అయిజ, జూలై 25 : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోజు ఎక్కడో ఓ చోట దాడులు(Dog attack) చేస్తూ ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి(Boy injured) గాయపర్చిన ఘటన జోగుళాంబ గద్వాల(Gadwala dist) జిల్లా అయిజ పట్టణంలో గురువారం చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. అయిజ పట్టణంలోని కర్నూల్ రహదారిలో హోటల్ నడుపుతున్న మాధవి, భీమేశ్వర్రెడ్డి దంపతులకు కుమారుడు నిహాన్రెడ్డి ఉన్నారు.
కాగా, హోటల్ ఎదుట ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడు నిహాన్రెడ్డిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు కుక్కలను తరిమి చిన్నారిని కర్నూల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. మున్సిపాలిటీలో కుక్కలు అధికంగా ఉన్నాయని, వాటిని పట్టుకొని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.