సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Jun 14, 2020 , 01:16:23

ప్రగతి కోసం.. ప్రతిజ్ఞ!

ప్రగతి కోసం.. ప్రతిజ్ఞ!

మాట.. భౌతికంగా ఇచ్చేది. ప్రతిజ్ఞ.. మనసుతో చేసేది. వందసార్లు మాటిచ్చి తప్పుతుండొచ్చు. కానీ.. ఒక్కసారి ప్రతినబూనితే ప్రాణం పోయినా తప్పం. అదీ ఒట్టుకున్న గట్టి నమ్మకం. మాట తప్పని.. మడమ తిప్పని ప్రమాణాలు.. తీర్మానాలు.. ప్రతిజ్ఞలు తెలంగాణలో మార్పుకు శ్రీకారం చుడుతున్నాయి. ప్రజా సంక్షేమం కోసం సర్కారు తీసుకున్న నిర్ణయాలను బలపరుస్తూ ఊరుమ్మడి ప్రతిజ్ఞలు ఊపందుకుంటున్నాయి. సర్కారు బడిలో పిల్లల్ని చదివిద్దామనీ.. సంక్షేమాన్ని కోరే పార్టీనే గెలిపిద్దామనీ.. ప్రణాళికాబద్ధమైన సాగునే సాగిద్దామని త్రికరణశుద్ధిగా ప్రమాణాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.

మాటాడరాదు సభలను మాటాడిన తప్పరాదు మగసింగమునకున్‌ మాటే మానముగాదా సాటువగలవారకెల్ల సాహిణిమారా! .. అని ఓ చాటు పద్యం. నలుగురి ముందు మాట ఇవ్వకూడదు. ఇస్తే తప్పకూడదు. మాటను మించిన మర్యాద ఉండదు కదా!  అని పద్య భావం. తెలంగాణ ప్రజలు ప్రతిజ్ఞాపాలనలో ముం దుంటారు.  ఇచ్చిన మాట తప్పరు. ఎవరైనా తప్పినా మెచ్చరు. అలాంటి ఓ యజ్ఞం జరుగుతున్నదిప్పుడు. అదే ప్రణాళికాబద్ధ సాగు. ఏదో ఓ పంట వేసి.. తీవ్రంగా నష్టపోయి, లబోదిబోమని మొత్తుకోవడం కాదు.. మార్కెట్‌లో గిరాకీ ఉండే పంటలే పండించి.. రైతు రాజు కావాలన్నదే సర్కారు ఉద్దేశం. ఆరుగాలం కష్టపడినా గిట్టుబాటు ధర అందకపోతే ప్రయోజనం ఏం ఉంటుంది?   వ్యవసాయం లాభసాటిగా ఎలా మార్చుకోవాలో సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుంటే, ఎవరి మాటలో వినాల్సిన పన్లేదు. ‘సీఎం సార్‌ ఆదేశాల్నే పాటిస్తాం..’ అంటూ ఎక్కడికక్కడ ఊరుమ్మడి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సాగును బాగుపర్చుకోవడంలోనే కాదు.. ఒక్కమాట మీద నిలబడి ప్రతిజ్ఞలు.. తీర్మానాలు.. ప్రమాణాలు చేసిన సంఘటనలు.. సన్నివేశాలు తెలంగాణ చరిత్రలో అనేకం ఉన్నాయి. 

సాగు కోసం.. బాగు కోసం

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దీపూర్‌. ఈ ఊరి ప్రజలకు వ్యవసాయమే ఆధారం. అందరిలా సంప్రదాయ సేద్యమే చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వద్దు అంటున్నది. లాభసాటి వ్యవసాయం చేయమనీ మూస విధానాలకు స్వస్తి చెప్పమనీ సూచిస్తున్నది. 

‘రైతు బాగుండాలి.. వ్యవసాయం బాగుండాలి’ అని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. గ్రామస్తులంతా ఓచోట సమావేశమై ‘ప్రణాళికాబద్ధమైన సాగు’ చేస్తే ఎలా ఉంటుందో చర్చించుకున్నారు. ‘రైతుల కోసం ఇంత చేస్తుండు కేసీఆర్‌. ఏం చేసినా మన బాగు కోసమే చేస్తడు. ఆయన చెప్పినట్టు వింటేనే ఎవుసం బాగుపడతది’ అని ఒక్కమాటమీదికి వచ్చారు. అందరూ గ్రామపంచాయతీ దగ్గర చేరి.. ‘పర్దీపూర్‌ గ్రామ రైతులమైన మేము.. ముఖ్యమంత్రిపై విశ్వాసంతో.. లాభసాటి వ్యవసాయం చేయండని సీఎం ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ ప్రణాళికాబద్ధమైన సాగుకు సుముఖంగా ఉన్నాం. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేస్తాం. గిట్టుబాటు అయ్యేలా నూతన వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తామని.. ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని తీర్మానించుకున్నారు.  ఇప్పుడు వాళ్ల లక్ష్యం.. ప్రణాళికాబద్ధ వ్యవసాయం. వాళ్ల మార్గం నూతన విధాన వ్యవసాయం. వాళ్ల  భవిష్యత్తు లాభసాటి వ్యవసాయం. రైతు రాజే కాదు, వ్యాపారవేత్తా కావాలి. డాక్టర్‌ స్వామినాథన్‌ ఏమంటారంటే.. 

If agriculture goes wrong, nothing else will have a chance to go right in the country. ఈ మాట తెలంగాణలో విప్లవాత్మకంగా జరుగుతున్న ప్రణాళికాబద్ధ సాగుకూ వర్తిస్తుంది. నిజమే కదా? వ్యవసాయంలోనే తప్పులు జరిగితే.. ఇక వేరే వ్యవస్థలు మాత్రం సరైన మార్గంలో ఎలా వెళ్తాయి? 


పరిశుభ్రతను్ర పేమిస్తూ

రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండలం మురళీనగర్‌. అదో చిన్న ఊరు. కనీస సౌకర్యాలు కూడా కరువు. ఊళ్లో ఒక్క ఇంటికి కూడా మరుగుదొడ్డి లేదు. పొద్దున్నే చేతిలో డబ్బా పట్టుకొని అందరూ లైన్లు కడుతుండేవారు. కొత్తవాళ్లెవరైనా ఆ ఊరిమీది నుంచి పోతున్నప్పుడు - ఆ అనాగరికాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. 

ఇట్లయితే ఎట్లా? 

పెద్దమనుషులు.. యువత కలిసి మాట్లాడుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ పిలిపించారు. ‘మురళీనగర్‌ ప్రజలమైన మేము.. ఇప్పటి నుంచి బహిర్భూమికి వెళ్లం. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకొని వ్యక్తిగత.. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తాం’ అని ప్రమాణం చేశారు. ఇప్పుడు మురళీనగర్‌ వందశాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామం. అంతేకాదు.. ఆదర్శగ్రామంగా కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొంది కేంద్ర బృందం కూడా పర్యటించి గ్రామంలోని మార్పును మోడల్‌గా దేశమంతటికీ చూపించింది. ఎలా సాధ్యమైంది? 

ప్రతిజ్ఞ ద్వారా సాకారమైంది. అంతకుముందు కూడా చాలాసార్లు చేద్దాం.. చూద్దాం అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేశారో, అప్పుడే నిబద్ధత పెరిగింది. బాధ్యత తెలిసివచ్చింది. మార్పు మొదలైంది. మురళీనగర్‌ అభివృద్ధిని సొంతం చేసుకున్నది. సమగ్ర వికాసం దిశగా పరుగులు పెడుతున్నది.ఇగ్గీ అజెలియా అనే ఆస్ట్రేలియన్‌ గేయరచయిత ఇలాంటి ‘మార్పు ప్రతిజ’్ఞ గురించి ఏమంటారంటే.. Pledge allegiance to the struggle అని. అవును. నిజమే కదా? మురళీనగర్‌ మార్పును చూస్తే.. ప్రతిజ్ఞ అనేది పోరాటానికి విధేయతలాంటిదే అని చెప్పొచ్చు.

మద్య నిషేధం ధ్యేయంగా..

వరంగల్‌ జిల్లా నడకూడ మండలం రామకృష్ణాపూర్‌. పెద్ద ఊరే. ఆ పల్లెలో మహిళలకు ఒక సమస్య ఉండేది. పొలం కాడికి పోయినోళ్లు సీదా అట్లనే ఇంటికొస్తే బాగుంటుంది. చూడటానికి కూడా మంచిగనిపిస్తుంది. కానీ వచ్చేటోళ్లు మధ్యలో బెల్ట్‌షాపుకెళ్లి తాగొస్తే, ఆపుకోలేనంత కోపం వచ్చేస్తుంది. 

అంతంత మాత్రం ఆదాయం. అందులో తాగుడుకే సగం పోతే, ఇల్లు.. సంసారం ఎట్లా గడుస్తుంది? రామకృష్ణాపురం మహిళలకున్న పరేషానే ఇది. అంతా మీటింగ్‌ పెట్టుకున్నారు. అందరినీ పిలిపించి..  ‘మేము.. బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు నిషేధించాలనీ.. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనీ తీర్మానించుకున్నాం. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా.. బెల్ట్‌ షాపులో మద్యం తాగిన వారికి రూ.25 వేలు జరిమానా.. ఈ సమాచారం ఇచ్చినవారికి రూ.10వేల బహుమతి ఇస్తామని తెలియజేస్తున్నాం’.. అని ప్రతిజ్ఞ చేశారు. ఇంకేముంది? అప్పటి నుంచి ఊళ్లో బెల్టుషాపు విక్రయాలు లేవు.. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ నిమ్మళంగా ఉంటున్నారు. 

ఇదంతా ఎట్లా సాధ్యమైంది?

ఒక ప్రతిజ్ఞ.. ఒకే ఒక్క ప్రతిజ్ఞ. మిషెల్లీ బచ్‌మన్‌ అనే అమెరికన్‌ నాయకురాలు ఇలాంటి ఫలితాల గురించి ఏమంటారంటే.. I pledge to you Im not a talker. Im a doer అని. మిషెల్లీ మాట రామకృష్ణాపూర్‌ ప్రజలను చూస్తే నిజమే అనిపిస్తుంది. వాళ్లు పెద్దపెద్ద ప్రసంగాలు ఇవ్వలేదు.. ప్రమాణం చేశారు. ఆ ప్రమాణానికి కట్టుబడ్డారు. అంతే!బడి బతకాలని.. 

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. తెల్లారగానే ఊళ్లోకి పదీ పదిహేను ప్రైవేటు స్కూల్‌ వ్యాన్లు వచ్చేవి. జిల్లా కేంద్రంలోని స్కూళ్లకు పిల్లల్ని తీసుకెళ్లేవి. ఊర్లో సర్కారు బడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియం బోధిస్తున్నారు. ఎవరికి వారు, తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపడం వల్ల సర్కారు బడి పరిస్థితి ఏమిటని అనుకున్నారు గ్రామ పెద్దలు. 

ఒకరోజు.. ఊళ్లో చాటింపు వేసి అందరినీ పిలిపించారు. ‘ప్రైవేటు స్కూల్‌ బస్సులను మనం ఆపొద్దు. కానీ మన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్‌కి పంపిస్తే వాటంతట అవే బంద్‌ అవుతాయి. లేకపోతే భవిష్యత్‌లో సర్కారు బడి అనేది జ్ఞాపకంగా మారిపోతుంది’ అని తీర్మానించుకున్నారు. ‘ఏపీ లింగోటం.. గ్రామస్తులమైన మేము.. సర్కారు బడి బతకాలనే ఆలోచనతో మా పిల్లల్ని సర్కారు బడికే పంపించాలని అనుకుంటున్నాం. మితిమీరుతున్న ప్రైవేటు పాఠశాలల పోకడలు.. పిల్లలపై పడుతున్న ఒత్తిడికి చరమగీతం పాడేందుకు సర్కారు బడిలోనే మా పిల్లల్ని చదివించాలని ఇందుమూలంగా  ప్రతిజ్ఞ చేస్తున్నాం’.. అని ఊరు ఊరంతా నిశ్చయించుకున్నారు. మంచి ఫలితం వచ్చింది. ప్రైవేటు స్కూల్‌ బస్సులు ఊర్లోకి రావడం తగ్గాయి. సర్కారుబడిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఎలా సాధ్యమైంది? 

చదువుపట్ల.. ప్రభుత్వ పాఠశాల విద్యపట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండటం వల్ల ఈ మార్పు సాధ్యమైంది. థియోడోర్‌ ఫోర్స్‌మన్‌ అనే పారిశ్రామిక వేత్త ఇలాంటి చైతన్యం గురించి ఏమంటారంటే.. by joining The Pledge, it will encourage others to do the same అని. ఏపీ లింగోటం విషయంలో ఇదే జరిగింది. ఒకరిద్దరు అనుకొని ప్రతిజ్ఞ చేయడం వల్ల మిగతా వాళ్లను ప్రోత్సహించినట్టు అయింది. సర్కారు బడి బతికింది. 

సుపరిపాలన వైపు.. 

జనగామ జిల్లా దేవురుప్పల మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి విపరీతంగా పోటీ ఏర్పడింది.  లక్షలు ఖర్చు చేసిన వాళ్లు ఊరి బాగుకోసం పాటుపడతారా? అన్న చర్చ వచ్చింది.  సింగరాజుపల్లి.. మన్‌పహాడ్‌.. పెద్దతండా..  గ్రామస్తులంతా మాట్లాడుకున్నారు. ఏకగ్రీవంగా పంచాయతీలను ఎన్నుకుంటే రూ.10 లక్షల నజరానా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూడు గ్రామాల ప్రజలు మరోసారి సమావేశమై ఓ నిర్ణయం తీసుకున్నారు. 

‘అందరమూ ఒక్కతాటిపైకి వచ్చి, మనలో ఎవరినో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రభుత్వం ఇచ్చే పదిలక్షలు.. దానికి తోడు మిగులు నిధులు ఏమైనా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది’ అనుకున్నారు. ఊర్లో చాటింపు వేసి.. ‘సింగరాజుపల్లి.. మన్‌పహాడ్‌.. పెద్దతండా గ్రామాలకు చెందిన మేము.. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో.. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటామనీ.. ప్రభుత్వం ఇచ్చే నజరానాను సద్వినియోగం చేసుకుంటామనీ, ఆ మొత్తాన్ని పంచాయతీ అభివృద్ధికి వినియోగించేలా చొరవ తీసుకుంటామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం’.. అని తీర్మానించుకున్నారు. 

తర్వాత? ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు గ్రామ పంచాయతీల్లో జమ అయ్యాయి. వాటితో సీసీ రోడ్ల నిర్మాణం.. డ్రైనేజీ వ్యవస్థ.. పాఠశాలల్లో మౌలిక వసతులను ఏర్పరచుకోగలిగారు. ఆఫ్రికన్‌ రచయిత ఒకరు ఇలాంటి వాగ్దానాలు.. ప్రమాణాల గురించి ఏమన్నారంటే Promise yourself, no matter how hard it gets, you’ll never give up on your dreams అని. ఈ మూడు గ్రామపంచాయతీ వాళ్లు అదే చేశారు. ఏకగ్రీవం చేస్తే అభివృద్ధి కాదు.. డబ్బులు చేతికి అందవు అని ఎవరెన్ని మాట్లాడినా వాళ్లు వాళ్ల స్వీయ ప్రమాణం పాటించి అనుకున్నది సాధించుకున్నారు.