కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 10 : డ్వాక్రా మహిళా సంఘానికి రుణం ఇప్పించినందుకుగాను లంచం అడిగిన కమ్యూనిటీ ఆర్గనైజర్(సీవో) మురళి ఏసీబీ అధికారులకు చిక్కాడు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట సర్కిల్లోని ప్రాజెక్ట్ విభాగంలో మురళి కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డ్రాక్రా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించడంలో భాగంగా.. ఓ డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘానికి రెండు లక్షల రుణం ఇప్పించాడు.
ఈ పని చేసిందుకు గాను.. 10 శాతం కమీషన్‌గా రూ.20 వేలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేయడంతో వారు రూ.18 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మరోవైపు మహిళా సంఘం సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మంగళవారం మూసాపేట సర్కిల్ కార్యాలయంలో సీవో మురళి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుతో సర్కిల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఏమైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.