Ashram school | కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అమ్మాయిలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. బాధిత విద్యార్థినులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఫుడ్ పాయిజన్‌పై ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, మెనూ ప్రకారం భోజనం తయారు చేయాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నతాధికారులు హాస్టల్‌ను పరిశీలించి, మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు.
ఆశ్రమ పాఠశాల హాస్టల్ నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు, పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. హాస్టల్ వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్లో మొత్తం 591 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా భయంతో చాలా మంది విద్యార్థినులు తమ నివాసాలకు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం హాస్టల్లో 100 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
MHSRB | నవంబర్ 10న ల్యాబ్ టెక్నిషీయన్ గ్రేడ్-II పోస్టులకు రాతపరీక్ష
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎండీ హోమియో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Karthika Masam | వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ.. భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రం..