వేములవాడ రూరల్, అక్టోబర్ 25 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) మున్సిపల్ పరిధి శాంతినగర్ సమీపంలో కోతుల మంద(Monkeys died) అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం శాంతినగర్ శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వైపు వెళ్లిన వ్యక్తులకు దుర్వాసన వచ్చింది. అటుగా వెళ్లి చూస్తే దాదాపు 40 నుంచి 50 కోతులు మృతిచెంది ఉన్నాయి. విష ప్రయోగం చేసిన తర్వాత చనిపోయిన కోతులను ఇక్కడికి తెచ్చి రెండు కుప్పలుగా ఒకదానిపై ఒకటి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రెండ్రోజుల కింద ఘటన జరిగినట్లు తెలుస్తున్నదని, కోతుల చంపాల్సిన పని ఏముందని హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషప్రయోగం చేసిన వారెవరో అధికారులు కనిపెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృత్యువాత పడ్డ కోతులను అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది వాహనంలో తీసుకెళ్లారు. కాగా, ఘటనపై వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ విచారణ చేపట్టారు.