Vishwambara | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విశ్వంభర’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘బింబిసార’తో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు వశిష్ట ఈ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండగా,యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, ఛాయాగ్రహణ బాధ్యతలు చోటా కే నాయుడు నిర్వహిస్తున్నారు. విజువల్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రం అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతోంది.
షూటింగ్ పూర్తయినప్పటికీ ‘విశ్వంభర’ విడుదల కొంతకాలంగా వాయిదా పడుతోంది. ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ పనులేనని తెలుస్తోంది. అత్యున్నత స్థాయి సీజీ వర్క్ అవసరం కావడంతో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ సమయం తీసుకుంటున్నారు. టీజర్‌లోని కొన్ని గ్రాఫిక్స్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను సీరియస్‌గా తీసుకుని రీ-వర్క్ కూడా చేపట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్కే దాదాపు రూ.75 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఉగాది సందర్భంగా ‘విశ్వంభర’ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే గ్లింప్స్‌తో పాటు అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీజర్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం, కొత్త గ్లింప్స్‌తో అంచనాలను మరింత పెంచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
కథ విషయానికి వస్తే, ‘విశ్వంభర’ 14 లోకాల కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఫాంటసీ అడ్వెంచర్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. పౌరాణికంగా చెప్పబడే ఊర్ద్వ లోకాలు, అధో లోకాల నేపథ్యంతో కథ సాగుతుందని, వీటికి మించి ఉన్న ‘విశ్వంభర’ అనే ప్రత్యేక లోకాన్ని చేరుకోవడానికి హీరో చేసే సాహస యాత్ర ప్రధాన కథాంశమని ప్రచారం. ఈ స్టోరీ లైన్ మెగా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలిపారు. టీజర్లో చూసిన విజువల్స్‌తో పోలిస్తే ట్రైలర్ పూర్తిగా భిన్నంగా, మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. టీజర్‌పై వచ్చిన విమర్శలకు ట్రైలర్‌తో గట్టి సమాధానం ఇవ్వాలన్నదే యూనిట్ లక్ష్యమని తెలుస్తోంది.