ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల గ్రామం, వినోభా నవోదయ కాలనీలో గతనెల 24, 25 తేదీల్లో జరిగిన సామూహిక ఇండ్ల కూల్చివేతలు తెలంగాణ రాష్ట్ర రాజకీయ, సామాజిక ముఖచిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దశాబ్దకాలంగా పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని ‘అక్రమ ఆక్రమణ’గా పరిగణిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ఆపరేషన్, అటు పరిపాలనాపరమైన పంతాన్ని, ఇటు మానవీయ కోణంలోని వైఫల్యాలను ఏకకాలంలో బహిర్గతం చేసింది.
వెలుగుమట్ల చారిత్రక మూలాలు, చట్టపరమైన చిక్కు లు, ఆర్థిక సమీకరణలు, సామాజిక ప్రభావాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి 1950వ దశకంలోని భూదాన్ ఉద్యమాన్ని పునాదిగా తీసుకోవాలి. ఆచార్య వినోబాభావే 1951 లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పోచంపల్లిలో ప్రారంభించిన ఈ ఉద్యమం, స్వచ్ఛందంగా భూస్వాముల నుంచి భూమిని సేకరించి భూమిలేని పేదలకు పంపిణీ చేయడమే లక్ష్యంగా సాగింది. ఈ ఉద్యమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా పేదలకు వేల ఎకరాల భూమి విరాళంగా లభించింది.
వెలుగుమట్ల గ్రామంలోని సర్వే నంబర్లు 147, 148, 149లలో ఉన్న సుమారు 31 ఎకరాల 7 గుంటల భూమిని 1953లో కలవల రాజరామారావు అనే భూస్వామి భూదాన్ బోర్డుకు అప్పగించారు. భూదాన్ యజ్ఞ చట్టం ప్రకారం, ఈ భూమిని కేవలం వ్యవసాయం కోసం లేదా నిరుపేదల ఇండ్ల నిర్మాణ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఈ భూమిపై యాజమాన్య హక్కులు భూదాన్ బోర్డుకే ఉంటాయి. లబ్ధిదారులకు కేవలం వినియోగ హక్కులు మాత్రమే దక్కుతాయి. కేజీబీవీ పాఠశాలకు 5 ఎకరాలు, మాడల్ స్కూల్‌కు 5 ఎకరాలు కేటాయించారు. వినోభా నవోదయ కాలనీ ఏర్పాటు వెనుక ప్రజా సంఘాల ఉద్యమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.
నివాసితులు తమ నివాసాలను కాపాడుకోవడానికి పదేండ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. 2019, 2022 సంవత్సరాల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ఈ కాలనీలో కరెంటు, నీటి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. దీనిని బాధితులు తమ నివాసానికి ప్రభుత్వ గుర్తింపుగా భావించారు. అయితే, 2023లో హైకోర్టు ఈ భూమిపై ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి) కొనసాగించాలని, కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. కానీ, 2026 జనవరి 17న తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు అథారిటీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ ఈ ఆక్రమణలపై సుమోటోగా స్పందిస్తూ, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఫిబ్రవరి 24న భారీ కూల్చివేతలకు తెరలేచింది.
వెలుగుమట్లలో ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఈ భూమికి విపరీతమైన మార్కెట్ విలువ ఉండడమే. ఖమ్మం కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు ఈ ప్రాంతం కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నది. ఖమ్మం-కొత్తగూడెం హైవే (నాగ్‌పూర్-అమరావతి ప్రతిపాదిత హైవే) పక్కనే ఉండడంతో ఈ భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు ఎకరం రూ.10 లక్షలు కూడా లేని ప్రాంతం, ఇప్పుడు కోట్లకు చేరింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 31 ఎకరాల భూమి విలువ కనీసం రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
ఇండ్ల కూల్చివేతల నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు
‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకొస్తామని, పేదలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉన్న ఇండ్లను కూల్చివేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని ప్రకటించారు.
ఈ కూల్చివేతలను ‘అరాచక పాలన’గా అభివర్ణిస్తూ, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అదే స్థలంలో ఇండ్లు కట్టించి ఇస్తామని వాగ్దానం చేశారు. వివిధ ప్రజా సంఘాల నేతలు ఈ కూల్చివేతలను ‘అమానవీయ చర్య’గా పేర్కొంటూ తక్షణమే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూల్చివేతలను సమర్థించుకున్నారు.
హైకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని, నకిలీ పట్టాలు సృష్టించి పేదలను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు ప్రకటించారు. ప్రతిపక్షాల ఆందోళనలు, బా ధితుల నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. పాలక పెద్దలు దిగిరాక తప్పలేదు. 14 మంది తహసీల్దార్లు వెలుగుమట్ల బాధితులపై ‘సామాజిక, ఆర్థిక సర్వే’ ప్రారంభించారు. ఈ సర్వే ద్వారా నిజమైన పేదలను గుర్తించి, వారికి ఇందిరమ్మ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయ నివాస స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. కానీ ఇదం తా కూడా తమను మభ్యపెట్టేందుకు జరుగుతున్న కంటి తుడుపు చర్యగా బాధితులు చెప్తున్నారు. అదే స్థలంలో నివాసాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఎటువంటి కూల్చివేతలు చేపట్టినా బాధితులకు ముందస్తుగా సరైన పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. వెలుగుమట్ల విషయంలో ఈ నిబంధనలు ప్రభుత్వం పాటించలేదు. హడావుడిగా పడి అరాచకంగగా కూల్చివేతలకు చేపట్టింది. అభివృద్ధి, భూరక్షణ పేరుతో జరుగుతున్న పనుల వెనుక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉండటం సామాజిక న్యాయానికి విఘాతం.
-మేకల ఎల్లయ్య
99121 78129