ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:27:00

మరో 730 కేసులు

మరో 730 కేసులు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 659 మందికి పాజిటివ్‌
  • ఏడుగురు మృతి.. మొత్త ం 3,731 మంది డిశ్చార్జి
  • కాంగ్రెస్‌ నేత వీ హనుమంతరావుకు కరోనా
  • లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కేసుల పెరుగుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో  ఆదివా రం ఒక్కరోజే 730 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 659, జనగామ జిల్లాలో 34 ఉన్నాయి. రంగారెడ్డిలో 10, మేడ్చల్‌ మల్కాజిగిరి 9, వరంగల్‌ 6, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 3, వికారాబాద్‌ 2, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్‌, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,802 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 210 మంది మరణించారు. మొత్తం 57,054 నిర్ధారణ పరీక్షలుచేయగా, 49,252 మందికి నెగెటివ్‌గా తేలింది. ఆదివారం ఒక్కరోజే 3,297 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు చికిత్స అనంతరం మొత్తం 3,731 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

సడలింపులతో విజృంభణ

లాక్‌డౌన్‌ సమయంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో శ్రమించింది. ప్రజలు సైతం ఇండ్లనుంచి బయట అడుగుపెట్టకుండా స్వీయ నియంత్రణ పాటించారు. కేంద్రం సడలింపులు ప్రకటించడంతో వ్యాపారాలు, దుకాణాలు, ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తికి దోహదపడింది. కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో కొందరు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో, సడలింపుల అనంతరం నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది. 

కాంగ్రెస్‌ నేత వీహెచ్‌కు పాజిటివ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావుకు కరోనా సోకింది. ఆయనను జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖానకు తరలించారు. అధికారులు వీహెచ్‌కు కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇటీవల ఆ పార్టీ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి వైరస్‌ బారినపడ్డారు.

అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్‌లోనే 121 కేసులు

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో కొత్తగా 66 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మొత్తం 370కి చేరాయి. ఆసిఫ్‌నగర్‌లో 55 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

జనగామలో 37 కేసులు

జనగామ జిల్లాలో ఆదివారం 37 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఓ ఎరువుల దుకాణంలో భౌతికదూరం పాటించకుండా పెద్దఎత్తున రైతులు వచ్చి ఎరువులు కొనుగోలుచేసిన సందర్భంగా షాపు నిర్వాహకుడు వైరస్‌ బారినపడ్డారు. దీంతో కరోనా పలు మండలాలకు వ్యాప్తిచెందింది. ఎరువుల దుకాణానికి వచ్చిన రైతుల్లో ఒక్కొక్కరిగా కేసులు బయటపడుతున్నాయి. 

లాక్‌డౌన్‌ కాలం
కేసులు
మార్చి 23- ఏప్రిల్‌ 14
622
ఏప్రిల్‌ 15- మే 3
438
మే 4- మే 17
469
మే 18- మే 31
1,147
జూన్‌ 1- జూన్‌ 21(అన్‌లాక్‌)
5,104

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
ఆదివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
 730
7,802  
డిశ్చార్జి అయినవారు
2253,731
మరణాలు
7
చికిత్స పొందుతున్నవారు
-3,861


logo