Karthika Masam | వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానమాచరించి తమ ప్రీతికరమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులు ఆలయంలో నిర్వహించుకునే అభిషేక పూజలు, అన్నపూజలు, ఆకులపూజలు రద్దు చేశారు.
భక్తులు తండోపదండలుగా క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకున్నారు. రాజన్న దాదాపు 90వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారని, రాజన్నకు సుమారు రూ.38 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆల ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాటు చేశారు.
ఆలయ అనుబంధ దేవాలయాలైన భీమేశ్వర స్వామి, బద్ది పోచమ్మ, నగరేశ్వర స్వామి వారి ఆలయాల వద్ద భక్తులు క్యూ లైన్లో నిలబడి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తరించారు. పట్టణంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పట్టణ సీఐ వీరప్రసాద్ గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.