ఈ ఆధునిక యుగంలో పిల్లలు ఎక్కువగా ఇండోర్ ఆటలకు, గ్యాడ్జెట్లకు పరిమితమవుతున్నారు. ఆరుబయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఆటలన్నీ ఆరుబయటే. ఇళ్లల్లోకి ట్యాబ్‌లు, ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు ప్లే గ్రౌండ్ అన్న మాటే మర్చిపోయారు. పేరెంట్స్ కూడా అతి గారాబంతో పిల్లలకు అవుట్ డోర్ గేమ్స్‌ను దూరం చేస్తున్నారు. పిల్లలు రోజుకి కనీసం 60 నిమిషాలు బయట ఆడు కోవాలని చైల్డ్ సైకాలజీ చెప్తుంది.
ఆరుబయట ఆటలు పిల్లల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సూర్యరశ్మిలో, ప్రకృతి మధ్య గడిపే సమయం వారికి ఎంతో ముఖ్యమైనది. పిల్లలను ఆరుబయట ఆడించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
కండరాలకు శక్తి : పరిగెత్తడం, దూకడం, ఎగరడం లాంటి బహిరంగ కార్యకలాపాలు పిల్లల కండరాలు ఎముకలు బలంగా తయారవడానికి సాయపడతాయి. ఇది వారి గ్రాస్ మోటార్ స్కిల్స్ అభివృద్ధికి కీలకం.
ఊబకాయ నివారణ : క్రమం తప్పకుండా ఆరుబయట ఆడటం వలన అధిక కేలరీలు ఖర్చవుతాయి, తద్వారా ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
రోగనిరోధక శక్తి : సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా అవసరం.
సమన్వయం, ఏకాగ్రత: ఆటలు ఆడటం వలన చేతి-కంటి సమన్వయం, సమతుల్యత, ఏకాగ్రత మెరుగుపడతాయి.
సృజనాత్మకత, సమస్య పరిష్కారం: బహిరంగ ప్రదేశంలో ఆడేటప్పుడు, పిల్లలు తమ ఆటలను వారే సృష్టించుకుంటారు, తద్వారా వారి సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు, ఇది వారి సమస్య పరిష్కార సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఒత్తిడి, ఆందోళన తగ్గింపు: ప్రకృతిలో గడిపే సమయం పిల్లల్లోని ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. తాజా గాలి, సహజ వాతావరణం మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
అన్వేషణ, నేర్చుకోవడం: బహిరంగ ఆటలు పిల్లలకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి అవకాశం ఇస్తుంది. ఇసుక, మొక్కలు, నీరు లాంటి సహజ అంశాలతో నేరుగా సంభాషించడం ద్వారా వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు.

సామాజిక నైపుణ్యాలు: గ్రూప్‌గా లేదా తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల… పంచుకోవడం, సహకారం, తమ వంతు కోసం వేచి ఉండటం లాంటి ముఖ్యమైన సామాజిక నైపుణ్యాలు అలవడతాయి.
ఆత్మవిశ్వాసం: ఆటల్లో విజయం సాధించడం, కొత్త పనులు నేర్చుకోవడం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పడి లేవడం అనేది వారికి ఓటమిని తట్టుకునే శక్తిని నేర్పుతుంది.
భావోద్వేగ నియంత్రణ: ఆట ద్వారా తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి పిల్లలకు అవకాశం లభిస్తుంది. నియమాలను పాటించడం, గెలుపోటములను అంగీకరించడం స్వీయ-నియంత్రణ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.
న్యూరో సైన్స్ ప్రకారం బయట ఆడుకోవడం పిల్లల మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. మైదానంలో ఆడుకోవడం వల్ల మెదడుపై కలిగే ముఖ్య ప్రభావాలు ఇలా ఉన్నాయి.