e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News నిద్ర‌పోయే ముందు ఇవి తింటున్నారా? ఇది తెలిస్తే వెంట‌నే మానేస్తారు

నిద్ర‌పోయే ముందు ఇవి తింటున్నారా? ఇది తెలిస్తే వెంట‌నే మానేస్తారు

అతనో సైనికుడు. తెల్లవారితే యుద్ధరంగంలో విజయమో, వీరమరణమో అందుకోవాల్సిన వాడు. కానీ నిద్రలో ఆ ఆందోళనంతా మర్చిపోయి, తన ప్రేయసి గురించి కమ్మని కలలు కన్నాడు. అతనికి నిద్ర ఓ సాంత్వన. ఆ భార్యాభర్తలు సహనపు హద్దులు దాటి కొట్లాడుకున్నారు. ఇక కలిసి ఉండలేమంటూ తీర్మానించేశారు. ఎడమొహంగా పడుకున్న వాళ్లు తెల్లారేసరికి తేలికపడ్డారు. వారికి నిద్ర ఓ సంధి సమయం.

కష్టమైనా, సుఖమైనా… మన జీవితాలకు నిద్ర ఓ విరామచిహ్నం. సర్వం మర్చిపోయే ఓ స్వల్పకాల మరణం. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటున్నామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరుగదని అంటారు. నిద్రలో తరతమ బేధాలుండవు. అందుకే.. ‘నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే, అండనే బంటునిద్ర అదియు నొకటే!’ అని తీర్మానించేశాడు అన్నమయ్య. మనం అతి సహజంగా భావించే ఈ నిద్ర వెనుక చాలా అరుదైన విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకోదగ్గవి. కొన్ని పాటించడానికి ఉపయోగపడేవి. అందుకే, మెలకువతోనే మనం కాసేపు అలా నిద్రాలోకంలోకి విహరించి వద్దాం!

- Advertisement -

ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బతికిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి బట్టకట్టిన దాఖలాలు నమోదు కాలేదు. కారణాలను అంచనా వేయడం తేలికే! నిద్ర ఓ విశ్రాంతి దశ మాత్రమే కాదు. నిద్రపోతున్నప్పుడు జరిగే జీవక్రియలన్నీ శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. రోగ నిరోధక శక్తి, కండరాలు, నాడీవ్యవస్థ.. అన్నీ బలపడతాయి. మెలకువగా ఉన్నప్పుడు, మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది. గాఢనిద్రలో అటు మెదడుకూ, ఇటు శరీరానికీ శక్తి అవసరం పెద్దగా ఉండదు. ఫలితంగా కణ విభజనకు ఉపయోగపడే గ్రోత్‌ హార్మోన్లు, వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత… ఆలోచన, విశ్లేషణ, భావోద్వేగాలు లాంటి మానసిక చర్యలన్నీ మళ్లీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు! నిద్రలో మన జీర్ణవ్యవస్థ కూడా నిదానంగా పనిచేస్తుంది, ఇన్సులిన్‌ నియంత్రణలో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నిద్ర…జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది.

నిద్ర పట్టని జబ్బులు

అంతగా పట్టించుకోం కానీ, నిద్రపట్టకపోవడం లేదా గాఢమైన నిద్ర పట్టకపోవడం తీవ్రమైన సమస్యే. నిద్రలో లోపాలకు సంబంధించి పరిశోధకులు వందకు పైగా సమస్యలను గుర్తించారు. వాటిలో నిద్రలేమి లాంటివాటి గురించి మనకు కొంత తెలుసు. కానీ కొన్ని చిత్రమైన సమస్యలను చెప్పుకొనేందుకు కూడా సంశయిస్తాం.

రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌

కొంతమంది నిరంతరం కాళ్లు కదుపుతూ ఉంటారు. నిద్రపోయినప్పుడు కూడా కాళ్లను కదిలిస్తూ ఉంటారు. అది ఓ అలవాటుగా ఉంటే ఫర్వాలేదు. కానీ కాళ్లలో ఏర్పడుతున్న అసౌకర్యం, నొప్పి లాంటి చిరాకును తప్పించుకోవడానికి కాళ్లు కదుపుతూ ఉంటే మాత్రం, దాన్ని ఒక సమస్యగా గుర్తించాలి. ఐరన్‌ తక్కువ కావడం నుంచి కొన్ని రకాల మందుల వాడకం వరకూ ఇందుకు చాలా కారణాలు.

బ్రక్సిజం

మనం నమిలేటప్పుడు, మాట్లాడేటప్పుడు దవడ కింది భాగం కదులుతుంది. కానీ బ్రక్సిజమ్‌ సమస్య ఉంటే, నిద్రలో మనకు తెలియకుండానే దవడ కండరాలు బిగుసుకుంటాయి. ఇదీ తీవ్రమైన సమస్యే. దాని వల్ల పళ్ల్లు తీవ్రంగా దెబ్బతింటాయి, ఒక్కోసారి నాలుక కూడా కొరుక్కుంటారు. బ్రక్సిజమ్‌కు చాలా కారణాలు ఉన్నా… మానసికమైన సమస్యలే పెద్ద ముద్దాయిలు. అదృష్టవశాత్తు, దీనికి ఇప్పుడు చాలా చికిత్సలే అందుబాటులో ఉన్నాయి.

నార్కోలెప్సి

రాత్రంతా నిద్రపోయినా నీరసంగా, నిద్రమత్తుగా ఉండటం.. పగటివేళ సమయం, సందర్భం లేకుండా కునుకు తీయడం నార్కోలెప్సి లక్షణాలు. పైకి అంత ప్రమాదకరంగా కనిపించకపోవచ్చు. కానీ యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు… ఒక్క క్షణం నిద్రలోకి జారిపోయే అవకాశం ఉంది. న్యూరాన్లలో వచ్చే సమస్య వల్లే ఈ ఇబ్బంది ఏర్పడుతుందని భావిస్తున్నారు.

స్లీప్‌ ఆప్నియా

నిద్రలో ఊపిరి పీల్చుకోవడం ఆగిపోయి ఒక్కసారిగా ఉలికిపాటుతోనో, గట్టి గురకతోనో శ్వాస అందుకోవడమే ఈ సమస్య. దాంతో ఎంతసేపు నిద్రపోయినా అలసట తీరదు. టాన్సిల్స్‌, హార్మోన్‌ అసమతుల్యత లాంటి పరిస్థితుల్లో తప్ప చాలా సందర్భాల్లో ఇది మనం చేజేతులా తెచ్చుకునేదే. ఊబకాయం, ధూమపానం, మద్యపానం లాంటివి స్లీప్‌ ఆప్నియాకు దారితీస్తాయి. మాటిమాటికీ శ్వాస ఆగిపోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌

మొదట పారిశ్రామికీకరణ, ఆ తర్వాత గ్లోబలైజేషన్‌… రకరకాల షిఫ్టుల్లో పనిచేయాల్సిన అనివార్యతను కల్పించాయి. దీనివల్ల మన జీవ గడియారం అస్తవ్యస్తమైంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం, గాఢనిద్ర వరించకపోవడం లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానలేమి దగ్గర నుంచి మధుమేహం వరకూ స్లీప్‌ వర్క్‌ డిజార్డర్‌ రకరకాల సమస్యలకు దారితీస్తుంది.

ఇవే కాదు! భిన్నమైన సమయాల్లో మాత్రమే నిద్రపట్టే ‘స్లీప్‌ ఫేస్‌ డిజార్డర్‌’, నిరంతరం నిద్రపోయే ‘స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌’, మాటిమాటికీ లఘుశంక సాకుతో నిద్రలేపే ‘నాక్టూరియా’, నిద్రలో భయపడే ‘నైట్‌ టెర్రర్స్‌’… ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు నిద్రను ఆవహించి ఉన్నాయి. అందుకే నిద్రకు సంబంధించిన ఏ ఇబ్బంది అయినా ఎక్కువ రోజులపాటు విడవకుండా కొనసాగినా, అది మన దినచర్యను ప్రభావితం చేస్తున్నా వైద్యుడిని సంప్రదించాల్సిందే. ఎందుకంటే నిద్రలేమి మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

స్లీప్‌ హైజీన్‌

వయసు, అనారోగ్యం, శరీరశ్రమ లాంటి పరిస్థితులను బట్టి కాస్త అటూ ఇటూ అయినా… సగటున ఓ మనిషికి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనికోసం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించాలని చెబుతున్నారు. దాన్నే స్లీప్‌ హైజీన్‌ అంటారు.

ఒకే సమయం

నిత్యం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు వెచ్చించాలి. మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉందని చెప్పి, దీన్ని తగ్గిస్తే లాభం లేదు. అది కూడా ఒకే సమయంలో ఉంటేనే జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. అనుకున్న సమయానికి పక్క మీదికి చేరాలంతే! ఎందుకంటే ఆహారం, ఆదాయంలా నిద్ర కూడా ఓ ప్రాధాన్యమే. ఫోన్‌ చూస్తూనో, కబుర్లు చెబుతూనో నిద్రను విస్మరించకూడదు. ఒకవేళ జీవనశైలితో పాటు నిద్ర వేళనూ మార్చుకోవాలంటే ఒకేసారి కాకుండా… క్రమంగా మార్చుకోవాలి.

నిద్రకు సిద్ధం

నిద్ర అయాచితం కాదు. ఓ అవసరం. అందుకే నిద్రకు ముందు బ్రష్‌ చేసుకోవడం, బట్టలు మార్చుకోవడం, పక్క సర్దుకోవడం లాంటి పనులతో మెదడుని నిద్రకు సిద్ధం చేయాలి. బెడ్‌రూమ్‌లో వెలుతురు, ఉష్ణోగ్రత, శబ్దాలు నిద్రకు భంగం కలిగించకుండా ఉండాలి. దిండు నుంచి పరుపు దాకా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.

గాడ్జెట్స్‌కు దూరం

పడుకునే ముందు కనీసం 30 నుంచి 60 నిమిషాల ముందే మొబైల్‌, కంప్యూటర్‌, టీవీ లాంటి పరికరాలకు దూరంగా ఉండాలి. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. కాంతిని ప్రతిఫలించే తెరల వల్ల, మన శరీరంలో నిద్ర కలిగించే మెలటోనిన్‌ అనే హార్మోను సరిగా ఉత్పత్తి కాదు. గేమ్స్‌ ఆడుతూ, చాటింగ్‌ చేస్తూ, వీడియోలు చూస్తూ ఉంటే మన ఉద్విగ్న స్థాయి కూడా పెరిగిపోతుంది. చివరి నిమిషంలో ఫోన్‌ పక్కన పెట్టినా, ఎవరైనా మెసేజ్‌ చేసి ఉంటారా, మన పోస్టుకు కామెంట్‌ వచ్చిందా, అత్యవసరమైన మెయిల్‌ వచ్చి ఉంటుందా? అనే సందేహాలు తెలియకుండానే మనసును వేధిస్తాయి. దీన్ని ‘మెంటల్‌ స్టిమ్యులేషన్‌’ అంటారు. ఫలితంగా నిద్ర పట్టదు, ఒకవేళ పట్టినా కలతగా మారుతుంది. ఈ చిన్న పొరపాటు వల్ల మనం ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు లోనవుతున్నాం అని పదే పదే పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

ఆహారం

మంచం మీదికి చేరుకునే సరికి మనం తీసుకునే ఆహారం జీర్ణం అయిపోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే కనీసం రెండు మూడు గంటల ముందే నోరు కట్టేసుకోవాలి. ఈ సూత్రాన్ని పాటించడం కుదరకపోయినా, కనీసం నిద్రకు ముందు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే ఎరుక ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు అరటిపండు, మజ్జిగ, పాలు, ఓట్స్‌, బాదం, తృణధాన్యాల రొట్టెలు… లాంటివి నిద్రకు మేలు చేస్తాయి.

ప్రశాంతత

పడుకునే ముందు పోట్లాడుకోవడం, ప్రతికూలమైన విషయాల గురించి చర్చించుకోవడం, భయంకరమైన దృశ్యాలను చూడటం మంచిది కాదు. దీని వల్ల ఉద్విగ్నత పెరిగిపోయి నిద్ర సరిగ్గా పట్టదు. అంతేకాదు, రాత్రంతా ఈ విషయాలు మెదడులో తిరుగుతూ ఉండటం వల్ల, అవి దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారే ప్రమాదమూ ఉంది.

రోజును బట్టి రాత్రి

మన జీవనశైలి, నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. తగినంత వ్యాయామం లేదా శరీరశ్రమ మంచి నిద్రను కలిగిస్తుంది. కాసేపు ఎండలో గడపటం మన జీవ గడియారం మీద సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. సిగరెట్‌, మద్యం, కాఫీ అలవాట్లు నిద్రను చెడగొడతాయి.

బలవంతంగా వద్దు

నిద్రలేమి లాంటి సమస్యలు ఉన్నప్పుడు బలవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేసి ఉపయోగం లేదు. దాని బదులు ఈ స్లీప్‌ హైజీన్‌ పాటిస్తూ… గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, పుస్తకం చదువుకోవడం, ధ్యానం చేయడం, సంగీతం వినడం లాంటి చిట్కాలు పాటిస్తే చికిత్స జోలికి పోకుండానే ఫలితం కనిపిస్తుంది. నిద్ర అంటే మనకు చులకన, దాన్ని ఓ బలహీనతగా భావిస్తూ ఉంటాం. నిజానికి అది ఓ సంక్లిష్టమైన శాస్త్రం. తగినంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అలవాటు. నిద్ర ఒడుపు తెలిసినవాడు, తన రోజును కూడా గొప్పగా మార్చేసుకోగలడు.

ఇలా జారుకుంటాం

నిద్ర అకస్మాత్తుగా జరిగిపోయే చర్యేమీ కాదు. అది ఓ వ్యవస్థ. దశలవారీగా సాగుతుంది. శాస్త్రవేత్తలు నిద్రను రెండు రకాలుగా విభజిస్తూ ఉంటారు. నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూమెంట్‌ (NREM), ర్యాపిడ్‌ ఐ మూమెంట్‌ (REM). మనం నేరుగా గాఢనిద్రలోకి జారిపోం. NREMతో అది మొదలవుతుంది. అందులోనూ మూడు దశలను దాటుకుని REMకు చేరుకుంటుంది. అంటే, మొత్తంగా నాలుగు దశలన్నమాట (N1-N2-N3-REM).

తొలి దశలో మగత ఉంటుంది. మెదడులోని తరంగాలు, గుండె వేగం నెమ్మదిస్తాయి. రెండో దశలో నిద్ర పట్టేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. కండరాల బిగువు తగ్గి విశ్రాంతి దశకు చేరుకుంటాయి. కండ్ల కదలికలు ఉండవు. మన రాత్రిలో ఎక్కువ శాతం ఈ రెండో దశలోనే గడుస్తుంది. ఇక మూడో దశలో సోయి తెలియని గాఢనిద్ర పడుతుంది. ఈ సమయంలోనే శరీర మరమ్మతుకు సంబంధించిన ప్రక్రియలన్నీ మొదలవుతాయి. ఈ మూడు దశలూ దాటాక REM స్థాయికి చేరుకుంటాం. ఈ సమయంలో మెదడులో తరంగాలు వేగం పుంజుకుంటాయి. వాటికి అనుగుణంగా కనుగుడ్లు కదులుతుంటాయి. మనం కలలు కనే దశ ఇదే. కొంతసేపు ఈ స్థితిలో ఉన్నాక, తిరిగి సాధారణ నిద్రకు చేరుకుంటాం. ఈ వలయమంతా పూర్తి కావడానికి సగటున 90 నిమిషాలు పడుతుందని అంచనా!

నిద్రకు ముందు ఇవి వద్దు..

కొన్ని తింటే నిద్ర ముంచుకొస్తుంది. కొన్ని తాగితే నిద్రాదేవి దూరంగా పారిపోతుంది. ఆ పదార్థాల జాబితా పెద్దదే.

కెఫిన్‌: కెఫిన్‌ మెదడును చురుగ్గా ఉంచుతుంది. వచ్చే నిద్రను కూడా ఆపేయగలదు. కేవలం కాఫీ, టీలలో మాత్రమే కాదు… చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్‌లో కూడా కెఫిన్‌ ఉంటుంది.

డైయూరెటిక్‌: కొన్ని రకాల ఆహార పదార్థాలు మూత్రాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తాయి. బీట్‌రూట్‌, క్యాబేజీ, పుచ్చకాయలు, క్యారెట్‌, అల్లం, ఉల్లిపాయలు, వెల్లుల్లి… డైయూరెటిక్‌ ఆహారం కిందికే వస్తాయి. ఇక మద్యం గురించి చెప్పనక్కర్లేదు. శరీరంలోని వ్యర్థ పదార్థాలతో పాటుగా, పోషకాలను కూడా మూత్రం ద్వారా బయటికి గెంటేస్తుంది. ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల గాఢనిద్రకు అంతరాయం తప్పదు.

కొవ్వు పదార్థాలు: భుక్తాయాసం వేరు, నిద్ర వేరు. జీర్ణ వ్యవస్థకు పనిపెట్టే ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మొత్తం పేగుల వైపు మళ్లుతుంది. దాంతో కాస్త మగత కమ్ముకుంటుంది. కానీ గాఢనిద్రలోకి జారుకోలేం. కాబట్టి రాత్రివేళల్లో మాంసం, పిజ్జాలు తదితర ఆహారానికి దూరంగా ఉండాల్సిందే.

మసాలాలు: కొంతమందికి నషాళాన్నంటే ఘాటైన ఆహారం తింటే కానీ తృప్తిగా ఉండదు. అయితే, వాటిని జీర్ణం చేసుకోవడానికి పేగులు ఇబ్బంది పడుతుంటాయి. గ్యాస్ట్రో ఈసోఫేగల్‌ రిఫ్లెక్ట్‌ అనే చర్య ద్వారా కడుపులోని రసాయనాలు గొంతువరకూ వస్తుంటాయి. సహజంగానే ఇది నిద్రను పాడుచేస్తుంది.

తీపి పదార్థాలు: రాత్రి భోజనం తర్వాత ఐస్‌క్రీమో, కూల్‌డ్రింకో, స్వీటో తినడం చాలామందికి అలవాటు. ఈ పదార్థాల్లో ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే రక్తంలోకి ఒక్కసారిగా చక్కెర నిల్వలను పంపిస్తాయి. ఆ నిల్వలు తరిగిపోయిన వెంటనే ఆకలి మొదలవుతుంది. నిద్ర కలతగా మారుతుంది.

ఆవలింత ఓ రక్షణ చర్య

నిద్రపోయేటప్పుడు లేదా బోర్‌ కొట్టినప్పుడు ఆవలించడం సహజం. దీనికి సంబందించి చాలా సిద్ధాంతాలే ప్రచారంలో ఉన్నాయి. మరింత గాలి పీల్చుకోవడానికి ఆవలిస్తామనీ, మెదడుని చల్లబరిచేందుకు ఆవలింత వస్తుందనీ వేర్వేరు వాదనలు ఉన్నాయి. అయితే ఆవలింతతో నిస్సత్తువ తగ్గి జాగరూకత పెరుగుతుందనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. బహుశా అందుకనే కొందరు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఆవలిస్తుంటారు. ఇక ఒకరిని చూసి మరొకరు ఆవలించే అలవాటు ఆటవిక రోజుల నుంచి వచ్చిందట. ఒకరిని చూసి మరొకరు నిద్ర మత్తును వదిలించుకుంటూ అప్రమత్తత పెంచుకునేందుకు ఇలా చేసేవారు.

స్లీప్‌ వాకింగ్‌

నిద్ర గురించిన ప్రస్తావన రాగానే నిద్రలో నడిచే అలవాటు గుర్తుకు వచ్చి తీరుతుంది. గాఢనిద్రలో ఉండగా లేచి తిరగడమే స్లీప్‌ వాక్‌. వంశ పారంపర్యంతో పాటు నిద్రలేమి, ఒత్తిడి, జ్వరం లాంటి సందర్భాల్లో ఈ సమస్య వస్తుంది. చాలాసార్లు ఇది తాత్కాలికం. పెద్ద సమస్య కూడా కాదు. అలాగని పట్టించుకోకుండా వదిలేయడానికి వీల్లేదు. కొంతమంది నిద్రలోనే తినడమూ, వాహనం నడపడమూ చేస్తుంటారు. నిద్రలో నడకతో తనకు తాను హాని చేసుకునే ప్రమాదమూ ఉంది. నిద్రలో నడుస్తూ హత్యలు చేసిన సంఘటనలూ జరిగాయి. కాబట్టి వయసు పెరుగుతున్నప్పటికీ నిద్రలో నడిచే అలవాటు తగ్గకపోయినా, మాటిమాటికీ ఈ ఇబ్బంది తలెత్తుతున్నా… వైద్యుడిని సంప్రదించి తీరాలి.

కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు

మేధోపరంగా మనిషిని మించిన జీవి లేకపోవచ్చు. కానీ దేహదారుఢ్యంలో అతను అల్పజీవే. పుట్టాక, నెలల తరబడి తన కాళ్ల మీద తాను నిలబడలేడు, ఆయుధాలు లేకుండా పంజాలను ఎదుర్కోలేడు. ఇప్పుడంటే నాలుగు గోడల మధ్య సురక్షితంగా ఉన్నాడు కానీ, అడవిలో బతికినప్పటి పరిస్థితి ఏమిటి? ఒకేచోట నివసించే తెగ మొత్తం గాఢనిద్రలోకి జారుకుంటే… ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే కదా! అందుకే ప్రకృతి ఓ వింత ఏర్పాటు చేసింది. కుర్రాళ్లు కాస్త ఆలస్యంగా నిద్రపోయి బారెడు పొద్దెక్కేదాకా లేచేట్టు హార్మోన్లను సిద్ధం చేసింది. ఇక వృద్ధులేమో త్వరగా నిద్రపోయి, తెల్లవారే మేల్కొనేలా చూసుకుంది.

దానివల్ల తెగలో ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో కాస్త జాగరూకతతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని నిరూపించేందుకు ఆఫ్రికాలోని హడ్‌జా అనే తెగ ప్రజల మీద ఓ ప్రయోగం కూడా చేశారు. ఆ తెగలో 33 మంది కలిసి నిద్రపోతున్నప్పుడు… వారి గాఢతను గమనించారు. ఊహించినట్టుగానే, వారిలో ఒకొక్కరు ఒక్కో సమయంలో మెలకువగా ఉన్నారు. కుర్రకారు అర్ధరాత్రి వరకూ చక్కర్లు కొట్టడానికీ, వృద్ధులు తెల్లవారేసరికల్లా మంచం దిగడానికీ ఇదే కారణం అన్నమాట!

మంచాన్ని వెచ్చగా ఉంచుతాం!

చలికాలం మంచం మీదికి చేరుకోగానే ఒక్కసారిగా తనువు ఝల్లుమంటుంది. చల్లగా గడ్డకట్టుకుపోయిన దుప్పట్లు చిరాకుపెడతాయి. మనకే ఇలా ఉంటే శీతల ప్రదేశాల్లో చెప్పేదేముంది? అందుకే మంచం కింద బొగ్గుల కుంపటి నుంచీ విద్యుత్‌ బెడ్‌షీట్ల వరకూ రకరకాల సాధనాలతో మంచాన్ని వెచ్చగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. రష్యాకు చెందిన విక్టోరియా ఇవాచ్యోవా మరో అడుగు ముందుకు వేసి, అతిథుల మంచాన్ని వెచ్చగా ఉంచే ఉద్యోగం మొదలుపెట్టింది. ఎవరైనా తమ మంచాన్ని వెచ్చగా ఉంచమంటూ తనని సంప్రదించగానే, అక్కడికి చేరుకుంటుంది విక్టోరియా. ఓ గంట సేపు వాళ్ల పరుపు మీద పడుకుని… అది వెచ్చబడేలా చేస్తుంది. ఆ కాసేపు వారితో కబుర్లు చెబుతుంది కూడా. కానీ ఆ మాటలు శ్రుతి మించకుండా జాగ్రత్తపడుతుంది. చూసేందుకు కాస్త చిత్రంగా ఉన్నా, సహజమైన రీతిలో వెచ్చదనాన్ని కోరుకునేవాళ్లు విక్టోరియాను సంప్రదిస్తుంటారు. ఈ భిన్నమైన సేవల కోసం విక్టోరియా భారీగానే వసూలు చేస్తుంది. గంటసేపు మంచాన్ని వెచ్చబరిచినందుకు అయిదువేల రూపాయల వరకూ చార్జ్‌ చేస్తుంది. మొదట్లో నవ్వుకున్నా… ప్రస్తుతం శీతల దేశాల్లో ‘బెడ్‌ వార్మింగ్‌’ ఓ ఉపాధిలా మారిపోయింది.

నిద్రలో తాత్కాలిక పక్షవాతం!

అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. కానీ కళ్లు తెరవలేం. చేతులు, కాళ్లు కదల్చలేం. రకరకాల శబ్దాలు! ఈ తరహా అనుభవం మనలో చాలామందికి కలిగే ఉంటుంది. మెదడు ఒక్కసారిగా మేల్కొని, కండరాలు మాత్రం కదలని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ స్లీప్‌ పెరాలసిస్‌ రావచ్చు. ఎప్పుడో ఒకసారంటే ఫర్వాలేదు కానీ, మాటిమాటికీ ఈ ఇబ్బంది కలుగుతుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. మెలకువగా ఉన్నా కదల్లేకపోవడం అనేది చిరాకు కలిగించే వ్యవహారమే! కానీ ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. భయపడకుండా మన శరీరంలో ఏదో ఒక చిన్నపాటి కండరాన్ని… అంటే కనురెప్పలు, చేతివేళ్లు కదిలించే ప్రయత్నం చేయాలి. శరీర భాగాలు కదిలినా, ఇతరుల చేయి పడగానే స్లీప్‌ పెరాలసిస్‌ వీగిపోతుంది.

ఆదివారం ఆలస్యంగా లేస్తున్నారా?

మనవి టార్గెట్లతో ముడిపడిన జీవితాలు. వారమంతా గడియారంతో పోటీ పడుతూ పరుగు తీయాల్సిందే. అందుకే శని ఆదివారాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వేయి కండ్లతో ఎదురుచూస్తుంటాం. ఆ రెండు రోజులూ… అర్ధరాత్రి వరకూ మేల్కొని సేదతీరే ప్రయత్నం చేస్తాం. బారెడు పొద్దెక్కాకే నిద్ర లేస్తాం. దీనికి సోషల్‌ జెట్‌ ల్యాగ్‌ అని పేరు పెట్టారు. వీకెండ్స్‌లో విశ్రాంతి తీసుకోవచ్చునేమో కానీ, ఇలా నిద్రా సమయాలను మాత్రం మార్చవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. దాని వల్ల circadian rhythm (జీవ గడియారం) దెబ్బతిని లేనిపోని సమస్యలు వస్తాయట. దీంతో నిద్రలేమి నుంచి కుంగుబాటు దాకా రకరకాల మానసిక సమస్యలు… గుండెజబ్బులు, మధుమేహం లాంటి వ్యాధులు తలెత్తవచ్చని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కాబట్టి, మీ తనువును కాస్త నిద్రపుచ్చండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Dandruff | చ‌లికాలంలో చుండ్రుతో బాధ‌ప‌డుతున్నారా? ఇలా చేసి చూడండి

Sleep | అమ్మో నిద్ర‌ను ఇన్ని చ‌ప్పుళ్లు డిస్ట‌ర్బ్ చేస్తున్నాయా?

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌ట్లేదా ? కంటి చూపు దెబ్బ‌తినొచ్చు జాగ్ర‌త్త !

ఆల‌స్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు ప‌నితీరు త‌గ్గుతుంద‌ట‌..!

‘కరోనాసోమ్నియా’ అంటే ఏమిటి…?దానికి పరిష్కారాలేంటి…?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement