Kohinoor Diamond | కోహినూర్ వజ్రం.. పేరు చెప్పగానే భారతీయుల హృదయం ఉప్పొంగుతుంది. అత్యంత ఖరీదైన, అంతే వివాదాస్పదమైన కోహినూర్.. ప్రస్తుతం ఘనత వహించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్- 2 కిరీటంలో కొలువుదీరింది. అయితే, 1937లో పట్టాభిషేకం మొదలుకొని ఇప్పటివరకు కోహినూర్ పొదిగిన కిరీటాన్ని రాణెమ్మ మళ్లీ ధరించనే లేదు. ఆ వజ్రం ప్రస్తుతం మహారాణి అధికారిక నివాసం టవర్ ఆఫ్ లండన్ ( Tower of London )లో ఉంది. కాకతీయుల కాలంలో కొల్లూరు గనుల్లో ఈ వజ్రం దొరికినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ ప్రకారంగా కోహినూర్ తెలంగాణ ఆస్తి. వివిధ దేశాల పురావస్తు కేంద్రాల్లో ఓ మూలనపడున్న శిల్పాలనూ, శిలాఫలకాలనూ తెచ్చి న కేంద్ర ప్రభుత్వం.. లండన్ నుంచి కోహినూర్‌ను కూడా వెనక్కి తీసుకురావాలి. తల్లికి దూరమైన బిడ్డలా.. తెల్లదొరల గల్లాపెట్టెలో బందీ అయిపోయిన జాతి వజ్రాన్ని తెలంగాణ జాతి ఒడికి చేర్చాలి. హైదరాబాద్ కేంద్రంగా ఓ మ్యూజియం ఏర్పాటుచేయాలి.
లండన్‌లో ఏటా జరిగే ‘ద గ్రేట్ ఎగ్జిబిషన్’. బ్రిటన్ను ప్రపంచ కర్మాగారంగా చూపించే ఉద్దేశంతో ప్రిన్స్ ఆల్బర్ట్ ఏర్పాటుచేశాడు. కానీ, ఆ ప్రదర్శన ఎవరినీ ఆకట్టుకోలేక పోయింది. అయితే, ఓ గాజుముద్దను చూడటానికి మాత్రం జనం బారులు తీరి నిల్చున్నారు. అదే, ప్రపంచ ప్రసిద్ధమైన ‘కోహ్ ఇ నూర్’ (కోహినూర్) వజ్రం. పర్షియాలో ఈ పదానికి ‘వెలుగుల కొండ’ అని అర్థం. అయితే, ఏమాత్రం మెరుగుపెట్టని ఆ వజ్రం జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. సానబట్టక పోవడంతో అంతగా మిరుమిట్లు గొలపలేదు. దాంతో ప్రదర్శన తర్వాత ఆల్బర్ట్ దానిని మెరుగు పనివాళ్లకు పంపాడు. అదే ఇప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కిరీటంలో కాంతులీనుతున్నది. మొదట కోహినూర్ కోడిగుడ్డంత పరిమాణంలో ఉండేది. సానబట్టి, సానబట్టి.. ఇప్పుడు సగం మాత్రమే మిగిలింది. అలాగని అదేం ఆంగ్లేయుల అబ్బసొత్తు కాదు. భారతదేశం నుంచి కొల్లగొట్టుకుపోయారు. వలస పాలన దశలో వివిధ పాలిత దేశాల నుంచి కొల్లగొట్టిన పురాతన కళాఖండాలను ఒకప్పటి సామ్రాజ్యవాద దేశాలు వెనక్కి ఇచ్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కోహినూర్‌ను భారత్‌కు రప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత్‌తోపాటు దానితో చారిత్రక సంబంధం ఉన్న అఫ్ఘానిస్తాన్ (నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లో ఉండింది కాబట్టి), పాకిస్తాన్ (రణ్‌జీత్ సింగ్ రాజధాని లాహోర్‌లో తీసుకున్నారు కాబట్టి) కూడా యాజమాన్య హక్కులు కోరుతున్నాయి.
రణ్‌జీత్ సింగ్
18వ శతాబ్దం వరకు వజ్రాలు అంటే భారత ఉపఖండం నుంచే ఉత్పత్తి అయ్యేవి. ఏవో కొన్ని మాత్రం ఇండోనేషియాలోని బోర్నియో కొండల్లో దొరికేవి. కాగా, వీటిని గనుల్లోంచి తవ్వి తీసేవారు కాదు. నదీగర్భంలో మేటవేసిన ఒండ్రుమట్టి నుంచి సేకరించేవారు. షాజహాన్ ముచ్చటపడి చేయించుకున్న మయూర సింహాసనంలో కోహినూర్ పొదిగి ఉండేది. సామ్రాజ్య వైభవం కొడిగడుతున్న దశలో 1739లో.. అప్పటి నామమాత్రపు మొగల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా నుంచి పర్షియా యోధుడు నాదిర్ షా అఫ్ఘానిస్తాన్‌కు కొల్లగొట్టుకుపోయాడు.
అయితే తన కొత్త యజమానికి కోహినూర్ వజ్రం ఏ మాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. కొడుకు చేతిలో తనకు ప్రాణాపాయం ఉందనుకున్న నాదిర్ షా.. నిర్దాక్షిణ్యంగా కొడుకు కండ్లు పెకలింపజేశాడు. వంద సంవత్సరాల తర్వాత, ఆ వజ్రం పంజాబ్ పాలకుడు రణ్‌జీత్ సింగ్ చేతికి చిక్కింది. ఆయన మరణానంతరం 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్‌ను ఆక్రమించుకుంది. సిక్కులతో లాహోర్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా బ్రిటిష్‌వాళ్లు రణ్‌జీత్ సింగ్ 10 ఏండ్ల కొడుకు దలీప్ సింగ్ నుంచి కోహినూర్‌ను గుంజుకున్నారు. అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కోహినూర్‌ను నాటి బ్రిటిష్ సామ్రాజ్ఞి విక్టోరియా మహారాణికి పంపించాడు. ‘తరాలు గడుస్తున్న కొద్దీ భారతదేశ ఆక్రమణకు ఒక చారిత్రక చిహ్నంగా కోహినూర్ నిలిచిపోతుంది. ఇప్పుడు తగిన ప్రదేశంలో కొలువుదీరింది’ అని డల్హౌసీ ప్రకటించాడు కూడా. అయితే కోహినూర్‌ను తాకిన వారిని దురదృష్టం పట్టుకుంటుందనే వదంతులు అప్పటికే వ్యాపించాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు కోహినూర్‌ను లండన్‌కు తరలిస్తున్న నౌకను సముద్రంలో తుఫాన్లు చుట్టుముట్టాయి. ప్రయాణికులు కలరా బారినపడ్డారు. సరిగ్గా కోహినూర్ లండన్‌లో అడుగుపెట్టిన రోజునే, మతిభ్రమించిన ఓ సైన్యాధికారి విక్టోరియా మహారాణిపై దాడి చేశాడు.
దలీప్ సింగ్
కోహినూర్ చుట్టూ అల్లుకున్న కథల్ని అలా ఉంచితే.. బ్రిటిష్ పాలకులు దాన్ని ఓ పదేండ్ల పసిపిల్లవాడి దగ్గరినుంచి తీసుకున్నారన్నది మాత్రం సత్యం. తల్లి నుంచి వేరుచేసిన దలీప్ను ఇంగ్లండ్‌కు తరలించారు. ‘అప్పట్లో భారతదేశంలో చివరి పెద్దరాజ్యం పంజాబ్. కాబట్టి దానిని ముక్కలుముక్కలు చేయాలనుకున్నారు’ అంటాడు సిక్కు పండితుడు గురీందర్ మాన్. ఈ కథలో నిజమైన దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా? అంటే, అది కోహినూర్ చిట్టచివరి యజమాని దలీప్ సింగ్. పంజాబ్ సింహంగా చరిత్రకెక్కిన మహారాజా రణ్‌జీత్ సింగ్, జిందాన్ కౌర్ దంపతుల సంతానం దలీప్ సింగ్. ఆయనను తల్లి జిందాన్ కౌర్ నుంచి విడదీశారు. బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించనందుకు ఆమెను నిర్బంధంలో ఉంచారు. రణ్‌జీత్ సింగ్ కుటుంబంలో బతికి ఉన్న ఒకే ఒక్కడు దలీప్ సింగ్‌ను క్రైస్తవంలోకి మార్చారు. అలా సిక్కుల మనోబలాన్ని దెబ్బతీశారని అంటాడు గురీందర్. ఇంగ్లండ్‌లో ఆయనను లోగిన్స్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆయన విక్టోరియా మహారాణికి అత్యంత ఇష్టుడైపోయాడు. 19వ శతాబ్దంలో ఫ్రాంజ్ జేవియర్ వింటర్‌హాల్టర్ చేత దలీప్ సింగ్ నిలువెత్తు చిత్రపటం గీయించింది విక్టోరియా రాణి. అందులో ఖరీదైన ముత్యాలహారాలు, తలపాగా నుంచి వేలాడుతున్న వజ్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఒక్క కోహినూర్ మినహా!
జిందాన్ కౌర్
ఓసారి విక్టోరియా మహారాణి వజ్రాన్ని దలీప్ సింగ్ ముందు ఉంచారట. అయితే దానిని తాను గుర్తిస్తానో లేదో అన్న సందేహం అతనికి ఉండిపోయింది. చివరికి రాణికి విధేయుడిగా వజ్రాన్ని విక్టోరియానే తీసుకోమన్నాడని ఒక కథనం. ఇక ఆ తర్వాత దలీప్ సింగ్ కోహినూర్‌ను మళ్లీ తాకలేదు. భారతదేశానికి తిరిగి వచ్చేయాలని ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఆ ఆశలు తీరకుండానే 1893లో ప్యారిస్‌లోని ఓ హోటల్లో కన్నుమూశాడు. అప్పటికి తన వయసు యాభై ఏడు. 1937 మే 12న బ్రిటిష్ సామ్రాజ్ఞిగా పట్టాభిషేకం జరుపుకొన్న ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్‌ను పొదిగారు. భవిష్యత్తులో కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం సమయంలో కోహినూర్ మళ్లీ ప్రదర్శనకు రావచ్చు. అప్పుడాయన దానిని తన భార్యకు ధరింపజేయవచ్చు.
నాదిర్ షా
కోహినూర్‌ను భారత్‌కు తరలించాలనే డిమాండ్ కొత్తదేం కాదు. స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే, అంటే 1947లోనే భారత ప్రభుత్వం కోహినూర్‌ను ‘జాతీయ సంపద’ అని ప్రకటించింది. దానిని భారత్‌కు తిరిగి ఇచ్చేయమని బ్రిటన్ను కోరింది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయానికి సమర్పించాలని సూచించింది. అవసాన దశలో మహారాజా రణ్‌జీత్ సింగ్ కూడా జగన్నాథ ఆలయానికే పంపించాలని సూచించడం కాంగ్రెస్ పార్టీ వాదనకు నేపథ్యం. కానీ, రణ్‌జీత్ సింగ్‌కు పరమ విధేయుడైన ఆయన కోశాధికారి మిశ్ బేలీ రామ్ ఆ చివరి కోరిక తీర్చకుండా, దానిని సిక్కు రాజ్యం కోసం అట్టిపెట్టాడు. ఆ తర్వాత వందేండ్లకు బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చినప్పటికీ, రాణి కిరీటంలో కొలువుదీరిన కోహినూర్‌ను వదులుకునేందుకు సిద్ధపడలేదు. దాని అసలైన యజమాని లాహోర్ మహారాజు (దలీప్ సింగ్) స్వయంగా అప్పటి సామ్రాజ్ఞి విక్టోరియా మహారాణికి అధికారికంగా బహూకరించారని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి, దీనిగురించి ఇక చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అప్పటినుంచి కోహినూర్‌ను వెనక్కి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. వలసపాలనలో దేశం దాటివెళ్లిన అపారమైన వారసత్వ సంపద ఇప్పట్లో వెనక్కి వస్తుందనే ఆశలు లేనట్లే.
అహ్మద్ షా అబ్దాలీ
అయితే, 2017లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆఫ్రికా ఖండపు దేశమైన బుర్కినాఫాసోలో తాము తరలించుకుపోయిన ఆయా దేశాల పురాతన కళాఖండాలను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించాడు. అలా కొవిడ్ కల్లోలం మధ్య, అమెరికాలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నేపథ్యంలో ఆఫ్రికా దేశమైన బెనిన్‌కు చెందిన 26 కళాఖండాలను ఫ్రాన్స్ తిరిగి ఇచ్చేసింది. అలాగే నైజీరియాకు చెందిన కొన్ని కళాఖండాలను కూడా తిరిగి ఇచ్చింది. దాంతో విదేశీ బొక్కసాలు, మ్యూజియంలలో మూలుగుతున్న సాంస్కృతిక సంపద స్వదేశాలకు ఎప్పటికైనా తిరిగివస్తుందనే ఆశలు చిగురించాయి.
ఈ ఏడాది (2022)తో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది 75 ఏండ్లు పూర్తవుతాయి. ఈ తరుణంలో కోహినూర్ సహా భారతదేశానికి సంబంధించిన పురాతన సంపదను ఇంగ్లండ్ నుంచి మన దేశానికి తిరిగి రప్పించాలనే వాదన ముమ్మరమైంది. ప్రభుత్వం కూడా ఈ విన్నపాన్ని సానుకూలంగా పరిగణించడంతో కళాఖండాల అంశం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 200కు పైగా వస్తువులు భారత్‌కు వచ్చేశాయి. ఇవేవీ బ్రిటిష్‌వాళ్లు తరలించుకుపోయినవి కాకపోవడం గమనార్హం. అయితే గతంలో చేజార్చుకున్న వాటికి వర్తమానంలో జరగాల్సిన న్యాయానికి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెచ్చుకోవడమే పరిపూర్ణమైన ఉదాహరణగా నిలిచిపోతుంది. 2015లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆక్స్ఫర్డ్ యూనియన్‌లో ఇచ్చిన ఉపన్యాసం వైరల్ కావడంతో కొల్లగొట్టిన వస్తువుల గురించి బ్రిటన్ను ప్రశ్నించడం ఎక్కువైపోయింది.
‘కోహినూర్ వజ్రాన్ని కోల్పోవడం ఆయన (దలీప్ సింగ్)ను అన్నివేళలా గాఢంగా బాధించింది’ అంటారు ‘కోహినూర్ : ద స్టోరీ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఇన్‌ఫేమస్ డైమండ్’ రచయితలు విలియం డాల్రింపుల్, అనితా ఆనంద్. 1847 డిసెంబర్లో తన కొడుకును తననుంచి వేరుచేస్తుంటే జిందాన్ కౌర్ ఎంతో విలపించింది. దలీప్కు అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఎవ్వరూ లేరని, అతణ్ని ఎవరికి అప్పగిస్తారని అడుక్కుంది. అయినా బ్రిటిష్ పాలకుల గుండె కరగలేదు. బ్రిటిష్ వారితో పోరాడమని సిక్కులను ఎంతగానో ప్రాధేయపడింది. అయినప్పటికీ ఎవ్వరూ ఆమె మాట వినలేదు. ప్రతిఘటించే సాహసం చేయలేదు. దలీప్ సింగ్‌ను వేరుచేసిన తర్వాత రాణి జిందాన్ను లాహోర్‌లోని షేఖూపురాలో నిర్బంధించారు. చివరికి తన కొడుకును చూసుకునేటప్పటికి ఆమె చూపును కోల్పోయింది. దాంతో దలీప్ సింగ్ ముఖం, జుట్టును తడిమి తడిమి ఏడ్చింది. ఈ చారిత్రక ఘట్టం ఆధారంగా ఓ సినిమా కూడా వచ్చింది. కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చివేయడం ద్వారా ఆ తల్లి ఆత్మకూ శాంతిని కలిగించవచ్చు.
బ్రిటిష్‌వాళ్లు విధించిన షరతులు పూర్తిగా చదవకుండానే పంజాబ్ చివరి పాలకుడు మహారాజా దలీప్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చాడని, లండన్‌లో ఉంటున్న బాబీ సింగ్ బన్సల్ వాదన. కాబట్టి దానిని సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి ఇచ్చివేయాలనేది ఆయన సలహా. అయితే దీనికోసం భారత ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదన్నది బాబీ ఆవేదన. బ్రిటిష్ ప్రభుత్వంతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఇష్టం లేకనే భారత్ ఇలా వ్యవహరిస్తున్నదని ఆయన అభిప్రాయం.
ఏ రాయికైనా సుదీర్ఘమైన చరిత్ర ఉందీ అంటే అది ‘కోహినూర్’ వజ్రానిదే అయ్యుంటుంది. మొగలుల దగ్గర ఉన్నప్పుడు ఇది కత్తిరించిన ఓ పెద్ద గాజుముద్ద. అంతగా కళాకాంతులు లేని ఈ వజ్రం బరువు 191 క్యారెట్లు. 1852లో లండన్‌లో బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ఆభరణాల తయారీదారు దీనిని మరోసారి కత్తిరించి, మరింత సానబెట్టాడు. దాంతో బరువు 105.6 క్యారెట్లకు చేరుకుంది. ఇక అసలు కోహినూర్ ఎప్పటిది? అంటే, భాగవతంలో శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న ‘శమంతకమణి’నే కోహినూర్‌గా పేర్కొనేవాళ్లూ ఉన్నారు. ఆ మాటకువస్తే క్రీస్తుకు పూర్వం 3200 ఏండ్ల నాటి మెసొపొటేమియా నాగరికతకు చెందిన గ్రంథాల్లోనూ దీని ప్రస్తావన ఉందనీ అంటారు. ఇవన్నీ వివాదాస్పదమే.
కోహినూర్‌ను 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో కృష్ణా నదీతీరంలోని కొల్లూరులో తవ్వి తీసినట్లు తెలుస్తున్నది. చివరి కాకతీయ పాలకుడు రెండో ప్రతాపరుద్రుడు సమకాలీన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో ఓడిపోయి, సంధి చేసుకున్నాడు. సంధి షరతులలో భాగంగా ఢిల్లీకి తరలిపోయిన అపారమైన సంపదలో కోహినూర్ ఒకటి అనేవారూ ఉన్నారు. మరో వాదన ప్రకారం.. అల్లావుద్దీన్ ఖిల్జీ 1304లో దీనిని మాళ్వా రాజు నుంచి స్వాధీనం చేసుకున్నాడు. మాళ్వా రాజుకు అది వంశ పారంపర్యంగా వచ్చిందట. మొదటి పానిపట్ యుద్ధం తర్వాత గ్వాలియర్ రాజు మొగల్ చక్రవర్తి హుమాయూన్కు ఓ వజ్రాన్ని బహూకరించాడనే వాదన కూడా ప్రచారంలో ఉంది. మరికొందరేమో కోహినూర్ వజ్రం కృష్ణా నదీ తీరంలోని కొల్లూరు గనుల్లో దొరికిందనీ అంటారు. దానిని 17వ శతాబ్దంలో గోల్కొండ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు)ను పాలిస్తున్న కుతుబ్‌షాహీ రాజు సంధి ఒప్పందంలో భాగంగా అప్పటి మొగల్ చక్రవర్తి షాజహాన్‌కు బహూకరించాడని కూడా చెబుతారు. ఇవన్నీ కాకుండా ఫ్రాన్స్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ 1665లో పేర్కొన్న ‘గ్రేట్ మొగల్ డైమండ్’ కోహినూర్ వజ్రం కావచ్చనే వాళ్లూ ఉన్నారు.
ఏది ఏమైనప్పటికీ, నాదిర్ షా 1739లో జరిపిన భారతదేశ దండయాత్రలో ఢిల్లీని కొల్లగొట్టి, సుప్రసిద్ధ నెమలి సింహాసనంతో పాటే కోహినూర్‌ను తరలించుకుపోయాడనే విషయం రూఢిగా తెలుస్తున్నది. ఆయన మరణం తర్వాత ఇరాన్, అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలను పరిపాలించిన అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్లింది. తదనంతరం అతని కొడుకు షా షుజాకు సంక్రమించింది. అతని దగ్గరినుంచి పంజాబ్ పాలకుడు రణ్‌జీత్ సింగ్ చేతుల్లోకి వచ్చింది. 1849లో పంజాబ్‌ను బ్రిటిష్ వాళ్లు ఆక్రమించుకున్నారు. అప్పుడు దానిని పంజాబ్ చివరి పాలకుడు, పసిబాలుడైన దలీప్ సింగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. లండన్‌కు తరలించి విక్టోరియా మహారాణికి బహూకరించారు. 1937లో పట్టాభిషేకం అనంతరం ఎలిజబెత్ మహారాణి కోహినూర్‌ను తన కిరీటంలో మధ్యభాగంలో పొదిగించుకున్నారు.
కోహినూర్ ఒక్క భారతదేశమే కాదు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, ఇరాన్ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో చాలామంది ప్రపంచంలో అతిపెద్ద వజ్రం ఇదేననే భ్రమలో ఉన్నారు. కానీ భూమ్మీద ఇప్పుడున్న అతిపెద్ద వజ్రాల్లో దీని స్థానం 90 మాత్రమే. ఇక 2016లో భారత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో అప్పటి సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోహినూర్‌ను మహారాజా రణ్‌జీత్ సింగ్ బ్రిటిష్‌వాళ్లకు ఇచ్చాడని, అంతేతప్ప ‘దొంగతనానికి గురికావడమో, లేదంటే బ్రిటిష్ పాలకులు బలవంతంగా తీసుకోవడమో జరగలేద’ని తెలిపారు. అయితే ఇది నిజం కాదంటారు విలియం డాల్రింపుల్. మొత్తానికి మొగల్ చక్రవర్తి షాజహాన్ నెమలి సింహాసనంలో ‘కోహినూర్’ ఒక భాగంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే షాజహాన్‌కు ముందు కోహినూర్ వివరాలు అంతగా తెలియవు.
ఐరోపా దేశం నెదర్లాండ్స్‌లో అయితే.. దొంగతనంగా తరలించి, తమ మ్యూజియంలలో ఉంచిన కళాఖండాలను, వాటి సొంతదేశాలకు ఇవ్వాలనే విధానం ఉందని ఆ దేశంలో భారత రాయబారిగా పనిచేసిన వేణు రాజమణి అంటారు. కళాఖండాలను బలవంతంగా స్వాధీనం చేసుకుని ఉంటే, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ తదితర దేశాలు తమ వలస పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి దీనిని ఓ అవకాశంగా పరిగణిస్తున్నాయి. అయితే ఒక్కో వస్తువుది ఒక్కో రకమైన చరిత్ర కాబట్టి, ఒకదానికి వర్తించిన విధానం మరో దానికి వర్తించకపోవచ్చని చెబుతారు నెదర్లాండ్స్ రాజధాని ద హేగ్‌లోని మారిట్షుస్ మ్యూజియం జనరల్ డైరెక్టర్ మార్టిన్ గాస్లింక్. కానీ, ఒక్క బ్రిటన్ మాత్రమే కళాఖండాలను వాటి సొంతదేశాలకు తిరిగివ్వడం మీద తన వైఖరి ఏంటో ప్రకటించడం లేదు. “కళాఖండాలకు సంబంధించి రుజువులు ఇవ్వాలని వచ్చిన విజ్ఞప్తులకు ఎప్పుడూ స్పందించదు” అంటారు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ కల్చరల్ లీడర్షిప్, అనంత్ నేషనల్ యూనివర్సిటీ అహ్మదాబాద్‌కు చెందిన యునెస్కో ప్రతినిధి అమరేశ్వర్ గల్లా. ఇవన్నీ అలా ఉంచితే ఒక్క వస్తువును తిరిగి ఇచ్చినా కూడా, తేనెటీగల తుట్టెను కదిపినట్లే అవుతుందన్నది బ్రిటన్ భయం. 2010లో భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్.. ‘ఒక్కదానికి అవును అంటే.. అంతటితో అయిపోతుందా, ఆగిపోతుందా? బ్రిటిష్ మ్యూజియం ఖాళీ అయినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు’ అని తన అభిప్రాయం వ్యక్తంచేశారు.
కొన్నిసార్లు పురాతన వస్తువులను వెనక్కి తెచ్చుకునే విషయంలో ఒప్పందాలు బాగా పనిచేస్తాయి. కానీ, కోహినూర్ విషయంలో ఒప్పందాలు చెల్లుబాటు కాకపోయే అవకాశమే ఎక్కువ అంటాడు రణ్‌జీత్ సింగ్ వంశానికే చెందిన దళీందర్జిత్ సింగ్. అయితే కోహినూర్ సహా తమ వంశస్థుల నుంచి బ్రిటిష్ వాళ్లు తీసుకున్న వస్తువులకు సంబంధించి పర్షియన్ భాషలో ఉన్న అసలు పత్రం తమ దగ్గర ఇంకా ఉందంటాడు సింగ్. కోహినూర్‌ను సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణదేవాలయానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రణ్‌జీత్ సింగ్ వంశస్థులు 2001 మార్చిలో ఎలిజబెత్ రాణికి ఓ లేఖ కూడా పంపించారు. దానికి ‘జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం’ అని బదులువచ్చింది కూడా! ఆ తర్వాత ఆ విషయం అతీగతీ లేదు. ఇక కోహినూర్ విషయంలో స్పష్టమైన దౌత్య విధానం ఏదీ లేదని అంటాడు యునైటెడ్ కింగ్డమ్ భారత మాజీ హైకమిషనర్ నవ్‌తేజ్ సర్నా. ఈయన దలీప్ సింగ్ జీవితాన్ని ‘ది ఎగ్జయిల్’ పేరుతో రచించాడు. సర్నా పేర్కొన్నట్లు ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపితే మంచిది.
కోహినూర్‌ను వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేయగలిగినంతా చేస్తున్నదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాట. కాకపోతే, దీనికి సంబంధించి ఎలాంటి న్యాయపరమైన అవకాశం లేదంటున్నది. పురావస్తు కళాఖండాలకు సంబంధించి 1970లో యునెస్కో కన్వెన్షన్ ఒకటి జరిగింది. దాని ప్రకారం 1970కి ముందున్న వాటికి న్యాయపరమైన మార్గం వర్తించదు. అందుకే ‘న్యాయ పరమైన దారి లేనప్పుడు, దౌత్యమార్గంలోనే విషయాన్ని పరిష్కరించుకోవాల’ని ఏఎస్ఐ పేర్కొన్నది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏండ్లు అయిన సందర్భంగానైనా ప్రభుత్వం ‘కోహినూర్’ను తిరిగి మనదేశానికి తేవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే బాగుంటుంది.
ప్రసిద్ధిచెందిన వజ్రాల్లో ఎక్కువ శాతం వివిధ దేశాల మ్యూజియంలలో ప్రదర్శనలో ఉన్నాయి. కొన్ని మాత్రం వ్యక్తుల యాజమాన్యంలో ఉన్నాయి. కోహినూర్‌కు కవలలా ఉండే ‘దర్యా ఎ నూర్’ వజ్రం (వెలుగుల సముద్రం) ఇరాన్ రాజుల కిరీటంలో ఉండే ఆభరణాల్లో ఒకటి. కాగా కోహినూర్ యునైటెడ్ కింగ్డమ్ రాణి ఎలిజబెత్-2 కిరీటం మధ్యలో కొలువుదీరింది. ఈమె కింగ్ జార్జి-6 కూతురు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నవాటిలో పేరుగాంచిన వజ్రం ‘జూబిలీ’.
కోహినూర్ వజ్రం రెండుసార్లు మాయమైపోయి, మళ్లీ దొరికినట్లు తెలుస్తున్నది. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ తర్వాత ఆయన కొడుకు హుమాయూన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. షేర్ షా చేతిలో ఓడిపోయిన హుమాయూన్ ఇరాన్లో ఆశ్రయంపొందాడు. ఆ సమయంలో ఆయన ఓ నది ఒడ్డున తన నగల సంచిని మరిచిపోయాడు. ఇది మొదటి సందర్భం. అయితే, దానిని గమనించిన ఓ పిల్లవాడు దాన్ని హుమాయూన్కు అందజేశాడట. రెండోసారి 1849లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ‘కోహినూర్’ సంరక్షణ బాధ్యతను పంజాబ్ సామ్రాజ్యం రాజధాని లాహోర్‌లో బ్రిటిష్ ప్రభుత్వ మాజీ రెసిడెంట్ జాన్ లారెన్స్‌కు అప్పగించాడు. ఆయన దానిని తన వెయిస్ట్ కోట్లో పెట్టి మరిచిపోయాడు. ఆరు వారాల తర్వాత డల్హౌసీ కోహినూర్‌ను విక్టోరియా మహారాణికి పంపించడం కోసం ఆరాతీస్తూ లారెన్స్‌కు ఉత్తరం రాశాడు. అప్పుడు దానిని మరిచిపోయిన విషయం గుర్తుకొచ్చిన లారెన్స్ గందరగోళానికి గురయ్యాడట. ఇంట్లో సేవకుడిని తన వెయిస్ట్ కోట్లో ఉన్న చిన్న ఆభరణాల పెట్టె గురించి అడిగాడు. సేవకుడు దానిని వెతికి తీసుకువచ్చాడు. అలా లారెన్స్ కోహినూర్‌ను భద్రంగా విక్టోరియా మహారాణి కోసం లండన్ పంపించాడు.
వెలుగుల కొండగా పేరు గడించిన కోహినూర్ వజ్రాన్ని కలిగి ఉన్నవాళ్లను దురదృష్టం వెంటాడుతుందనే అపప్రథ మూటగట్టుకుంది. వజ్రాన్ని భారతదేశం నుంచి అఫ్ఘానిస్తాన్‌కు తరలించుకుపోయిన నాదిర్షా హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత వజ్రం అఫ్ఘానిస్తాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్లింది. ఆయన ముఖాన్ని క్రిములు పీక్కుతిన్నాయి. ఆ తర్వాత రాజైన షా జమాన్‌ను గుడ్డివాణ్ని చేశారు. మరో పాలకుడు షా షుజాను గద్దె దించారు. రణ్‌జీత్ సింగ్ ఐదుగురు కొడుకులూ చిత్రహింసలకు గురై మరణించారు. ఇక వజ్రాన్ని లండన్‌కు తరలిస్తున్నప్పుడు నౌక తుఫానులో చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు కలరా బారినపడ్డారు. వజ్రాన్ని సానబెట్టేందుకు ప్రయత్నించిన లండన్ డ్యూక్ మరణించాడు. ఇవన్నీ అలా ఉంచితే ప్రస్తుత రాణి ఎలిజబెత్-2 ఇప్పటివరకు ఒక్కసారి కూడా ధరించనేలేదంటాడు విలియం డాల్రింపుల్.
– చింతలపల్లి హర్షవర్ధన్
మన దేశంలో రోజు ఎంతమంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారో తెలుసా !!
తాళపత్రాలను ఎలా తయారుచేస్తారు? వాటిపై ఎలా రాస్తే ఎక్కువ కాలం ఉంటాయ్ !!”