RSP | హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలు ఎంతో ఎత్తుకు ఎదిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మన గురుకులాలను ఆదర్శంగా తీసుకున్నాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల వ్యవస్థపై అధ్యయనం చేశాయి. నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ.. అన్ని రకాల వసతులు కల్పించారు. ఇక గురుకుల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీట్లను సాధించి, ఉన్నత చదువులు చదివారు. గురుకులాల్లో విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు, పైలట్లుగా ఎదిగారు. అలాంటి గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక గురుకులంలో విద్యార్థులు ధర్నాలకు దిగుతున్న పరిస్థితి. మౌలిక వసతుల కల్పన కోసం, నాణ్యమైన విద్య, భోజనం కోసం విద్యార్థినులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆకాశానికి ఎగిసిన గురుకులాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధోపాతాళానికి తొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మొన్న శంషాబాద్, నిన్న గౌలిదొడ్డి, నేడు తంగళ్లపల్లి గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. నిత్యం మా పిల్లలు రోడ్ల మీద కొట్లాడుతూనే ఉండాల్నా..? అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, భట్టి విక్రమార్కను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.
గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే.. విద్యార్థినులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. రుతుస్రావంలో ఉన్న విద్యార్థినుల బట్టలు విప్పించి ఓ పీఈటీ టీచర్ చితకబాదింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జ్యోత్స్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుపడ్డారు. పీరియడ్స్ కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పీఈటీ వినిపించుకోలేదు. బాత్రూమ్లోనే బాధిత విద్యార్థినుల బట్టలు విప్పించి, కర్రతో చితకబాది వీడియోలు తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు.
పీఈటీ జ్యోత్స్న నిత్యం తమను వేధిస్తోందంటూ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. పీఈటీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఈటీ జ్యోత్స్న అరాచకాలపై ప్రిన్సిపాల్‌కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
This is outrageous…
ఆకాశానికి ఎగసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నరు…
మొన్న షంషాబాద్, నిన్న గౌళిదొడ్డి, నేడు తంగళ్లపల్లి…
ఎన్నడూ మా పిల్లలు రోడ్ల మీద కొట్లాడుతూనే ఉండాల్నా,@revanth_anumula గారూ?@seethakkaMLA గారూ, @Bhatti_Mallu గారూ మీరెక్కడున్నారు?@KTRBRS @BRSparty https://t.co/BPpCkjA8T5— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 12, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..?