Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. పదేండ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రేపోమాపో మంత్రి వర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్తరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, శుక్రవారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేస్తూ ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లారు.
ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మంత్రి వర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే నిర్ణయం అని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ కోసం తాను ఎవరి పేర్లు ప్రతిపాదించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయన్నారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం ఉండదని స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చిందని, ఒకటి, రెండు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యం అని చెప్పారు.
తాను లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీతో తన అనుబంధం తెలియని వారు మాట్లాడితే నాకేం సంబంధం అని ప్రశ్నించారు. ప్రతి విమర్శకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని కుల గణన చేపట్టామని, దీనివల్ల ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కుల గణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారని అన్నారు. బీసీలు పెరిగిన విషయం పాయల్ శంకర్ లెక్కలతో సహా చూసిన తర్వాతే అసెంబ్లీలో ఒప్పుకున్నారని చెప్పారు.