నేల విడిచి సాము చేసేలా, ఊహాలోకంలో విహరింపజేసేలా దార్శనికత లేని తెలంగాణ విద్యావిధానం.. తెలంగాణ రైజింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను విద్యా కమిషన్ విస్మరించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను రెసిడెన్షియల్ మాడల్‌కు మార్చేప్రతిపాదనలు చేయలేదు. ‘కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు’ అనే విధానం ద్వారా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యాకమిషన్ సిఫారసుల వల్ల రాజకీయ జోక్యం ఉండే అవకాశం ఉన్నది.
రెండేండ్లు ప్రొబేషనరీ, ఐదేండ్లు కాంట్రాక్ట్ పద్ధతిలోనే టీచర్లను తీ సుకోవాలని విద్యా కమిషన్ చేసిన సూచన నియామక ప్రక్రియకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్నది. టీచర్‌గా కొనసాగాలంటే వారి పనితీరును మదింపు చేసి, ఐదేండ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని పేర్కొన్నది. ‘పనితీరును మెరుగుపరుచుకునేందుకు రెండేండ్ల వ్యవధి ఇవ్వాలి. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేయాలి’ అంటూ కమిషన్ సూచనలు చేసింది. ఇది పూర్తిగా లోపభూయిష్టం అవుతుంది. కొందరి సొంత ఆలోచనలు బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతున్నది.
కొత్తగా టీచర్లను మండలం యూనిట్‌గా నియమించాలని కమిషన్ సూచించింది. ‘ఇకనుంచి టీచర్ల బదిలీలు చేపట్టొద్దు. అనారోగ్య కారణాలతోనూ బదిలీలకు అవకాశం కల్పించొద్దు. కొత్తగా నియమితులైనవారు అదే గ్రామం, లేదంటే.. మండలం లోపల 15 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే పనిచేయాలి. అలా ఒప్పంద పత్రం సమర్పించాలి’ అని సూచిం చడం అసంబద్ధం. కొత్త నియామకాలు చేపట్టే సమయంలో టీచర్ల హోదాలు మార్చాలని కమిషన్ సిఫారసు చేసింది. టీచర్లు, హెచ్ఎంల ఆటోమేటిక్ ప్రమోషన్లు నిలిపివేయాలనే ఆలోచన అందులో కనిపిస్తున్నది.
‘రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. జీతభత్యాలను హేతుబద్ధీకరించాలి. ఉపాధ్యాయుల వేతనాలను తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాకమిషన్ సూచనలు చేసింది. ఈ సందేశంలోని సారం ఉపాధ్యాయుల పట్ల ద్వేషం బయటపడుతున్నది. విద్యాకమిషన్ తాజా సూచనలు వివాదాస్పదం అయ్యాయి. కమిషన్ తీరుపై టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు.
ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాకమిషన్ నివేదిక విడుదల చేయడం దార్శనికత లోపమే. నివేదికలో టీచర్లకు వేతనాలు భారీగా ఉన్నాయనే విషయం ఎక్కువ ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ ఉపాధ్యాయులకు సమాజం, మీడియా బలమైన మద్దతుగా నిలిచాయి. ‘విద్యాకమిషన్ సూచనలు అమలు చేయడానికి ఎంత బడ్జెట్ ఇస్తారు? ఎంత అవసరం అవుతుంది? అన్నిచోట్లా ‘ఆరుట్ల ఫార్ములా’ అమలు చేయగలమా? ఇప్పుడు ఉన్న విద్యాలయాలు ఏమి కావాలి? జనాభా ప్రాతిపదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడితే అందరికీ విద్య అందుబాటులోకి వస్తుందా?’ అనే వాటికి జవాబులు లేవు.
మధ్యాహ్న భోజన పథకం చార్జీలను పెంచారు. రోజుకు రూ. 21 చొప్పున ఇంటర్ విద్యార్థులకు, రూ.19 చొప్పున 9, 10వ తరగతి విద్యార్థులకు, రోజుకు రూ.11.79 చొప్పున 6- 8 తరగతులకు, రోజుకు రూ.8.69 చొప్పున 1-5వ తరగతుల విద్యార్థులకు చెల్లించాలని సూచనలు చేసినా అందుకు కావాల్సింది బడ్జెట్. సాధ్యాసాధ్యాలను కమిషన్ పట్టించుకోకుండా వితండ వాదన చేసింది. ప్రాథమిక పాఠశాల టీచర్లకు బీఎడ్, పీజీ ఉండాలనడం సరైన ప్రతిపాదన కాదు. సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్సీటీఈ ఉత్తర్వుల ప్రకారం 1-5 తరగతులకు బోధించేందుకు డీఎడ్ వారే అర్హులు. విద్యాకమిషన్ సిఫారసులలో అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయి. న్యాయపరంగానూ చిక్కులకు కారణం అవుతున్నది. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్లంలోనే బోధించాలని కోరడం మాతృభాషను మర్చిపోయేలా చేయడం అవుతుంది. విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి దృష్టిలో ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండకూడదు, ప్రభుత్వ విద్యావ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశం కనిపిస్తున్నది.
(వ్యాసకర్త: తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-తెల్కలపల్లి పెంటయ్య
96969 00969