హైదరాబాద్ : మూసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. సోమవారం ఆయన కరీనంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హైడ్రా (Hydraa)పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను హింసిస్తుందన్నారు. ఎన్నో ఏండ్లుగా పన్నులు చెల్లిస్తూ నివాసముంటున్న పేదల ఇండ్లను కూల్చివేయడం దారుణమన్నారు. పేదల ఇండ్ల కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని పేర్కొన్నారు.
మా ప్రాణాలు తీశాకే పేదల ఇండ్లు కూల్చాలన్నారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని పాలన చేయాలని హితవు పలికారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా సింగిల్గానే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. హైడ్రా బాధితులకు (Hydraa victims) అండగా ఉంటామన్నారు. కాగా, హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. భవనాల కూల్చివేతలపై బాధితులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.