Ramaayanam | నాకు పాడటం నేర్పాలని ఆ సంగీతం మాస్టారు ఎంతో ఓపికగా ప్రయత్నించాడు. నా టోన్ ఒక రఫ్ స్టోన్ అని గ్రహించి.. గాత్ర సంగీతం కాకుండా, వాద్య సంగీతం నేర్చుకుంటే మంచిదని నిర్ణయించాడు. నాన్నతో చెప్పి హార్మోనియం కొనుక్కోమని సలహా ఇచ్చాడు. నాదైన పద్ధతిలో ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాను.
నాకెందుకో ఆ హార్మోనియమే నచ్చదు. సినిమాల్లో హార్మోనియం వాయించే వాళ్లు పాన్ నములుతూ, గిరజాల జుట్టుతో ఉండేవారు. ఎక్కువగా హాస్యనటులు పోషించిన పాత్ర అది! ‘వీణ ఎంత అందంగా ఉంటది! వయోలిన్ ఇంకెంత అందంగా ఉంటది! హార్మోనియం ఏంది నేర్చుకునేది?’ అని మనసులో అనుకున్నాను. నా కళ్ల ముందు రాఘవేందర్రావు సినిమాల్లోలా వెయ్యి బొబ్బిలి వీణలు, రెండువేల తంజావూరు వీణలు కదిలి
వెళ్తున్నాయి. అందమైన చీరలు కట్టుకుని, తమ నాజూకు చేతుల్తో వీణలు వాయిస్తున్న సినిమా హీరోయిన్లే కనిపించేవారు.
కాకపోతే ఆయన.. “అన్ని సంగీత వాద్యాలకు మూలం హార్మోనియం. ముందు హార్మోనియం నేర్చుకుంటే.. తర్వాత అన్నీ వాటంతటవే ఈజీగా వస్తాయి” అని మా నాన్నను కన్విన్స్ చేశాడు. ‘సరే! ఏదో ఒకటి ఏడుద్దాం!’ అనుకొని.. హార్మోనియం కొనుగోలు కోసం ఖజానా నుంచి నిదులు విడుదల చేయాల్సిందిగా నాన్నను కోరాను. ఆయన దాటవేసే ధోరణిలో ఉండటంతో.. ఇక లాభం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలో అమ్మకు టెండర్ పెట్టాను. “నేను మొదలే చెప్పిన కదా! నువ్వు ఇప్పుడు ఈ సంగీతం నేర్చుకోవడం అవసరమా! అన్నీ పనిలేనివి నా నెత్తిమీదికి తెస్తవు. ఇప్పుడు ఆ హార్మోనియం అంటే ఉత్తగొస్తదా?! దానికి బొచ్చెడు పైసలు గావాలె! మన దగ్గర లేవు.. ఒద్దే అంటె ఇన్నవా! ఓ ఆఠాణో రూపాయో ఉంటె దాచుకోవాలె గానీ.. గిట్ల దండుగ జేసుకుంటరా?!” అంటూ అమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ, నేను అస్సలే వినలేదు. ‘ఎలాగైనా సరే.. హార్మోనియం కొనాలి. ఆ సంగీతం అంతు చూడాలి!’ అనుకున్నాను. “అమ్మా! కొనవా!?.. అమ్మా! కొనవా!?.. అమ్మా! కొనవా!?..” అంటూ వెంటబడ్డాను. మొత్తానికి అమ్మ ఎట్లా చేసిందో ఏం చేసిందో గానీ, అత్యవసర నిధిలోంచి డబ్బులు తీసి ఇచ్చింది. ఆ మర్నాడే.. ఆయన ఎక్కడిదో డొక్కు సెకండ్ హ్యాండ్ హార్మోనియం తీసుకొచ్చాడు. మళ్లీ పొద్దున్నే ఆయన రావడం.. ఓ చాప వేసుకుని కూర్చోవడం.. హార్మోనియం పెట్టె దాంట్లో పెట్టడం.. నేను తయారై వచ్చి ఆ హార్మోనియం వాయించడం మొదలైంది. నేను వాయిస్తూ ఉంటే ఆ హార్మోనియం మెట్లు ఊడి చేతులోకి రావడం.. ఆయన “అయ్యయ్యో! జాగ్రత్తగా చూసుకోవాలమ్మా!” అంటూ మళ్లీ అమర్చడం జరిగేది.
“ఆ హార్మోనియం మీ సంగీత చక్రవర్తిదే ఉన్నట్టుంది. పైసలు అవుసరం ఒచ్చినయి గావొచ్చు.. మీ జాలి గుండె కనిపెట్టిండు. మన దగ్గర ఆరు వందలు తీసుకొని, ఆ డొక్కు హార్మోనియం అంటగట్టిండు” అని నాన్నతో అమ్మ నవ్వుతూ అంటుంటే.. ఏమీ అనలేక నాన్న కూడా నవ్వేవాడు. మొత్తానికి నేను కీర్తనల దాకా వచ్చాను. ఆ హార్మోనియం మీద నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాను. అందులో ఆయన చెప్పని పాటలు కూడా దాని మీద వాయించడం మొదలుపెట్టాను.
“ఇదేమిటి? ఇంత బాగా వాయిస్తున్నావ్? ఈ పాట నేను నేర్పలేదే?” అనేవాడు కొంచెం హాశ్చర్యపోయి. “అవును మాష్టారూ! నేనే ట్రై చేసిన!” అనేదాన్ని. ఆయనకు కూడా అంతగా సంగీతం ఏమీ రాదని కొద్దిరోజుల్లోనే నాకర్థం అయింది. నేను.. ‘మేష్టారూ!’ అని పిలవాలని ఆయన కోరిక! తెలంగాణలో శాస్త్రీయ సంగీతాలే తక్కువ. జానపదాలు ఉర్రూతలు ఊగుతుంటాయి. ఇక ‘మేష్టారూ!’.. అనడం అస్సలు ఉండదు. నాకేమిటో కృత్రిమంగా అనిపించేది గానీ.. పోనీలే ఏదో సరదా పడుతున్నాడని ‘మేస్టారూ!’ అని పిలిచేదాన్ని.
అయితే ఈ మధ్యకాలంలో చాలా దిగ్భ్రాంతికరమైన నిజాలు తెలిశాయి. అసలు విషయం ఏమిటంటే.. ఈ సంగీత చక్రవర్తి గారు ఫుల్డోస్ మాస్టర్. కాఫీ, టీలు అస్సలు తాగడు. కానీ, వేరే ద్రవాలన్నీ సేవిస్తాడట. ఒక్క మా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం.. అదికూడా ఉదయం పూట తప్ప, ఆయన 24 గంటలు ఏక్ నిషాలోనే ఉంటాడని నాన్నకు తెలిసింది. అమ్మ వెంటనే.. “సంగీతం ఒద్దు, చట్టుబండలు ఒద్దు.. ఆ తాగుబోతు దగ్గర ఈ పిల్ల నేర్చుకోవడం అసలే ఒద్దు!” అని ఆ సంగీతం మానిపిద్దామని పట్టుపట్టింది. ఈలోగా కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.. ఆయనే రావడం మానేశాడు. ఊరినిండా అప్పులు చేసి ఎగ్గొట్టి.. ఎక్కడికో వెళ్లిపోయాడని అందరూ చెప్పుకొన్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు మా ఊర్లోని శ్రీరామ భజన మండలివాళ్లు నాన్నకు మెల్లగా టెండర్ వేసి.. ఆ హార్మోనియం పట్టుకుపోయారు. అలా.. నా సంగీతం చెట్టెక్కింది.
అక్క క్లాస్మేట్, మా కామన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇంద్రాణి (కొండపల్లి నీహారిణి అక్క), నేనూ చాలా జోకులు వేసుకునేవాళ్లం. తనకూ, అక్కకూ, నాకూ.. పాటలంటే చాలా ఇష్టం. కానీ, గాత్రశుద్ధి లేదు. అప్పట్లో ‘చక్రవాకం’ అనే ఓ సినిమాలో వాణిశ్రీ వీణ వాయిస్తూ .. ‘వీణలోనా తీగలోనా ’ అంటూ ఓ పాట పాడుతుంది. అందులో.. ‘గత జన్మ శ్రుతి చేసుకున్నది.. అది ఈ జన్మ సంగీతమైనది’ అని వస్తుంది. మేము ఆ పాటను గుర్తు చేసుకుంటూ.. “మనం గత జన్మలో శ్రుతి చేసుకోలేదు. అందుకే ఈ జన్మలో సంగీతం రాలేదు. అంతే!” అని నవ్వుకునేవాళ్లం.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | సంగీత జ్ఞానం (గాత్రం)
Ramaayanam | చెంబులకొద్దీ నీళ్లు ముంచి ఇస్తుంటే.. బడికి పోయినా బాగుండె అని అనిపించింది!
Ramaayanam | తొలి యాత్రా స్పెషల్!