అతి సర్వత్ర వర్జ్యయేత్! అనేమాట ఆహారానికీ వర్తిస్తుంది. కొందరు అంతా శుభ్రంగా ఉండాలని ‘క్లీన్ డైటింగ్’ ఫాలో అవుతుంటారు. అయితే, ఈ శుభ్రత మరీ ఎక్కువైవా, తప్పుగా పాటించినా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే ఆర్థోరెక్సియా.. అంటే, అతిశుభ్రమైన ఆహారం కోసం ఆరాటపడటం అని పిలుస్తున్నారు.
క్లీన్ డైట్ పేరుతో కొందరు కొన్నిరకాల పదార్థాలకే పరిమితం అవుతుంటారు. ఎంపిక చేసిన కూరగాయలు, ప్రొటీన్లు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. తినే ఆహారంలో వైవిధ్యం లేకపోతే.. పేగుల్లో వైవిధ్యమైన బ్యాక్టీరియా నశిస్తుంది. మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఫలితంగా, రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక క్లీన్ డైట్లో భాగంగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. నూనెలు, కొవ్వు పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. దీనివల్ల ఆహారంలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. ఫలితంగా.. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక పేగుల లైనింగ్ ఆరోగ్యంగా ఉండటానికి, విటమిన్లను గ్రహించడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. నూనెలు, కొవ్వు పదార్థాలు తీసుకోకుంటే పేగుల్లో మంట ఏర్పడుతుంది.
క్లీన్ డైట్ పాటిస్తూనే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 80/20 నియమం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే, 80శాతం ఆరోగ్యకరమైన ఆహారం తింటూనే, 20 శాతం ఇష్టమైన పదార్థాలను తీసుకోవాలని అంటున్నారు. దీనివల్ల పేగుల ఆరోగ్యం బాగుండటంతోపాటు జిహ్వచాపల్యం కూడా తీరుతుందని చెబుతున్నారు. ఇక పెరుగు, మజ్జిగ లాంటి సహజసిద్ధమైన ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.