శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sunday - Oct 25, 2020 , 02:03:42

దాంపత్య శ్రీనివాసం!

దాంపత్య శ్రీనివాసం!

ఆలూమగల అనుబంధాలకు ప్రతీకలు.. పద్మావతీ వేంకటేశ్వరులు. అతను రాముడు అయితే ఆమె సీత. అతను కృష్ణుడు అయితే ఆమె సత్యభామ. అతను నారసింహుడు అయితే ఆమె చెంచిత. చిలిపి కలహాలు, వలపు వైరాలు ప్రతి కాపురంలోనూ ఉన్నట్టే. కొన్నిసార్లు అతను ఓడి, ఆమెను గెలిపిస్తాడు. కొన్నిసార్లు, ఆమె పరాజితురాలై అతడిని విజేతను చేస్తుంది. యుగయుగాల అవగాహన ఇద్దరిదీ! అన్నమయ్య కీర్తనలూ, వేంకటాచల మాహాత్మ్య వర్ణనలూ ఆ ఆనంద నిలయ కాపురాన్ని కండ్లకు కడతాయి. ( నేడు తిరుమలలో విజయదశమి  పార్వేట మహోత్సవం)

శ్రీనివాసుడు..

పెద్ద కిరీటమువాడు పీతాంబరమువాడు

వొద్దిక కౌస్తుభమణి వురము వాడు

ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు

అద్దిగో శంఖచక్ర హస్తాలవాడు.

అలమేలు మంగమ్మ..

శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు

కాముని తల్లియట చక్కదనాలకే మరుదు

సోముని తోబుట్టువట సొంపుకళలకే మరుదు

ఒకరికోసం ఒకరు పుట్టినట్టు,  ఇద్దరూ ఒకటే అయినట్టు ఎన్ని పోలికలో! ఆమె హరిణేక్షణ. అతడు హరి.ఆమె కమలవాసిని. అతడు కమలాక్షుడు.ఆమె నడుము చక్రవాకం. అతడు చక్రాయుధుడు.ఆమె నీలకుంతల. అతడు నీలవర్ణుడు.జలధి కన్యక ఆమె. జలధిశాయి అతడు.ఇంకేముంది, పేరుబలం కుదిరింది. అస్తు. అస్తు.  వరుస కుదిరినట్టు. సంబంధం ఖాయమైనట్టు.ఆకాశరాజా! బ్రహ్మకడిగిన పాదాల్ని కళ్లకద్దుకొని   కన్యాదానం చేయవయ్యా?కుబేరా! నీకు కుబేరత్వాన్ని ప్రసాదించిన స్వామికి అప్పిచ్చి రుణం తీర్చుకో!వకుళమ్మా! జగన్నాటకంలో, జగన్నాథ నాటకంలో నీది మాతృమూర్తి పాత్ర! బ్రహ్మ జనకుడి తల్లి హోదాలో శుభకార్యం జరిపించు. దిక్పాలకులారా! ముక్కోటి దేవతలకు దిక్కయినవాడి పెండ్లికి మీరే పెద్ద దిక్కు! నారద తుంబురులారా! మంగళాకారుడి మనువుకు మంగళవాద్యాలు సిద్ధం చేయించండి. బృహస్పతులవారూ! తొట్టతొలుత మర్రాకు మీద తేలాడిన శిశువుకు రాశిచక్రం రాయించండి.దేవకన్యలారా! మన్మథ జనకుడిని ముస్తాబు చేయండి. శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి

దైవికపు పెండ్లి ముహూర్తము నేడు

.. దేవతలు రారో దేవుని పెండ్లికిని!

ఇక నుంచీ స్వామి నివాసం.. వైకుంఠం, ఆనంద నిలయం, యోగుల హృదయమూ మాత్రమే కాదు. అలమేల్మంగమ్మ తాళిబొట్టు కూడా! ‘నగవు చూపులవాడు నాభికమలమువాడుమొగపుల మొలనూళ్ళమొలవాడుచిగురు మోవివాడు శ్రీవేంకటేశ్వరుడుతగు నలమేల్మంగ తాళిమెడవాడు’ అంటాడు అన్నమయ్య!మరి ఆమె స్థానం?... పరమాత్ముడైన హరికి పట్టపురాణి!

సిరికాంత. శ్రీకాంతుడు.

అంతులేని ఏకాంతం.

ఆ కొత్త జంటకు శేషాచలమే ప్రేమ విడిది. 

అతడి భావుకతకు భామ శ్రోత. 

ఆమె నృత్యానికి స్వామి ప్రేక్షకుడు. 

అలరులు కురియగ నాడెనదే

అలకల కులుకుల నలమేల్‌ మంగ!

అసలే అరవిరి సొబగుల భామ. ఆపైన నయన మనోహరమైన నృత్య భంగిమలు! కొప్పులోని విరులు సిరులై రాలుతున్నాయట. ముంగురులు అటూ ఇటూ కదులుతూ అధినాయకిని అనుకరించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాయట. 

ప్రేమ, అసూయ .. రెండిటి మధ్యా సవతిపోరు సాగుతూనే ఉంటుంది. కోమలి పద్మావతికి కూడా తప్పలేదా తీయని వ్యధ. చక్కనివాడు తనకే చిక్కాలన్న కోరిక. ఆ ముద్దులూ మురిపాలూ మరొకరి పాలు కాకూడదన్న షరతు! స్వామి రాచకార్యం మీద బయటికెళ్లి వచ్చినా.. ఏ నెచ్చెలినో మరిగి, ఆ వెచ్చని కౌగిలిలో కరిగి నడిరేయి ఏ జామునో తలుపు తడుతున్నాడేమో అన్న శంక. 

‘లేకపోతే, నిజం కాకపోతే.. ఒంటినిండా ఆ చెమటలేమిటి?’ - దబాయించింది ఓసారి. 

‘దేవీ! కృష్ణావతారంలో మండుటెండలో ఆవుల్ని మేపినప్పటి చెమటలు బంగారం!’ - అని బుకాయించబోయాడు.

‘మరి, ఆ పెదాలేమిటి అంత ఎర్రగా..? - మరో ప్రశ్న.

‘గోకులంలో వేడివేడి పాలు ఆరగించేవాడినని తెలియదా? ఆ ప్రభావమే..’ ఇంకేదో చెప్పబోయాడు. 

ఇంకో ప్రశ్నాశరం. ‘ఒంటిమీద ఆ కొత్త అత్తరు పరిమళం  ఎవరిది?’

‘కంసమామను చంపడానికి వెళ్తుంటే, మధురవీధిలో కుబ్జ పూసిన మంచిగంధం కావచ్చు. కలియుగం వచ్చినా ఆ సువాసనలు పోలేదు సుమ్మీ!’ అంటూ ద్వాపర కబుర్లు చెప్పి దాటవేయబోయాడు. ‘బొంకులు చాలు... బ్రహ్మాండ నాయకా!’ అంటూ రెట్టించింది. ఆ జగడాలూ కొంతసేపే. అతను గుంజీలు తీస్తాడు. కావాలంటే, కౌగిలింతల  కఠిన కారాగార శిక్ష విధించమంటాడు. ఆమె నవ్వేస్తుంది. అతనూ నవ్వేస్తాడు. అక్కాబావల ఏకాంతానికి భంగం కలిగించకుండా.. మబ్బుల చాటుకు వెళ్లాడు చంద్రుడు.  జనప్రియుడైన గోవిందుడు భోజన ప్రియుడు కూడా! అలమేలు మంగమ్మ కొసరికొసరి వడ్డిస్తుంటే.. అతను మురిసి మురిసి విందారగిస్తున్నాడు. పళ్లెంలోని ప్రతి పాకాన్నీ రుచి చూస్తున్నాడు. మేరు మందరాలవలె   మెరయు నిడ్డెనలు

సూరియ చంద్రులవంటి చుట్టూ బళ్లేలు

ఆరని రాజాన్నాలు అందుపై వడ్డించగాను

బోరన చుక్కలు రాసివోసినట్లుండెను

ఆ ఇడ్లీలు మేరు పర్వతాల్లా మెరిసిపోతున్నాయట! ఆ పళ్లాలు సూర్యచంద్రుల్లా ధగధగలాడుతున్నాయట. వేడివేడి అన్నాల్ని వడ్డిస్తుంటే, నక్షత్రాల్ని రాశిగా పోసినట్టు ఉందట! అలమేలు మంగమ్మ పలుకు తేనెలు.. పిండివంటల తీపితో పోటీపడుతున్నాయట. మాటలే అంత కమ్మగా ఉంటే, వాటి వెనకున్న ఒద్దికైన పెదాలు ఇంకెంత తీపిని దాచుకున్నాయో! 

‘తియ్యని నీ మోవి తేనెలే కదవే

వియ్యపు రమణుని విందులివి!’

అంటారు ఆచార్యులు. 

ఆమెకు సర్వేశ్వరుడే సర్వస్వం! తలపులనిండా తిరుమలదేవుడే! కలలో అయినా కమలనాభుడే! ఊపిరిలోనూ జగన్నాయకుడే! అలమేలు మంగమ్మ మానసిక స్థితిని తాళ్లపాక కవి తనదైన శైలిలో చెప్పాడు..

‘కొసరినా నిన్నే కాని కోపించినా నిన్నే కాని

పిలిచినా నిన్నే కాని పేరుకొన్నా నిన్నే కాని

సొలసినా నిన్నే కాని సోకనాడినా నిన్నే కాని

కలనైనా తలపెందూ కలుగదు గదవయ్యా!’

ఆ మధురభక్తికి స్వామి మురిసిపోయాడు. ఆలింగనాదులతో ఆశీర్వచనం కురిపించాడు. 

‘కొమ్మా! నీ పలుకులకు కుశలమస్తు

సమ్మదపు వయసుకు ఐశ్వర్యమస్తు’.. అని ప్రారంభించాడు. మధురమైన నీ పలుకులకు కుశలం కలుగుగాక! నీ యవ్వనం ఐశ్వర్యంలా వృద్ధి చెందుగాక! నీ జాబిలి మోముకు జయము జయము! నీ తుమ్మెద కురులకు దీర్ఘాయురస్తు! అనుదినమూ నీకు కల్యాణమస్తు’ .. ఇలా అంగాంగాన్నీ ఆశీర్వదించాడు. ఆ వ్యక్తీకరణలో ఎంత కొంటెదనం! ఆ భాషలో ఎంత కమ్మదనం! 

ఆలూమగల అనుబంధాన్ని ఇలాంటి ప్రణయ ఘట్టాలే మరింత బలపరుస్తాయి.  ఓ సంకీర్తనలో పద్మావతిని చెంచితగా, శ్రీనివాసుడిని గడసరి ప్రేమికుడిగా ఊహించుకున్నారు తాళ్లపాక కవులు. అతడికి వడ్డించడానికి అడవిలో దొరికే అమృత ఫలాలన్నీ కోరికోరి కోసుకొచ్చిందట. అతడి మెడలో అలంకరించడానికి కొండలూ గుట్టలూ తిరిగి నానావిధ పుష్పాలు  సేకరించి తెచ్చిందట! పరికిదండ, పొగడ దండ, బండి గురువింద దండ.. ప్రేమగా మెడలో వేయబోతుంటే, ‘మేని దండ’ కావాలంటూ మైకంగా ముందుకు దూసుకొచ్చాడట. అక్కడితో ఆగలేదు! ముసురుతేనె, జుంటితేనె, ముదిరినట్టి పెరలతేనె, పూవుతేనె, పుట్టతేనె.. కమ్మగా రుచి చూపించబోతే, ‘మోవి తేనె’ అడిగాడట, మొహమాటం లేకుండా. 

రామరామా... కాదుకాదు కృష్ణ కృష్ణా! 

శ్రీనివాసుడి దరహాసమంటే అమ్మవారికి మహా ఇష్టం. 

అమ్మవారి చిరునవ్వు కోసం శ్రీనివాసుడు పరితపిస్తుంటాడు.

హిరణ్యాక్షుడిని సంహరించాక.. స్వామి తీవ్రంగా అలసిపోయాడట! ఎంత విశ్రాంతి తీసుకున్నా బడలిక తీరలేదు. ఉల్లాసం కోసం రంభాదుల నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేశారు దేవతలు. నారద తుంబురులతో కచేరీలు కూడా పెట్టించారు. అయినా, అలసట తీరలేదు. పుట్టింటికి వెళ్లిన అమ్మవారు, సరిగ్గా అదే సమయానికి తిరిగి వచ్చారట. శ్రీపతిని చూసి చిరునవ్వు నవ్వారట! అంతే, బడలిక దూరమైపోయింది. ఆ నవ్వుకు అంత శక్తి ఉంది. ఆ ప్రేమకూ అంత శక్తి ఉంది. తిరుమల దేవుడి చిరు దరహాసం కూడా ఆ తల్లి చలవేనని అంటాడు. ఆమె లేకపోతే అతను ఉగ్ర శ్రీనివాస మూర్తే.త్రేతాయుగంలో అతడి కోసం ఆమె సీతమ్మగా పుట్టింది. అడవులకు వెళ్లింది. అష్టకష్టాలూ పడింది. ద్వాపరలో ఆమె కోసం అతడు ఇంద్రుడి మీదికే దండెత్తాడు. పాదాల ముందు వాలి, అలకలు తీర్చాడు. కలియుగంలో... పద్మావతీ కటాక్షం కోసం తిరుమల కొండమీద పన్నెండేండ్లు తపస్సు చేశాడు శ్రీవేంకటేశ్వరుడిగా. ఆ ప్రేమకు మెచ్చి హృదయలక్ష్మిగా.. ఏకంగా  స్వామి వక్షస్థలాన్నే నివాసం చేసుకున్నది. గుండెల మీద ఉంటే, నేరుగా ఆ కొండలరాయడిని చూడటం కుదరదు కదా? అందుకే, లక్ష్మీదేవిగా, భూదేవిగా అవతరించి కుడి ఎడమల కొలువైంది. అయినా తనివి తీరలేదు. నీలాదేవిగా నెలకొన్నదట. అలా, ఆరు కండ్లతో అనంతమూర్తిని ఆరాధిస్తూ ఉంటుందట. శ్రీ..నివాసా! లక్ష్మమ్మ పెనిమిటీ! అని పిలిస్తే చాలు వేవేల నామాలవాడు మురిసిపోతాడు. అదీ సతిమీద పతిదేవుడి ప్రేమ! ఆ బంధం అనునిత్యం బలపడుతూనే ఉంటుంది, అందుకేనేమో రోజూ కల్యాణోత్సవం జరిపించుకుంటారు. ప్రతి శుక్రవారమూ అభిషేకం పేరుతో ఆ ఆలూమగలు సరిగంగ స్నానాలు ఆడతారు. ఎంత రాకుమార్తె అయినా పద్మావతి సుకుమారి. ఆయుధాల్ని చూసి ఆ భీతహరిణ భయపడిపోదూ? అనిపించి ఉంటుంది స్వామికి. కాబట్టే, మూలవిరాట్టు నిరాయుధుడిగా వెలిశాడని ఓ కథనం. రామానుజుల కాలంలో ఆ మూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తే అని లోకానికి చాటడానికి శంఖచక్రాలను సమకూర్చారని అంటారు. ఓ యుద్ధ సమయంలో వేంకటేశ్వరుడు భార్య తరఫు బంధువులకు వాటిని సాయంగా ఇచ్చాడని ఇంకో కథ. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహమ్‌

శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం...

శ్రీశ్రీశ్రీ... అంటూ సిరిదేవి పేరు పలికిన ప్రతిసారీ శ్రీనివాసుడు పులకరించిపోతాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలనే అంతులేని సంపదలను కటాక్షిస్తాడు.  శ్రీనివాసుడు దాత, మహాదాత! కొప్పెరలో రంగులకాగితాల కట్టలు వేసి మనమేదో దేవుడికి ఘనంగా సమర్పించామని భ్రమపడిపోతాం. కానీ, నిజానికి ఆయన తీసుకునేది.. ఆ కట్ల పాముల రూపంలోని మన అహాన్ని! అంతకు వేయిరెట్ల వరాల్ని తిరిగి ఇస్తాడు. ఒక్కసారి పురాణాల్ని పరికించి చూడండి, ఎంతమందికి ఎన్ని ఇవ్వలేదూ? 

యిచ్చెను సంపదలితడింద్రాదులకునెల్ల.. యిచ్చెను శుకాదులకు ఇహపరాలు

..యిచ్చెను వాయుజునికి యిట మీది బ్రహ్మపట్ట..మిచ్చల ఘంటాకర్ణునికిచ్చె గుబేరత్వము!

అంగనలీరే ఆరతులు

అంగజ గురునకు నారతులు

శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే

ఆదిమ పురుషునికారతులు

ఆదిత్య తేజునకారతులు!

పూల రంగడు

అమ్మవారితో షికార్లు అంటే శ్రీనివాసుడికి మహా ఇష్టం. తరచూ అనంతాళ్వార్ల పూదోటలో విహరించేవారు. రతీ మన్మథుల్లా కనిపిస్తున్న ఆ జంటను చూసి ఏ రాచకుటుంబీకులో అనుకున్నారు అనంతాళ్వార్లు. అయినా సరే, శ్రీనివాస చక్రవర్తికి సమర్పించాల్సిన పూలను మానవమాత్రులు ఆఘ్రాణించడం ఏమిటి? అపరాధం, అపరాధం. పట్టుకుని దండించబోయాడు. వెన్నదొంగకు తెలియని విద్యా? తప్పించుకుని పారిపోయాడు. అమాయక జవరాలు పద్మావతి మాత్రం దొరికిపోయింది. హరి పాదాలనొత్తే ఆ రెండు చేతులనూ తాళ్లతో కట్టేశాడు. సుప్రభాత సమయానికి అర్చకస్వాములు ఆనంద నిలయ ద్వారాలు తెరిచి చూస్తే.. మూలవిరాట్టు హృదయస్థానంలో వ్యూహలక్ష్మి కనిపించలేదు. అంతా ఆందోళన పడ్డారు.  శ్రీలక్ష్మి అనంతాళ్వార్ల తోటలో బందీగా ఉన్న విషయాన్ని అర్చకులకు తెలిసేలా చేశారట స్వామివారు. పరుగుపరుగున వెళ్లి అనంతయ్యకు అసలు సంగతి వివరించారు. ఆ పరమభక్తుడు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తల్లిని సగౌరవంగా పూలబుట్టలో తీసుకెళ్లి తిరుమలయ్యకు అప్పగించాడు. అలా తనకు, మరోసారి కన్యా దానం చేసినందుకు అనంతాళ్వారును శ్రీనివాసుడు ‘మామా’ అని సంబోధించాడట! ఇప్పటికీ, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి బాగ్‌ సవారీ ఉత్సవం జరుగుతుంది. 

ఉత్తిష్ఠ కమలాకాన్తా..

మేలుకొలుపు సమయంలో శ్రీనివాసుడికి వినిపించే సుప్రభాతాన్ని అణ్ణన్‌ స్వామి అనే మహాపండితుడు రచించారు. దాదాపు ఐదువందల సంవత్సరాల క్రితం తిరుమలలో సుప్రభాత సంప్రదాయం ప్రారంభమైందని అంటారు. అందులో పద్మావతీ వేంకటేశ్వరుల దాంపత్య వైభవాన్ని పరోక్షంగా వర్ణించారు అణ్ణన్‌ స్వామి. ఆ భక్తుడు ఉత్తిష్ఠ కమలాకాన్తా త్రైలోక్యం మంగళం కురు.. అంటూ ఆలిపేరును ప్రస్తావిస్తూ.. కలియుగ దైవాన్ని  మేల్కొలిపే ప్రయత్నం చేస్తాడు. అయినా, నిరంతర నిర్నిద్రుడు నిద్రమత్తు వీడడు. ఈసారి మరో తీయని అక్షరాస్ర్తాన్ని సంధిస్తాడు కవి. వ్యూహాత్మకంగా అట్నుంచి నరుక్కువస్తాడు. ‘ఆయన సంగతి సరే, నువ్వయినా మేలుకో తల్లీ’ అంటూ అమ్మవారిని వేడుకుంటాడు. ఆమె మేల్కొని, కుచ్చిళ్లు సర్దుకునే అలికిడి విని అయినా స్వామి కళ్లు తెరువకపోతాడా అన్న ఆశ! 

సంక్షిప్త సుప్రభాతం

ప్రాతః స్మరామి రమయా సహవేంకటేశం

మందస్మితం ముఖసరోరుహకాంత రమ్యం

మాణిక్యకాంతి విలసోన్ముకుటోర్ధపుండ్రం

పద్మాక్ష లక్షమణి కుండల మండితాంగం

ప్రాతః భజామి కరరమ్య సుశంఖ చక్రం

భక్తాభయప్రద కటిస్థల దత్త పాణే

శ్రీవత్సకౌస్తుభ లసన్మణి కౌంచనాఢ్యం

పీతాంబరం మదనకోటి సుమోహనాంగం

ప్రాతర్నమామి పరమాత్మ పదారవిందం

ఆనంద సాంద్ర నిలయం మణినూపురాఢ్యం

పతత్సమస్త జగతామిది  దర్శయంతం

వైకుంఠమంత్ర భజతాం కరపల్లవేన

వ్యాసరాయ జయతి ప్రోక్తం శ్లోకత్రయ మిదం శుభం

ప్రాతఃకాలే పఠేద్యస్తు పాపేభ్యోముచ్యతే నరః

( వ్యాసతీర్థులు రచించిన సుప్రభాత శ్లోక త్రయం ఇది. సంక్షిప్తమే అయినా సుందరం)

ఆనంద నిలయ స్వరూపం

శ్రీహరి నివాసానికి తొలివాకిలి.. మహాద్వారం. యాభై అడుగుల ఎత్తుతో కృష్ణస్వామి విశ్వరూపాన్ని గుర్తుకుతెస్తుంది. ఆ ద్వారానికి ఇరువైపులా శంఖనిధి, చక్రనిధి అనే పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఆలయంలోని అపార సంపదకు ఈ ఇద్దరూ రక్షకులు. కొంతదూరంలోనే కృష్ణరాయ మండపం కనిపిస్తుంది. విజయనగర శిల్పకళారీతికి ప్రతీక ఇది. ముద్దొచ్చే అద్దాల మండపాన్నీ చూసి తీరాల్సిందే. వరాహస్వామి ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు మూలవిరాట్టును ఇక్కడే భద్రపరిచారు. తిరుమలరాయ మండపం కూడా ముఖ్య కట్టడమే. బ్రహ్మోత్సవాల రోజుల్లో ధ్వజారోహణ జరుగుతున్నప్పుడు ఇక్కడే ‘కొలువు మేళం’. అంగరంగ వైభవంతో అలరారే రంగ మండపానికి చాలా చరిత్ర ఉంది. తురుష్కుల దాడులు తీవ్రతరం అయినప్పుడు.. శ్రీరంగంలో వెలసిన రంగనాథుడు ఇక్కడ కొంతకాలం ఆశ్రయం పొందాడు. పుష్పమండపంలో స్వామికి అలంకరించే దండల్ని సిద్ధం చేస్తారు. కల్యాణమండపంలో కల్యాణోత్సవాలు జరుగుతాయి. పడిపోటు ప్రధాన నైవేద్యాల వంటశాల. ఇక, వెండి వాకిలికి రజతశోభను అద్దింది హైదరాబాద్‌ భక్తుడే. 1929 ప్రాంతంలో నిజాం రాష్ర్టానికి చెందిన ద్వారకాదాస్‌ పరభణీ ఆ సత్కార్యానికి పూనుకున్నారు. సంకీర్తనా భాండాగారం అన్నమయ్య పదాలకు నెలవు. పరిమళం అర.. తిరునామానికి ఉపయోగించే పచ్చ కర్పూరాన్ని నూరే చోటు. శ్రీవారి కొప్పెర.. దేవదేవుడి హుండీ. బంగారు వాకిలి దాటగానే బ్రహ్మాండ నాయకుడి దివ్య దర్శనం! గోవిందా.. గోవిందా!