Kakatiya Dynasty | లక్షన్నర చెరువుల కింద లక్షణంగా పరిఢవిల్లిన నేల. దేశానికే కొత్త నాట్యశాస్త్రాన్ని అందించిన రాజ్యం. పౌరుషాగ్నికి పాలుపోసి ఆత్మగౌరవాన్ని ప్రతి గడపకూ పంచిన ప్రభుత. సకల కళారూపాలను ఆదరించి, ఆశీర్వదించి పోషించిన జనత. సంస్కరణలకు ఆద్యులుగా నిల్చిన మానవీయ పాలకులు. ఏ విధంగా చెప్పుకొన్నా… ఎన్నందాలా చాటుకున్నా ఆ ఘనత అంతా కాకతీయులదే!
300 సంవత్సరాల పాటు.. అంటే 11వ శతాబ్దం నుంచి 1323 వరకు రాజరిక వ్యవస్థకు మానవీయస్ఫూర్తిని అద్ది మనిషిని నిలబెట్టిన పాలకులు కాకతీయులే. కాబట్టే, తెలంగాణ ప్రజానీకం ఇప్పటికీ కాకతీయులను తలుచుకుంటున్నది. రుద్రమ్మ కీర్తిని కొనియాడుతున్నది. గణపతిదేవుడి శౌర్య ప్రతాపాలను గుర్తుచేసుకుంటున్నది. ఆ గత వైభవ ఘనకీర్తులను నలుదిశలా చాటుతూ.. జూలై 7 నుంచి తెలంగాణ సర్కారు కాకతీయ ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహిస్తున్నది. మలి కాకతీయుల కాంతిరేఖ.. రెండవ కాకతీయ వారసుల్లో 22వ పాలకుడు.. కమల్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయను ముత్తాతలేలిన మహాసామ్రాజ్యానికి ఆహ్వానిస్తున్నది. ఈ సందర్భంగా ఓరుగల్లు విజయం నుంచి బస్తర్ వరకు కాకతీయుల ప్రస్థానం గురించి సంక్షిప్త పరిచయం..
చరిత్రను తిరగేస్తే పునాదులు-సమాధులు-కట్టడాలు -పడగొట్టడాలు.. విజేతల నవ్వులు-విజితుల ఏడుపులు-రక్తపాతాలు-రసకందాయాలే అనుకుంటారు అందరూ. చరిత్ర అంటే.. పుస్తకాల పుటలు కాదు. మన బతుకు మూలాలు, మన జీవకళలకు అది ఆలంబన. ఆ శిథిలాల్లోనే మన పూర్వికుల గాథలు ఉండేవి. ఆ శాసనాల్లోనే మన తాతల తలరాతలు ఉండేవి. ఎంత తవ్వినా తరగని గనిగా, ఎంత తోడినా ఒడువని నిధిగా సవాలు విసురుతూనే ఉంటుంది. తెలంగాణ చరిత్ర విస్మృతమైంది, విస్తారమైంది. అతి విలువైంది కూడా! అది చరిత్రకు అందని విషయాల ఖజానా.
కాకతీయులంటే తెలుగు నేల సింహభాగాన్ని పాలించిన ఒకానొక రాజవంశం ఎంతమాత్రమూ కాదు. వారి పాలన ఒక స్వర్ణయుగం. పరిపాలనకు మానవీయ కోణం అద్దిన మహోన్నత సందర్భం. వారి జనావాసాల నిర్మాణం విశిష్టంగా ఉండేది. కోవెల, కొలనుతో కూడిన ప్రణాళికతో గ్రామాల నిర్మాణం జరిగింది. టెంపుల్, ట్యాంక్, టౌన్‌గా.. ఈ ప్రణాళికను మూడు ‘టీ’ల సూత్రంగా చెప్పుకోవచ్చు. రామప్ప గుడి, రామప్ప చెరువు, పాలంపేట గ్రామం ఇలా ఉండేది వారి ఆవాసాల ప్రణాళిక. నేల సస్యశ్యామలంగా ఉండాలి. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లి, సాంస్కృతికంగా ఎదగాలనేది కాకతీయ పాలకుల ఆకాంక్ష. అక్కడితో ఆగలేదు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా వికాసం కోసం దేవాలయాలను నిర్మించారు. మంచినీరు, సాగునీరు కోసం సముద్రాలను పోలిన చెరువులను గొలుసుకట్టు పద్ధతిలో అభివృద్ధి చేశారు. అంతేకాదు, శత్రు దుర్భేద్యమైన కోటగోడలు రాజ్యరక్షణకు ఎంత అవసరమో, ప్రజలు నివసించడానికి చక్కటి నగర ప్రణాళిక కూడా అంతే అవసరమని ఆలోచించిన గొప్ప పాలకులు కాకతీయులు. కాకతిపురంలోని కాకతమ్మను పూజించడం వల్లనే కాకతీయులుగా చరిత్రలో నిలిచిపోయారని కొందరి వాదన. ఓరుగల్లు కోటకు చేరువలో ఉన్న కాకతిపురం వాసులు కాబట్టే కాకతీయులనే వాదన మరికొందరిది. ఏది ఏమైనా కాకతీయుల చరిత్ర చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ‘సింహాలు తమ చరిత్ర తామే రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్రగా నిలిచిపోతుంది’ అని చెప్పిన ప్రసిద్ధ నైజీరియన్ రచయిత చినువా అచిబే మాటలు అక్షర సత్యాలని అనిపిస్తాయి.
రాష్ట్రకూటులకు సామంతులుగా పాలన మొదలుపెట్టిన కాకతీయులు కర్ణాటక నుంచి వలస వచ్చిన వారని కొందరి వాదన. అయితే మా(ం)గల్లు దానపత్రాల ప్రకారం తూర్పు చాళుక్య రాజులకు కాకతీయులు సామంతులని, వారి వంశస్థాపకుడు కాకతి వెన్నయ అని తెలుస్తున్నది. ఢిల్లీ సుల్తానుల దాడుల్లో రెండో ప్రతాపరుద్రుడితోనే కాకతీయ వంశం కనుమరుగైందని అనుకుంటారు. కానీ, ఇక్కడ నిష్క్రమించినా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రతాపరుద్రుని సోదరుడు అన్నమదేవుడితో కాకతీయుల రెండో పాలన మొదలైంది. అది 700 ఏండ్లపాటు… 1966 వరకూ కొనసాగిందంటే చారిత్రక వైచిత్రే. రాజరికాలు పోయి ప్రజాస్వామ్య యుగం వచ్చినా కాకతీయ వంశస్థుడిని ఇంకా దైవాంశ సంభూతుడిగా చూడటం- వారు సైతం ప్రజల్ని కన్నబిడ్డలుగా కాపాడుకోవడం ఇప్పటి నాగరికులకు అర్థంకాని అంశాలే. రెండవ ప్రోలరాజు కాలంలో రాజ్యాధికారాన్ని చేపట్టిన ఓరుగల్లు కాకతీయులు ‘అప్రతిహత విక్రమ చక్రవర్తుల’ని, తెలుగు దేశాన్నంతటినీ అధీనంలోకి తెచ్చుకొని ఏలిన అచ్చ తెలుగు దేశీయులని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
కాకతీయ తొలి చక్రవర్తి రుద్రదేవునికి పుత్ర సంతానం లేకపోవటంతో, ఆయన సోదరుడు మహాదేవుడు రాజయ్యాడు. ఆయన కొడుకే గణపతిదేవుడు. మహాదేవుడు నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకొని, పరిష్కరించే జనరంజక పాలకుడు. ఆ మంచి పేరును చూసి తట్టుకోలేని దేవగిరి రాజు జైతుగి గణపతిదేవుణ్ని బంధించి దేవగిరి కోటలో దాచేస్తాడు. కొడుకును విడిపించుకోవటానికి అతి తక్కువ సైన్యంతో వచ్చిన మహాదేవరాజు వీరమరణం పొందాడు. విషయం తెలుసుకున్న సైన్యాధికారులు రాజ్యాన్ని కాపాడుకుంటూనే రేచర్ల రుద్రుడి నాయకత్వంలో దేవగిరి మీద దాడిచేస్తారు. కాకతీయ సేనలు అరివీర భయంకరంగా యుద్ధం చేయడం చూసిన జైతుగి, భయపడిపోయి సంధి చేసుకున్నాడు. ఓడిపోయేకంటే బంధుత్వం కలుపుకోవడమే మేలనుకొని.. గణపతిదేవుడికి తన కుమార్తె సోమలదేవినిచ్చి వివాహం జరిపించాడు. 61 ఏండ్లు పాలించిన గణపతిదేవుడు అపారమైన కీర్తిప్రతిష్ఠలను ఆర్జించాడు.
రుద్రమ్మ భుజశక్తి రాజ్యాలను జయించుకుంటూ వెళ్తున్న గణపతిదేవుడి ధాటికి తాళలేని పాలకుల్లో దివిసీమ పాలకుడు పినచోడుడు కూడా ఒకడు. కానీ ఆయన కుమారుడు జాయప పోరాట పటిమను చూసిన గణపతిదేవుడు, ఆ యువకుడిని తన‘గజసాహిణి’గా నియమించుకున్నాడు. జాయప చెల్లెండ్లు నారాంబ, పేరాంబలను పెండ్లాడాడు. అలానే, శక్తిమంతులైన నెల్లూరు తెలుగు చోడరాజులతో స్నేహం చేశాడు. తూర్పు చాళుక్య కుటుంబానికి చెందిన వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవిని ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఒక స్త్రీ పాలకురాలు కావటం నచ్చని దేవగిరి పాలకుడు మహాదేవుడు ఓరుగల్లు మీద దండయాత్ర చేస్తాడు. ఎన్నిమార్లు దాడి చేసినా రుద్రమ వీరోచిత పోరాటం ముందు నెగ్గలేక తలొగ్గి పారిపోతాడు. ఎనభై ఏండ్ల వయసులో యుద్ధంలో గాయపడి, రెండు వారాల తర్వాత అనుమానాస్పదంగా మరణించింది రుద్రమ. ఆమె మరణం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. తన ముగ్గురు కూతుళ్లకు మూడు కులాలవారితో వివాహం జరిపించి విశాలతను చాటుకున్న గొప్ప పరిపాలకురాలు రుద్రమ.
1323లో రెండో ప్రతాపరుద్రుడి మరణం తర్వాత మిగిలిన కాకతీయ వంశస్థులు ఓరుగల్లు నుంచి బస్తర్ జిల్లా దంతెవాడకు చేరుకున్నారని.. ఒక సంవత్సరం తర్వాత, 1324లో ప్రతాప
రుద్రుడి సోదరుడు అన్నమదేవుని నేతృత్వంలో రెండవ కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారులు అంటారు. ఈ రాజ్యం 13,000 చ.కి.మీ. విస్తరించింది. రాజరిక వ్యవస్థలో ఉంటూనే, ప్రజారంజకంగా ఏలారా పాలకులు. అలా 600 ఏండ్లపాటు 20 మంది కాకతీయ రాజులు పరిపాలించినట్లు తెలుస్తున్నది. వీరు కాకతీయులే అనడానికి 1940 నాటి బ్రిటిష్ ప్రభుత్వ మెమొరాండం, 1960లో ప్రవీర్ చంద్ర భంజ్‌దేవ్ కాకతీయ వంశానికి చెందినవాడే అని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ధారణ పత్రం ఆధారంగా నిలుస్తాయి.
కాకతీయులైతే పేరులో ‘భంజ్‌దేవ్’ ఎలా వచ్చింది? వీరు అసలు కాకతీయ వంశస్థులే కాదని వాదించినవారూ ఉన్నారు. 1891-1921 మధ్యకాలంలో బస్తర్ ప్రాంతాన్ని పాలించిన రుద్రప్రతాప్ దేవ్‌కు మగసంతానం లేదు. ఆయన తన కూతురు ప్రఫుల్ల కుమారిదేవిని ఒడిశాలోని మయూర్భంజ్ పాలకుడు ప్రఫుల్ల కుమార్ భంజ్‌దేవ్‌కు ఇచ్చి పెండ్లి చేశాడు. వారు బస్తర్‌కు ఇల్లరికం రావటం వల్ల కాకతీయ వంశస్థుల పేర్ల వెనుక భంజ్‌దేవ్ చేరిందని యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య సాధికారికంగా నిరూపించాడు. 18వ పాలకుడైన ప్రతాపరుద్రదేవుడు ప్రఫుల్ల కుమారీదేవి పుత్రుడే. ఆదివాసీల తరఫున పోరాడిన ప్రవీర్ చంద్ర భంజ్‌దేవ్, 1966 మార్చి 25న పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత విజయ్ చంద్ర భంజ్‌దేవ్, భరత్ చంద్ర భంజ్‌దేవ్ బస్తర్ పాలకులుగా వచ్చారు. ఇప్పుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ పాలన సాగుతున్నది.
తన నేతృత్వంలోని ‘టార్చ్’ సంస్థ ద్వారా కమల్ చంద్ర భంజ్‌దేవ్.. కాకతీయ వారసత్వంపై ఒక డాక్యుమెంటరీ తీశారు. 100 రోజుల పాటు రవీంద్రభారతిలో ఫొటో ఎగ్జిబిషన్‌ను, బస్తర్ దసరా వేడుకల్లో 15 రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేశారు. హరిత కాకతీయ హోటల్లో 3 రోజులపాటు కాకతీయ సామ్రాజ్యం విశేషాల ఛాయాచిత్ర ప్రదర్శన జరిపారు. ఇప్పుడు, ఏకంగా కాకతీయుల 22వ వారసుణ్ని వరంగల్లుకు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. దాదాపు ఏడువందల ఏండ్ల తర్వాత.. రెండవ కాకతీయ వారసుల్లో 22వ పాలకుడు.. కమల్ చంద్ర భంజ్‌దేవ్ వరంగల్లు గడ్డ మీద కాలు మోపబోతున్నారంటేనే.. ఒళ్లు పులకరిస్తున్నది. ‘నడిచే దేవుడి’గా బస్తర్ ప్రజలు గౌరవించే కాకతీయ వారసుడిని మన రాష్ట్రానికి ఆహ్వానించడం గొప్ప విషయం. విద్యావంతుడిగా, గొప్ప మానవీయ విలువలు కలిగిన పాలకుడిగా పేరొందారు కమల్ చంద్ర. లండన్‌లో కావెండ్రి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ డిగ్రీ, యూకేలోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి రాజనీతిశాస్త్ర పట్టా పొందిన ఈయన 12 ఏళ్ల వయసులో రాజుగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర యూత్ కమిషన్ అధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో ఉన్నారు. బస్తర్‌కే పరిమితం కాకుండా ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాల్లో తన ముద్రను వేస్తూనే ఉన్నారు. రాయపూర్ రాజ్‌కుమార్ కళాశాలకు జనరల్ కౌన్సెల్‌గా, జీవితకాల సభ్యుడిగా వ్యవహరిస్తూనే.. బస్తర్‌లో ప్రవీర్ సేన పేరుతో ఒక సంస్థను ఏర్పాటుచేశాడు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూనే, ‘సత్య సమాజ్’ ద్వారా ప్రజల మౌలిక అవసరాలు తీరుస్తున్నారు. గతంలో విధానసభకు స్టార్ క్యాంపైనర్‌గా వ్యవహరించారు.
గణపతిదేవునికి ‘నానావర్ణ వీర మండలీకరగండ’ అనే బిరుదు ఉండేదని చరిత్ర చెబుతున్నది. అందరినీ సమానంగా చూసే గొప్ప హృదయమున్న పాలకుడనే కీర్తి ఆయన సొంతం. అలాంటి సహృదయుడే కమల్ చంద్ర భంజ్‌దేవ్ కూడా. అన్నమదేవుడితో మొదలైన కాకతీయ రెండవ పాలన ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆయువు పోసింది. ‘కాకతీయుల ప్రస్తావన ఈ నవీన కాలంలో ఇంకా అవసరమా?’ అనే ప్రశ్నకు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నారు కమల్ చంద్ర భంజ్‌దేవ్. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతేవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో ఆయన ప్రభావం అపారం. ఇదంతా అటవీ ప్రాంతం. గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. రాజరికం అంతరించినా.. ఆ అమాయకులకు మాత్రం కమల్ చంద్ర చెప్పిందే వేదం. ఆయన మాటే శాసనం.
కాకతీయుల ఆచార వ్యవహారాలను ఇప్పటికీ వారి వారసులు ఆచరిస్తూ ఉన్నారు. 1323లో రాజకుటుంబం ఓరుగల్లును వదిలి వచ్చేటప్పుడు కొందరు బ్రాహ్మణులు, శిల్పులు అభిమానంగా అనుసరించారు. తమతోపాటు వచ్చినవారి వంశాలను ఇప్పటికీ ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు మలి కాకతీయులు. బస్తర్ పాలకులు మృతిచెందినప్పుడు.. వారి చితికి వారసులు నిప్పు పెట్టరు. బ్రాహ్మణులే దహన సంస్కారాలు చేస్తారు. అంతేకాదు, దసరా తొమ్మిది రోజులూ పాలకులు పూజార్లుగా మారిపోయి దంతేశ్వరికి ప్రత్యేక పూజలు చేస్తారు. కమల్ చంద్ర భంజ్‌దేవ్ సైతం పురోహితుల మంగళ శ్లోకాలతోనే నిద్ర లేస్తారు. తిలకధారణ, వస్త్రధారణ, ఆభరణాల ఎంపిక.. అన్నీ రాచరిక సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. ఆ స్వధర్మ పాలనే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష.
ఇప్పటికీ దంతెవాడ బస్తర్ పరిసరాల్లో అనేక శాసనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రెండో కాకతీయ రాజ్యంలో ప్రఫుల్ల కుమారిదేవి కూడా రుద్రమదేవి లాగానే పరిపాలన సాగించింది. ఓరుగల్లు పాలకులు కాకతిదేవిని ఆరాధిస్తే, బస్తర్ పాలకులు దంతేశ్వరి దేవిని పూజిస్తారు. 52వ శక్తిపీఠంగా వెలుగొందుతున్న దంతేశ్వరికి దసరా సంబురాలు 75 రోజుల పాటు చేయటం, ఓరుగల్లులో కూడా కాకతీయులు పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించుకోవటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. వేయిస్తంభాల గుడి లాంటిదే బస్తర్‌లో కూడా చూస్తాం. ఇక్కడి శిల్పుల చాతుర్యాన్ని పోలిన గుడులు, కట్టడాలు వారు కాకతీయ వంశీకులే అని నిర్దిష్టంగా నిరూపిస్తాయి.
ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ మళ్లీ జీవం పోసిన నాట్యం పేరిణి. రామప్ప, నాగులపాడు దేవాలయంలోని శిల్పాకృతులు చూసి ఆ భంగిమలతో ఊపిరిలూదిన నాట్యం పేరిణి. సామ్రాజ్య దండయాత్రలో సిపాయిలకు ఉత్ప్రేరకంగా నిలిచేందుకు ‘పేరిణి’ నృత్యాన్ని ప్రదర్శించేవారని చరిత్రకారులు చెబుతారు. తెలంగాణకు కూడా ఒక ప్రత్యేకమైన ‘నాట్య’ సంప్రదాయం ఉందని చాటడానికే ప్రభుత్వం ‘పేరిణి’కి మంచి ఆదరణ తీసుకొచ్చింది. భాషా సాంస్కృతిక శాఖ దేశంలో ఎక్కడ ఏ ప్రదర్శన జరిగినా ‘పేరిణి’ నృత్యాన్ని ప్రోత్సహిస్తున్నది. దాంతో ఒకప్పుడు పట్టుమని పదిమంది కూడా లేని పేరిణి కళాకారుల సంఖ్య ప్రస్తుతం 1000కి చేరుకుంది. పేరిణి నృత్యాన్ని అంతరించిపోకుండా అరచేతులు అడ్డుపెట్టి కాపాడింది మాత్రం నిస్సందేహంగా తెలంగాణ ప్రభుత్వమే. అందునా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పాలి.
కాకతీయుల దైవభక్తి గురించి చెప్పటానికి వారు నిర్మించిన దేవాలయాలే తార్కాణం. ‘రామప్ప గుడి’కి యునెస్కో గుర్తింపు దక్కడం తెలుగువారికి గర్వకారణం. నీటిలో తేలే ఇటుకలు, నల్లరాతి మదనికలు, సాండ్‌బాక్స్ సాంకేతిక నైపుణ్యం ఇప్పటికీ చూపరులకు విస్మయం కలిగిస్తున్నాయి. కాకతీయుల ఠీవికి దర్పణంగా ఆనాటి వాస్తుశిల్ప వైవిధ్యాన్ని ప్రపంచానికి నివేదిస్తూ రామప్ప దేవాలయం పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నది. ఆనాటి శిల్పుల హస్తకళా నైపుణ్యాన్ని మనకు దర్శింపచేస్తూ.. ఒక శిల్పి పేరునే దేవాలయానికి పెట్టిన విశాల హృదయమున్న పాలకులు కాకతీయులు. ఈ మధ్య స్థపతి ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం నాయకుడు రామోజు హరగోపాల్, యువ చరిత్రకారుడు అరవింద ఆర్య అన్వేషణల్లో ఎన్నెన్నో మెట్లబావులు, శాసనాలు, కట్టడాలు, శిల్పాలు బయటపడుతున్నాయి. వీటిమీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.
» కాకతీయుల చరిత్రలో అక్కడక్కడా కొన్ని లంకెలు తెగిపోయాయి. కొన్ని పుటలు ఖాళీగా మిగిలిపోయాయి. తెగిన లంకెలను అతికించాలి. ఖాళీ పేజీలను పూర్తి చేయాలి. ఆ బాధ్యత చరిత్రకారులదే.
» రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి మరణాలు ఎలా సంభవించాయో తెలియాల్సి ఉంది. ప్రతాపరుద్రుడు శంభులింగంతో సహా గోదావరిలో దూకాడని అంటారు. పరుసవేది ప్రభావం వల్ల రోజూ బంగారం ఇచ్చే మహిమాన్విత శివలింగం కోసం ఫ్రెంచ్ వారు కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ వంకతో ఏనుగు కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి గోదావరిలో తిప్పారని అంటారు. అయితే అవి బంగారంగా మారాయని చెప్తారే కానీ, ఆప్రాజెక్ట్లో పనిచేసిన రెండువేల మంది ఒక్కరోజులోనే ఎలా చనిపోయారన్నది అంతుపట్టని విషయంగా నిలిచిపోయింది.
» శత్రువులు కుట్రపూరితంగా రుద్రమను చంపాలని చూసినప్పుడు ఒక అపరిచిత స్త్రీ వచ్చి కాపాడటం, ఆమెనే కాకతిదేవిగా భావించి కాకతీయులు గుమ్మడి పూలతో పూజించటం.. తదితర జనశ్రుతులు ఎంతవరకు నిజమో తెలియాల్సిన అవసరం ఉంది.
పోరుబాట పట్టిన వీరుల త్యాగఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ప్రభుత్వం తొలుత దృష్టి సారించింది వ్యవసాయ రంగం మీదే. అందుకే దీర్ఘదృష్టితో, శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. చెరువులన్నీ పూడికలతో నిండిపోయి జీవచ్ఛవాలుగా కునారిల్లుతున్న వేళ ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రభుత్వం వాటికి జీవగంజి పోసింది. గొలుసుకట్టు చెరువులతో ఆద్యంతం తమ రాజ్యాన్ని సుసంపన్నంగా, సస్యశ్యామలంగా పాలించిన కాకతీయుల స్ఫూర్తి నచ్చిన, మెచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ‘మిషన్ కాకతీయ’ పేరిట యుద్ధ ప్రాతిపదికన వేలాది చెరువులను నవీకరించారు. దీంతో తెలంగాణలోని చెరువులు, కుంటలు, కాలువలు నిత్యం జలసిరితో నిండుగా నవ్వటం ప్రారంభించాయి. ‘మన ఊరు-మన చెరువు’ అంటూ ప్రతి మనిషీ నడుం బిగించి, ఊరికోసం చెరువును బతికించుకోవాలనే ధ్యేయాన్ని కలిగించాయి. చెరువుల పునరుద్ధరణ ఎంత తక్షణ అవసరమో అప్పుడు జనాలకు అర్థం కాకపోయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత గొప్ప దార్శనికుడో ఇప్పుడు పెరిగిన భూగర్భ జలనిధులు నిరూపిస్తున్నాయి. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణాన్ని పొందుపర్చుకోవటం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కాకతీయుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించింది. బస్తర్ ప్రస్తుత రాజుగా గౌరవం అందుకుంటున్న కమల్ చంద్ర భంజ్‌దేవ్‌ను వరంగల్లుకు పిలిచి సత్కరించటం కూడా గొప్ప సంప్రదాయాన్ని కొనసాగించడంగానే భావించాలి. కాకతీయ ఉత్సవాలను ఖజురహో ఉత్సవాల్లా చేయాలని 2015లోనే ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ కల ఇప్పుడు నిజం అవుతున్నది.
గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు.. ఈ నేలనేలిన మహా మహా పాలకులంతా పుణ్యలోకాల నుంచి.. దివ్య నేత్రాలతో ఈ వేడుకలను వీక్షించి తీరుతారు. కాకతీయ వారసుడిని కళ్లారా చూసుకుంటారు. తమ ఆశయాలను నిజం చేస్తున్న తెలంగాణ పాలకుడిని ‘జయీభవ..
దిగ్విజయీభవ’ అని ఆశీర్వదిస్తారు. జై తెలంగాణ! జై కాకతీయ!
… అయినంపూడి శ్రీలక్ష్మి, 9989928562
ఫొటో సౌజన్యం: అరవింద్ ఆర్య
“Ramappa | రామప్ప అంటే శిల్పి పేరు కాదు.. మరి ఆ పేరెలా వచ్చింది?”
“తాళపత్రాలను ఎలా తయారుచేస్తారు? వాటిపై ఎలా రాస్తే ఎక్కువ కాలం ఉంటాయ్ !!”