Cyber Crime Prevention Tips | శ్రీవాత్సవ్ ప్రభుత్వ ఉద్యోగి. డబ్బు యావలో పడిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. కొడుకు ఏం చదువుతున్నాడు? అసలు చదువుతున్నాడా, లేదా? అనే విషయాలూ పట్టించుకోలేదు. సుపుత్రుడికి అడిగినంత డబ్బు ఇవ్వడం, మార్కెట్లో కొత్తగా వచ్చిన ఖరీదైన ఫోన్లు, గాడ్జెట్స్ కొనివ్వడం మాత్రమే అతనికి తెలుసు. అదే కన్నప్రేమ అని అనుకుంటాడు. షాపింగ్ కోసం కూడా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉదారంగా ఇచ్చేవాడు. ఓటీపీలు సైతం చెప్పేవాడు. శ్రీవాత్సవ్ భార్యకేమో సీరియళ్ల పిచ్చి. ఉదయమే కొడుకును, కూతురిని స్కూల్‌కు పంపి టీవీతో కాలక్షేపం చేసేది.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ కుర్రాడు స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యాడు. ఎప్పుడు చూసినా ఫోన్లోనే. పడుకున్నా, లేచినా.. పబ్జీ, ఫ్రీఫైర్ అంటూ ఏవేవో ఆటలు. స్కూల్‌కు డుమ్మాకొట్టి స్నేహితులతో బయటి తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. అంతా ఓ గ్రూప్‌గా చేరి వీడియో గేమ్స్ ఆడుతూ.. పోర్న్ చూసేవారు. కడపు నొప్పని, కాలు నొప్పని స్కూల్ మధ్యలోనే ఇంటికొచ్చి.. గది తలుపులు వేసుకుని అడల్ట్ కంటెంట్ చూసేవాడు. ఓ రోజు కొత్త గేమ్ ట్రయల్ వెర్షన్ చూసి పిచ్చెక్కిపోయాడు. దానికి డబ్బు చెల్లించాల్సి ఉండటంతో తండ్రి సేవింగ్స్ అకౌంట్ వివరాలు ఇచ్చాడు. తండ్రికి కాల్ చేసి ఓటీపీ కూడా తెలుసుకున్నాడు. దాన్ని అవతలివాళ్లకు ఫార్వర్డ్ చేశాడు. అంతే, మరుక్షణం నుంచీ ‘టింగ్.. టింగ్.. టింగ్..’ అంటూ డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఏం జరుగుతున్నదో తెలుసుకునేలోపు అకౌంట్ మొత్తం ఊడ్చేశారు సైబర్ దొంగలు. ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టాయి శ్రీవాత్సవకు. గబగబా ఇంటికి వచ్చేశాడు.
‘ఏ గేమ్ రా నువ్వు డౌన్లోడ్ చేసింది’ అంటూ కన్నెర్రజేశాడు. ఇన్నాళ్లూ అక్రమంగా సంపాదించిన సొమ్మంతా దెబ్బకు ఖాళీ అయిపోయింది. బ్లాక్ మనీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేంత ధైర్యం లేకపోయింది.
జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక పిల్లల్ని ఆడిపోసుకోవడం కంటే.. వారిని జాగ్రత్తగా గమనిస్తూ హద్దుల్లో పెట్టడం ఉత్తమం. హద్దులంటే కొట్టి, తిట్టి, చెప్పుచేతల్లో పెట్టుకోవడం కాదు.. పరిమితులతో కూడిన స్వేచ్ఛను ఇవ్వడం. అన్నిటికంటే ముందు మనం పిల్లలతో మనసువిప్పి మాట్లాడాలి. వారికోసం తగినంత సమయాన్ని కేటాయించాలి. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, శరీరభాష ఎలా ఉంది, ఫోన్ కొనుగోలు చేయకముందు ప్రవర్తన ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అనేది బేరీజు వేసుకోవాలి. పిల్ల
లెప్పుడూ మన అదుపులో ఉండాలనుకోవడం సరికాదు. భద్రత, నమ్మకం కలిగించడం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలనుకున్నప్పుడు వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. మనవైన పద్ధతుల్లో..సున్నితంగా దారికి తెచ్చుకోవాలి.
📲 సోషల్ మీడియా, మల్టీ-ప్లేయర్ గేమ్స్, ఆన్లైన్ పోర్న్, వీడియో స్ట్రీమింగ్, సైబర్ బెదిరింపుల కాలమిది. కాబట్టి, మీరు కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందండి. పిల్లలను డిజిటల్‌గా కంట్రోల్ చెయ్యడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
📲 ఆన్లైన్ గేమ్‌లు, యాప్‌లు, పోర్న్ చూపించి పిల్లలను తమవైపు తిప్పుకొనే దుర్మార్గులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోండి. ఆ పద్ధతులపై అవగాహన పెంచుకొని పిల్లలకు మంచి చెడ్డలు చెప్పండి.
📲 పిల్లల ఆన్లైన్ సమయం, పాస్వర్డ్లు, నిద్ర వేళలు, డౌన్లోడ్స్, అప్లోడ్స్, యాప్ కొనుగోళ్లు, స్ట్రీమింగ్ వంటి వాటి గురించి ఓ కన్నేసి ఉంచండి. మీకు పాస్వర్డ్స్ చెప్పేందుకు భయపడుతున్నారంటేనే అభ్యంతరకమైనవి చూస్తున్నారని అర్థం. అలాంటి పరిస్థితి కనిపిస్తే సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ ఇప్పించండి.
📲 ఇప్పుడు అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ‘కిడ్స్’ ఆప్షన్ ఉంది. యాక్టివేట్ చేసుకుంటే అడల్ట్ కంటెంట్ చూడకుండా నియంత్రించొచ్చు.
📲 పిల్లలకు ఫోన్ కొన్న తర్వాత మీ మెయిల్ ఐడీ ఇవ్వడం మర్చిపోవద్దు. దీనివల్ల పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలు, స్క్రీన్ టైమింగ్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
📲 స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మతిమరుపునకూ దారితీస్తుంది.
📲 స్మార్ట్‌ఫోన్‌ను సరైన రీతిలో ఉపయోగిస్తే.. పిల్లలు మరింత హుషారుగా ఉంటారు. జీవన నైపుణ్యం పెరుగుతుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒక్కసారి దారి తప్పితే.. జీవితాన్నే నాశనం చేసుకుంటారు. ఆ రెండిటి మధ్య తేడాను గుర్తించి, జాగ్రత్త పడాల్సిన బాధ్యత కచ్చితంగా తల్లిదండ్రులదే.
📲 వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ ఖాతాల వివరాలను, ఓటీపీలను ఎవరికీ షేర్ చెయ్యకుండా అవగాహన కల్పించండి.
📲 స్మార్ట్‌ఫోన్‌తో పెరుగుతున్న సైబర్ నేరాల గురించి చెప్పండి. పిల్లలు పొద్దస్తమానం ఫోన్లోనే ఉంటే మీరే చొరవ తీసుకుని.. గ్రౌండ్‌కు తీసుకెళ్లండి. మంచి పుస్తకాలు చదివించండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి