‘నాకే ఎదురు చెబుతావా?’, ‘ఆయన ఎప్పుడు నా మాట విన్నారు గనకా?’, ‘నాకే చెప్పేంత మొనగాడివా?’.. అనే మాటలు తరచూ మీ నోటి వెంట వస్తున్నాయా? అయితే, మీ మనసులో ఈగో గోల మొదలైనట్టే! మంచి పొజిషన్, డబ్బు, గౌరవం ఉన్నా.. మనసులో ప్రశాంతత లేకుంటే జీవితం సాఫీగా సాగదు. ముఖ్యంగా ఇంటి యజమానురాలికి ఈగో సోకితే.. అది ఫ్యామిలీ మొత్తాన్నీ బాధిస్తుంది. లవర్ ఈగో బాధితుడైతే.. ప్రేమ దూరమవుతుంది. సో.. మన రిలేషన్స్, మనసు నిజమైన సంతోషాలను అనుభవించాలంటే… ముందుగా అహాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఆ టిప్సే ఇవి.. కాస్త ఈగో పక్కనపెట్టి, వీటిని ఫాలో అయిపోండి..
మనలో అహం పొడ చూపడాన్ని తెలుసుకోవడం బ్రహ్మవిద్యేం కాదు. ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేయాలని చూస్తే రియాక్ట్ అవుతున్నారా? మీ సక్సెస్‌లో ఎవరూ పొగడకపోతే కోపం వస్తున్నదా? ఇవే ఈగో ట్రిగ్గర్ సిగ్నల్స్. వీటిని గమనించడం ప్రారంభిస్తే.. అహానికి దూరంగా ఉండగలం. ‘నాలోని ఈగో ఇలా మాట్లాడిస్తున్నది’ అని గుర్తిస్తే చాలు.. మనలో శాంతి మొదలవుతుంది.
‘నాకంతా తెలుసు అనడమే’ ఈగోకు మూల కారణం. దానికి చెక్ పెట్టాలంటే.. మనం జీవితాన్ని నిరంతరం నేర్చుకునే ప్రక్రియలా చూడాలి. అప్పుడే ఈగోకి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు అవుతుంది. తీవ్రత కాస్త తగ్గుతుంది. సో.. అప్పుడు తప్పులు దిద్దుకోవడానికి, కొత్తగా నేర్చుకోవడానికి వెనకడుగు వేయరు. ఆసక్తిగా వినడం, ప్రశ్నించడం.. ఇవే వినమ్రతకు సంకేతాలు. ‘నేను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అనే భావన మనలోకి వచ్చినప్పుడు అహం కూల్‌గా కరిగిపోతుంది.

ఈగో ఎప్పుడూ ‘నేను’ గురించే ఆలోచిస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇతరుల కోసం ఏదైనా చేయాలి. ‘నేను’ వంటచేయడం ఏంటి? అని భర్త అనుకోకుండా.. భార్యకి వంటలో సాయం చేయాలి. ‘ఆఫీస్ పని చేస్తున్న నేను.. ఇంటిపని ఎందుకు చేయాలి?’ అనుకోకుండా.. భర్తతో ఇంటిపని షేర్ చేసుకోవాలి. ఎవరికివారే అన్నట్టుగా ఉంటే.. ఎవరి ఈగో వారిలో పెరిగిపోతూ ఉంటుంది. ‘నేను’ నుంచి ‘మనం’ వైపునకు అడుగులు వేయగలిగితే ఈగో తోకముడుస్తుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది.

మైండ్‌ఫుల్‌నెస్ అంటే.. మనలో వచ్చే ప్రతీ ఆలోచనని జడ్జ్ చేయకుండా గమనించడం. ‘నేను అందరికంటే గొప్ప’, ‘నేను ఎక్కువ’, ‘నన్నే చూడండి’ అనే ఈగో నుంచి మీరు విడిపోవడానికి ఇది సాయం చేస్తుంది. ‘సరిపోల్చడం’ అనే ఆలోచనను మానేయాలి. ఆ క్షణంలోనే ఈగో శబ్దం తగ్గిపోతుంది. ఆ నిశ్శబ్దంలోనే మీరు మైండ్‌ఫుల్‌నెస్‌ని పొందుతారు.

ఈగో ఎప్పుడూ ‘నన్నెవరు గుర్తిస్తున్నారు?’ అని అడుగుతుంది. కానీ ప్రశాంతమైన మనసు ‘నేను ఎందుకు చేస్తున్నాను?’ అని అడుగుతుంది. ఎవరి అభినందన కోసం కాదు… మన విలువ కోసం పనిచేయడం ప్రారంభిస్తే ఈగో సైలెంట్ అవుతుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు నిజాయతీని కోరుకుంటున్నారా, లేక చప్పట్లు ఆశిస్తున్నారా? అనేది మీ నిర్ణయమే. బయట మెరుపు కంటే మనసులోని వెలుగు ముఖ్యం కదా!