మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 08:21:19

దంత వైద్యుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన ఏపీ పోలీసులు

దంత వైద్యుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన ఏపీ పోలీసులు

రంగారెడ్డి : రాజేంద్ర నగర్‌ పరిధిలో మంగళవారం దంత వైద్యుడు, స్థిరాస్తి వ్యాపారి బెహజాట్‌ హుస్సేన్‌ కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. హిమాయత్‌ సాగర్‌ దర్గా సమీపంలో ఆయనను బురఖాలో వచ్చిన దుండగులు కారులో కిడ్నాప్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సరిహద్దు రాష్ట్ర పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం కిడ్నాపర్లు అనంతపురం జిల్లా మీదుగా వెళ్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు సమాచారం రావడంతో ఆయన రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు.

రాప్తాడు జాతీయ రహదారిపై కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కిడ్నాపర్లు వైద్యుడి కాళ్లు, చేతులు కట్టేసి. కళ్లకు గంతలు కట్టి కారులో బెంగళూర్‌ వైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం. వీరిని పట్టుకునేందుకు పది మంది ప్రతేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పట్టుబడిన వారి వద్ద డమ్మీ తుపాకీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. హుస్సేన్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు ఇప్పటికే రాప్తాడుకు బయల్దేరారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.