ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - May 24, 2020 , 01:01:56

‘బాల్కనీ’లో నగరం!

‘బాల్కనీ’లో నగరం!

లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతా స్తంభించింది. ఊర్లు బోసిపోయాయి. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. నగరాల్లో ఎవరిళ్లకు వాళ్లే పరిమితమయ్యారు. ఇన్నాళ్లూ బోరుమన్న బాల్కనీలకు ఒక్కసారిగా జీవకళ వచ్చింది. పిల్లాపాపలతో, పెద్దలతో కళకళలాడాయి. అంతా లాక్‌డౌన్‌ మాయ! ఇలాంటి ఎన్నో మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. నగరజీవితాలను ఆవిష్కరిస్తున్నది ‘హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్స్‌'.

లాక్‌డౌన్‌కు ముందు.. ఉరుకుల పరుగుల జీవితం. తినే సమయం కూడా లేదు. ఉదయం బయటికెళ్తే.. మళ్లీ రాత్రికే ఇంటికి. ఎప్పుడు తింటారో? ఎప్పుడు పడుకుంటారో? ఎప్పుడు పనులు చేసుకుంటారో? తెల్లారితే.. మళ్లీ అదే జీవిత చక్రం.లాక్‌డౌన్‌లో.. ఇళ్లనుంచి ఎవరూ అడుగు బయటపెట్టలేదు. బాల్కనీలే ఆఫీసులు, బాల్కనీలే పార్కులు. ఉద్యోగులు బాల్కనీల్లో ఆఫీసు పనులు చక్కబెట్టుకుంటున్నారు. పిల్లలు ఫోన్లు పక్కనపెట్టి.. బాల్కనీల్లో తల్లిదండ్రులు చెప్పే కథలు వింటున్నారు. ఇక టెర్రస్‌లు ఆడవాళ్లకు వడియాలు ఎండబెట్టుకోవడానికి, మగవాళ్లు కసరత్తు చేసుకోవడానికి  ఉపయోగపడుతున్నాయి. సాయంత్రమైతే చాలు.. అప్పటివరకూ ఉక్కపోతతో అల్లాడిన తనువుకు బాల్కనీలే ఆక్సిజన్‌ బార్లు! ఇదీ.. నగరవాసుల స్థితి. ఈ జీవన విధానాన్ని తమదైన కళతో కళ్లకు కట్టింది  ‘హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్స్‌(హెచ్‌యూఎల్‌)’ ఫౌండేషన్‌. ఈ చిత్రాలన్నీ అర్బన్‌ జీవితాలకు ప్రతీకలే.

బాల్కనీ బతుకు చిత్రాలు..

హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్స్‌కు చెందిన కమ్యూనికేషన్‌ ప్రొఫెషనల్స్‌ శ్రియాదాస్‌, మీనాక్షి మీరా హైదరాబాద్‌ నగరవాసుల బతుకు చిత్రాన్ని అందంగా ఆవిష్కరించారు. వీరు గీసిన  చిత్రాలు లాక్‌డౌన్‌ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ‘లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌ అంతా బాల్కనీల్లోనే నివసించింది. ఇన్నాళ్లూ బోసిపోయిన అపార్ట్‌మెంట్స్‌ సందడిగా మారాయి. సాధారణంగా వీధుల్లో గెంతులేసే పిల్లలు, బాల్కనీల్లోనే ఇండోర్‌ గేమ్స్‌ ఆడుకున్నారు. సిగరెట్‌ తాగేందుకు, కాస్త రిలీఫ్‌ కోసం ఉపయోగపడిన బాల్కనీలు.. సరికొత్త జ్ఞాపకాలకు వేదికలయ్యాయి. ఇలాంటి మార్పులను మేం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటాం’ అంటున్నారు శ్రియా దాస్‌. ‘ఇప్పుడు బాల్కనీలు కొత్త ఆట ప్రదేశాలు. స్కూళ్లలో ఆటస్థలాలు లేక నాలుగు గోడలమధ్యే గడిపిన చిన్నారులు.. లాక్‌డౌన్‌ కారణంగా బోలెడంత విరామం దొరకడంతో టెర్రస్‌లూ, బాల్కనీల్లో నించొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. సాయంత్రమైతే చాలు ఎవరి బాల్కనీల్లో వాళ్లు.. సకుటుంబంగా కబుర్లు చెప్పుకుంటున్నారు’ అన్నారు మీనాక్షి మీరా . గతంలో తెలంగాణ ప్రభుత్వ సాయంతో లమాఖాన్‌ వేదికగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది హెచ్‌యూఎల్‌.

హెచ్‌యూఎల్‌ ఏం చేస్తుంది?

హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్స్‌ (హెచ్‌యూఎల్‌) ఫౌండేషన్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నది. ఈ ఫౌండేషన్‌ నగర ప్రాంతాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. దీన్ని 2012లో స్థాపించారు. విద్యావేత్తలు, అభివృద్ధి నిపుణులతో కూడిన బృందం ‘అర్బన్‌' జీవన విధానాలపై పరిశోధన జరుపుతుంటుంది.  నగరీకరణలోని సమస్యలను, సవాళ్లను వీరు గుర్తిస్తారు. అంతేకాకుండా ఈ ఫౌండేషన్‌, తమ దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. ఆ సమస్య తీవ్రత ప్రతిబింబించేలా చిత్రాలు గీసి, దానిపై నగరవాసుల్లో అవగాహన కల్పిస్తుంది.  హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్స్‌లో ప్రతి విభాగానికీ నిపుణులైన సాంకేతిక బృందం ఉంది. ఇందులో జూనియర్‌ రిసెర్చర్స్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్స్‌, విజిటింగ్‌ రిసెర్చ్‌ స్కాలర్స్‌, కమ్యూనికేషన్‌ కోఆర్డినేటర్స్‌ ఉంటారు. ఈ ఫౌండేషన్‌లో పనిచేయాలంటే కచ్చితంగా అర్బన్‌ లైఫ్‌పై అవగాహన ఉండాలి. వీరు పరిశోధనతో పాటు బోధనా కార్యక్రమాలు కూడా చేపడతారు. ఇవేకాకుండా ఉద్యోగావకాశాలు ఎక్కడున్నాయో కూడా తెలియజేస్తారు. సమస్యపై ఆలోచించడం, మాట్లాడటం, చర్చించడం, బొమ్మలు గీయడం, మ్యాప్‌లు సిద్ధం చేయడం, రాయడం, సమస్యపై ప్రజల స్పందనను రికార్డ్‌ చేయడం, ప్రజలను భాగస్వాములను చేయడం వంటివి ఈ బృందం నిరంతర కార్యక్రమాలు.

నగర జీవితాలే లక్ష్యం..

అర్బన్‌ ప్రజలే మా లక్ష్యం. నగరంలో నివసించే నిరుపేదలు, వలసకూలీలు, కంపెనీల్లో పనిచేసే కార్మికులు, పేద, మధ్యతరగతి, ధనికుల జీవితాల్లో వస్తున్న మార్పులను నిశితంగా అధ్యయం చేయడం ద్వారా భవిష్యత్‌లో రాబోయే సమస్యలను అంచనా వేస్తాం. లాక్‌డౌన్‌వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ సమయంలోనే ప్రభుత్వాలు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే అన్ని వర్గాల జీవితాలూ తిరిగి పుంజుకునే వీలుంటుంది.

- శ్రియా దాస్‌, హెచ్‌యూఎల్‌


logo