మూల్యాంకనం చేసేందుకు 15 నిమిషాలు పడుతుందని, కానీ.. తొందరపెడుతున్నారని అధ్యాపకులు అంటున్నారు. రోజు ఉదయం 15, మధ్యాహ్నం 15 పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉండగా, కొన్ని క్యాంపుల్లో 45 పేపర్లు ఇస్తున్నారని అంటున్నారు. సూర్యాపేట జిల్లాలో పేపర్ల సంఖ్యను పెంచినట్టు అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నెలలోనే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగలున్నాయి. ఈ పండుగలకు సెలవులు ఇవ్వకుండా మూల్యాంకనం చేపడుతున్నట్టు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హడావుడిగా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నది.