Kasi Majili Kathalu Episode 60( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : మణిసిద్ధుడు అనే యతి తన దగ్గరున్న మణి ప్రభావంతో లోకంలో జరిగే సంగతులన్నీ తెలుసుకోగలడు. ఆయన తనకు తోడుగా కాశీకి వస్తున్న గోపాలుడికి దారిమధ్యలో కనిపించిన వింతలన్నిటి వెనుక ఉండే కథలను వివరిస్తుంటాడు. ఈ కాశీమజిలీ కథలను పన్నెండు సంపుటాలుగా మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు. ప్రస్తుతం మీరు చదవబోయేది ఆరో సంపుటంలోని కథ.
అది విప్రకూటమనే గ్రామం. ఆ గ్రామవీధుల్లో దాదాపు మిట్టమధ్యాహ్నం కావస్తుండగా అరవై ఏళ్లకు పైబడిన వృద్ధుడొకడు చేతికర్ర సాయంతో నడుస్తున్నాడు. అతని పేరు కామగ్రీవుడు. ఆ గ్రామానికి కొత్తవాడు. అతను బాటవెంట నడుస్తుంటే ఒకచోట ఒక ఇంటివద్ద పన్నెండేళ్ల బాలిక ఆడుకుంటూ కనిపించింది. ఆమెను చూస్తూనే కామగ్రీవుడు మనసులో.. ‘ఓహో! ఎంత చక్కగా ఉంది?! ఈమెను పెళ్లాడితే ఆరు నెలలకే కాపరానికి వస్తుంది. ఏడాది లోపులోనే పిల్లలను ఎత్తుకోవచ్చు’ అనుకున్నాడు. ఆ పిల్ల దగ్గరికి వెళ్లి.. “బాలామణీ! నీ పేరేమిటి? ఈ ఇల్లు మీదేనా?! ఈ పూట నాకు భోజనం పెట్టగలవా?” అని ప్రశ్నించాడు.
“నాపేరు సావిత్రి తాతగారూ! ఒక్కపూటేమి?! పది దినాలైనా మీరు మా ఇంట ఉండవచ్చు” అంటూ చేయి పట్టుకుని, ఆ బాలిక అతణ్ని లోనికి తీసుకువెళ్లింది.
‘తాతా!’ అన్నందుకు మనసులో నొచ్చుకున్నాడు కామగ్రీవుడు. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిస్తే పట్టుతప్పి చెంబు చెయ్యిజారిపోయింది. ఆ పిల్ల మరోసారి నవ్వి.. “బాగా అలసిపోయినట్లున్నారు తాతగారు!” అంటూ తానే అతని కాళ్లు కడిగింది.
తనను పదేపదే ‘తాతా!’ అనడంతో ఉడుక్కుంటూ.. “నేను మరీ అంత ముసలివాణ్ని కాదే పిల్లా! అది సరే కానీ, నా ఎరుకలో ఒక మంచి సంబంధం ఉంది. పెళ్లాడతావా?” అని అడిగాడు కామగ్రీవుడు.
పెళ్లి మాటెత్తడంతో సావిత్రి సిగ్గుపడి లోపలికి వెళ్లిపోయింది. ఆమె తండ్రి అయిన భట్టపాదుడు వచ్చి, కామగ్రీవుడికి అతిథి సత్కారాలు చేశాడు. భోజనాదికాలు పూర్తయిన తరువాత నడవలో కూర్చోబెట్టి..
“ఏదో సంబంధం ఉందని మా అమ్మాయితో చెప్పారట. వివరాలు చెబుతారా?” అని అడిగాడు భట్టపాదుడు.
అందుకు కామగ్రీవుడు.. “ఇక్కడ కాదు. మనకు కొంత రహస్యమైన ప్రదేశం కావాలి” అన్నాడు. భట్టపాదుడు సంశయిస్తూనే అతణ్ని ఒక గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత కామగ్రీవుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.
* * *
..“అయ్యా! మాది కాంచీపురం. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాను. దిక్కులేని నన్ను బంధువులు పోషించారు. చదువు అబ్బలేదు. ఉన్న ఊళ్లోనే యాయవారం చేసుకుంటూ బతికేవాణ్ని. కానీ, నా తోటివాళ్లంతా ఉద్యోగస్తులై, వృత్తిలో గొప్పవారై.. పెళ్లిళ్లు చేసుకుని, పిల్లాపాపల్ని సాకుతుంటే నాకు తినడానికి కూడైనా లేకపోయిందని ఎంతో దుఃఖించాను. మా గ్రామంలో ఒక పండితుణ్ని ఆశ్రయించి.. ‘డబ్బు సంపాదించడం ఎలా?’ అని ప్రశ్నించాను.
అందుకు ఆ పండితుడు నవ్వి.. ‘ఒరేయ్ అబ్బాయ్! డబ్బు ఉండి కూడా దానం చేయనివాణ్ని, డబ్బు లేనప్పుడు తపస్సు చేయనివాణ్ని మెడకు రాయికట్టి నీళ్లలో పారేయాలని శాస్త్రం చెబుతున్నది. ఈ వయసులో నీకు చదువురాదు. అందుచేత తపస్సు చేయి. తపస్సు వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు. నువ్వు హిమాలయాలకు పో. అక్కడ ఏ తపస్వి అయినా మంత్రం ఉపదేశిస్తే.. నీ కోరిక నెరవేరుతుంది’ అని చెప్పాడు. దాంతో నేను చాలాకష్టాలు పడి కాశీ మీదుగా హిమాలయాలకు పోయాను. గంగోత్రికి సమీపంలో చాలామంది తాపసులు కనిపించారు. వారిలో కొందరికి శుశ్రూషలు చేశాను. కానీ ఎవరికీ నాపై అనుగ్రహం కలగలేదు. ఒకపక్క వయసు మీరిపోతున్నది. ‘ఛీ! కోరుకున్న సంపదలు పొందలేని జన్మ ఎందుకు?’ అని ఆత్మహత్యకు సిద్ధపడ్డాను. ఒక ఎత్తయిన కొండనెక్కి.. ‘వచ్చే జన్మలో అయినా నన్ను భాగ్యవంతుణ్ని చేయి దేవా!’ అని ప్రార్థించుకుని కిందికి దూకబోయాను.
అప్పుడు.. ‘వద్దు వద్దు. సాహసం చేయవద్దు’ అనే మాటలు వినవచ్చాయి. ఆ దిక్కుకు వెళ్లి చూశాను. ఒక చెట్టుకింద డొంకలలో జడధారి అయిన తాపసి ఒకడు కనిపించాడు. నేను ఆయన ముందు మోకరిల్లి నా కథంతా చెప్పుకొని, రక్షించమని వేడుకున్నాను.
అందుకాయన.. ‘మూర్ఖుడా! శాశ్వతమైన మోక్షాన్ని కాదని, అస్థిరమైన సంపదల కోసం ఇంతగా చింతించడం ఎందుకు? విను.. నేను కూడా ఒకప్పుడు సంపదల కోసం ఆశపడి ఇరవైఏళ్ల పాటు గురుకుల వాసం చేశాను. ఇంద్రజాల విద్య నేర్చుకున్నాను. దేశాలన్నీ తిరిగి కోట్లకొద్దీ ధనం పోగేశాను. కానీ దానితో తృప్తి పడలేకపోయాను. ఈ అరణ్యంలో దీర్ఘతముడనే మహర్షిని ఆశ్రయించి, ఎనిమిదేళ్లు శుశ్రూష చేశాను. ఆయన ఏం కావాలో కోరుకోమనేసరికి, పరకాయ ప్రవేశవిద్య అనుగ్రహించమని వేడుకున్నాను.
ఆయన దానికి నవ్వి.. ‘మానవులు వచ్చిన స్వర్గంతో తృప్తి పొందక, రాని నరకం కోసం ఆశపడుతుంటారు. బహుశా నువ్వు ఈ విద్యవల్ల రాజభోగాలు లభిస్తాయని భావిస్తున్నట్లున్నావు. సరే నీ ఇష్టం’ అంటూనే నాకు మంత్రోపదేశం చేశాడు. నేను కొంతకాలం శ్రద్ధగా మంత్రాన్ని సాధన చేశాను. సిద్ధి పొందేలోపుగా నాలో వైరాగ్యం ఉదయించింది. దాంతో నిష్కామంగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాను. నువ్వు కూడా నాలాగే మోక్షం కోరుకో. సుఖపడతావు’ అని బోధించాడు.
నేను అప్పటికీ ఆయనకేమీ ఎదురు చెప్పకుండా కొంతకాలంపాటు ఆయనకు సేవలు చేస్తూ గడిపాను. నా భక్తికి ఆయనెంతో సంతోషించాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘స్వామీ! మీవద్దనున్న విద్యలు రెండూ నాకు ప్రసాదించండి. వాటితో నేను సంపన్నుణ్ని అవుతాను’ అని కోరాను.
దానికాయన.. ‘ఈ వయసులో కోరకూడని వాటిని కోరుకున్నావు. నేను ఉపదేశించిన వెంటనే నీకు విద్యలు పట్టుబడతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకో. నీ నోటినిండా పళ్లు ఉన్నప్పుడే ఈ విద్యలు రెండూ నీకు ఫలిస్తాయి. ఒక్క పన్ను ఊడినా ఏమాత్రం ఉపయోగించవు’ అంటూ విద్యలు బోధించాడు.
నేను ఎంతో ఆనందంగా గురువుకు మొక్కి, కాశీకి పోయాను. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయడానికి వెళుతుండగా కాలు జారిపడ్డాను. దాంతో ముందుపన్ను ఊడిపోయింది. నాకు పట్టరానంత దుఃఖం వచ్చింది. అందరూ దెబ్బ తగిలిందేమో అనుకున్నారు. కానీ, పన్ను పోయినందుకు ఏడుస్తున్నానని తెలిసి, ఎగతాళి చేశారు. పోయిన పన్నుకోసం ఏడ్చి ప్రయోజనం ఏముంది?!.
నా విద్యలు నాకెలాగూ పనికిరాకుండా పోయాయి. పెళ్లి చేసుకుని, నాకు పుట్టబోయే పిల్లలకు నా విద్యలు నేర్పాలని నిర్ణయించుకున్నాను. తగిన పిల్లకోసం వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చాను. చూడండి.. ఒక్క పన్ను ఊడిందన్న మాటే కానీ, నేనేమీ ముసలివాణ్ని కాను. అందుచేత మీ అమ్మాయి సావిత్రిని నాకిచ్చి పెళ్లి చేస్తే మీ పేరు చెప్పుకొని వంశం నిలబెట్టుకుంటాను”..
అప్పటిదాకా కామగ్రీవుడు చెప్పిన కథ విని, భట్టపాదుడు తలపంకించాడు. కొంచెంసేపు మౌనం వహించాడు. ఆ తరువాత..
“వెనకటికి ఒకావిడకు ‘నీ కూతురి కడుపున చక్రవర్తి పుడతాడు’ అని ఎవరో జోస్యం చెప్పారట. ఆ మాట చాటుగా విన్నవాడొకడు.. తాను శివుడినుంచి వరం పొందానని, తనకు పుట్టబోయే కొడుకు చక్రవర్తి అవుతాడని నమ్మబలికాడట. ముక్కూమొఖం తెలియని అతనికి.. ఆ అమాయకపు తల్లి తన కూతురినిచ్చి పెళ్లి చేసింది. ఆనక వీడు దర్జాగా ఓ కొడుకుని కని.. ‘చక్రవర్తి’ అని పేరుపెట్టాడట. అలా తన వరం సార్థకమైందని నలుగురికీ చెప్పాడట. మీరు చెప్పింది కూడా అలాగే ఉంది. ఏవేవో విద్యలు తెలుసని చెబుతున్నారు. అందులో నిజమెంతో తెలియదు. తెలిసినా మీలాంటి వృద్ధుడికి.. నా కూతురిని ఇవ్వలేను” అని తెగేసి చెప్పాడు.
కామగ్రీవుడు చేసేదేం లేక, ఆ ఊరినుంచి కదిలాడు.
పొలిమేరలకు చేరుకునేసరికి, భట్టపాదుని శిష్యులిద్దరు భద్రుడు, శరభుడు అనేవాళ్లు కామగ్రీవుణ్ని కలుసుకున్నారు. వాళ్లిద్దరూ అంతకుముందు తమ గురువుతో అతను జరిపిన సంభాషణను చాటుగా విన్నారు. అతని వద్దనున్న విద్యలను ఆశించి వచ్చారు.
“ఏమిటి అబ్బాయిలూ! మీ గురువుగారు మనసు మార్చుకున్నాడా!? నాకు పిల్లనిస్తానంటున్నాడా?!” అని ప్రశ్నించాడు.
అందుకు భద్రుడు.. “లేదు స్వామీ! మీ సంబంధం చాలా మంచిదని, మా గురువుగారికి ఎంతో చెప్పిచూశాం. కానీ ఆయన మా మాటలు వినిపించుకోలేదు. మీకెలాగైనా పెళ్లి చేసితీరాలని మాకిద్దరికీ గట్టి సంకల్పం కలిగింది. అందుకే వెంటబడి వచ్చాం. దయచేసి మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించండి. మీతో కూడా ఉండి, మీ గురించి గొప్పగా చెప్పి.. మీ పెళ్లి జరిగేలా చూస్తాం” అని చెప్పాడు.
కామగ్రీవుడు అయిష్టంగానే అంగీకరించాడు. భద్ర, శరభులిద్దరూ కామగ్రీవుని వెంట అనేక గ్రామాలు తిరిగారు. ఎక్కడ మంచి సంబంధం ఉందని తెలిసినా వెళ్లి, తమ గురువు గురించి పెళ్లివాళ్ల వద్ద గొప్పగా పొగిడి చెప్పేవాళ్లు. కామగ్రీవుని పరోక్షంలో.. ‘ఆయన ముసలివాడు. మీ పిల్లను ఇవ్వవద్దు’ అని చెప్పేవాళ్లు.
ఎంతకాలం ప్రయత్నించినా కామగ్రీవునికి ఒక్క సంబంధమూ కుదరలేదు. చివరికి అతనికి అంత్యకాలం సమీపించింది. చనిపోయేముందు శిష్యులిద్దరూ బతిమాలుకున్నారు. దాంతో వృథా పోనివ్వడం ఎందుకని.. కామగ్రీవుడు తన ఇంద్రజాల విద్యను భద్రునికి, పరకాయప్రవేశ విద్యను శరభునికి ఇచ్చి తనువు చాలించాడు.
ఆ తరువాత ఒకనాడు శరభుడు.. “మిత్రమా! నాకు మొదటినుంచీ ఇంద్రజాలం అంటే అభిమానం. కానీ, గురువుగారు ఆ విద్య నాకివ్వలేదు. మనం విద్యలు మార్చుకుందామా?” అని అడిగాడు.
అందుకు భద్రుడు.. “సరే.. ముందుగా నువ్వు నీ విద్యను నాకివ్వు. ఆ తరువాత నేనిస్తాను” అన్నాడు.
“తీరా నేనిచ్చిన తరువాత.. నువ్వు ఇవ్వకుండా పారిపోతే నా గతేం కాను”.. అనుమాన పడ్డాడు శరభుడు.
“ఎందుకొచ్చిన గోల?! గురువుగారు మనకు ఆ విద్యలే ఏరికోరి ఎందుకిచ్చారో తెలియదు. మధ్యలో మార్చుకోవడం ఎందుకు? ఇలాగే కొనసాగుదాం” అన్నాడు భద్రుడు చివరగా. కానీ, శరభుడు విడిచిపెట్టలేదు. వద్దన్న కొద్దీ వెంటబడసాగాడు.
* * *
ఒకనాడు ఇద్దరూ అడవిమార్గం వెంట వెళుతుండగా.. భద్రుడు తన ఇంద్రజాల విద్యతో ఒక పట్టణాన్ని సృష్టించాడు. విశాలమైన రాజవీధులతో, రత్నాల మేడలతో, మనోహరమైన రథాలు, అశ్వాలు, పల్లకీలతో ఆ పట్టణం అలరారుతున్నది. రాజభటులు ఉద్వేగంతో పరుగులు పెడుతున్నారు. కొందరు శరభుని వద్దకు వచ్చి.. “అయ్యా! మీకేమైనా వైద్యం తెలుసా? మా మహారాజుగారికి ప్రాణాల మీదకు వచ్చింది. రక్షించగలరా?” అని అడిగారు.
శరభుడు తనకు వైద్యం తెలుసునంటూ వారితోపాటు రాజభవనానికి వెళ్లాడు. అప్పటికే రాజు మరణించాడు. ఇదే మంచిసమయం అని భావించి, శరభుడు తన శరీరాన్ని వేరేచోట దాచిపెట్టి, ఆ రాజు శరీరంలో పరకాయ ప్రవేశ విద్యద్వారా ప్రవేశించాడు.
అతని చర్యలన్నీ రహస్యంగా గమనిస్తున్న భద్రుడు.. దాచిపెట్టిన శరభుని శరీరాన్ని తలకిందులుగా ఒక చెట్టుకు కట్టేశాడు. తన దారిన తాను పోయాడు.
ఒకరోజు గడిచింది. ఇంద్రజాలం ముగిసిపోయింది. కపటరాజు దేహం మాయమైపోయింది. శరభుడు నిలవలేక, తిరిగి తన దేహంలోకి వచ్చేశాడు. అప్పటికి తాను తలకిందులుగా వేలాడుతుండటాన్ని గమనించి..
‘అయ్యో! ఇది నిజమైన పట్టణమని నమ్మి ఎంత మోసపోయాను?! ఇక మీదట ఆ మాయలమారి భద్రుని వెంట తిరగకూడదు’ అనుకున్నాడు.
అలా వాళ్లిద్దరూ విడిపోయారు. ఆ తరువాత తన విద్యను ప్రదర్శించి, ధనం సంపాదించడం కోసం భద్రుడు రత్నాకరమనే నగరానికి వెళ్లాడు.
(వచ్చేవారం.. పరకాయ ప్రవేశం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం