జరిగిన కథ : మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీమజిలీ కథలు 8వ సంపుటిలోని ‘సప్తమిత్ర చరిత్ర’ ఇది. కాశీ నగరంలో ఉండే దత్తకుడు అనే బ్రాహ్మణ బాలుడు.. ఉపాధికోసం ధారానగరం వెళ్తున్నాడు. దారి మధ్యలో అనుకోకుండా ఒక యక్షదంపతులు ఏకాంతంగా ఉన్న సమయంలో చూశాడు. ఆ యక్షుడు శాపం పెట్టడంతో స్త్రీగా మారిపోతాడు.
యక్షుని శాపంతో స్త్రీగా మారిన దత్తకుడు.. చారుమతిగా రాకుమారి రుక్మిణి అంతఃపురంలో కాలక్షేపం చేయసాగాడు. రుక్మిణికి ఉపాధ్యాయునిగా ఆమె సందేహాలకు తన ప్రతిభతో సమాధానాలు చెబుతుండేవాడు. ఒకనాడు వారిద్దరి మధ్య చర్చలో ఉద్దాలక మహర్షి కుమారుడైన శ్వేతకేతువు రచించిన ధర్మశాస్త్రం ప్రస్తావనకు వచ్చింది.
“ఒకప్పుడు పరస్త్రీ గమనం నిషేధం కాదు. శ్వేతకేతువు ఈ ధర్మశాస్ర్తాన్ని వెయ్యి అధ్యాయాలతో రచించిన తరువాత మాత్రమే ఆ నిషేధం వెలుగులోకి వచ్చింది. ఆ శాస్ర్తాన్ని నూరు అధ్యాయాలుగా పాంచాలుడు తిరగ రాశాడు. ఈ పుస్తకం అదే” అన్నాడు దత్తకుడు.
“ఛీ! శాస్త్రమని పేరు పెట్టుకుని, ఇటువంటి నీతిబాహ్యమైన విషయాలు రాయడం ధర్మమా?!” అన్నది రుక్మిణి ఏవగించుకుంటూ.
“శాస్త్రం విషయంలో అంటరాని వస్తువంటూ ఏదీ లేదు. దేనినీ దాచకుండా చెప్పేదే శాస్త్రం. ఇప్పుడిందులో ప్రధానంగా చర్చించిన విషయమే తీసుకో! ఎవరైనా సరే.. పరస్త్రీ గమనం చేసేవాళ్ల లక్షణం తెలుసుకుంటే కానీ, స్వస్త్రీ రక్షణ విషయం తెలుసుకోలేరు. ఇది పురుషుడికైనా, స్త్రీకైనా వర్తిస్తుంది. ఇటువంటి శాస్ర్తాన్ని వివరించి చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిందే కదా! సరే ఇంతకూ ఈ పుస్తకం ప్రకారం.. పురుషుడు తన వయసును సమానభాగాలుగా విభజించుకుని, ధర్మార్థ కామాలను ఒకదానికొకటి బాధకాలు కాకుండా అనుభవించాలి. యవ్వనంలో కామాన్ని అనుభవించాలి. ముసలితనంలో ధర్మాన్ని గురించి తప్పక ప్రయత్నించాలి” అని ఇంకా ఏదో చెబుతున్నాడు దత్తకుడు.
“అయితే చారుమతీ! యవ్వనమందు కామమే కానీ, అర్థధర్మాలను వాంఛించకూడదా?” అడిగింది రుక్మిణి.
చారుమతి వేషంలో ఉన్న దత్తకుడు నవ్వి..
“జీవితం అస్థిరమైనది. కనుక ఎప్పుడు ఏది సిద్ధమవుతుందో దానిని తప్పకుండా సంపాదించాలి. ఒకరకంగా చెప్పాలంటే ధర్మార్థాలను సేవించడం సుఖం కోసమే. అట్టి సుఖాన్నే కొందరు కామమంటారు. అధర్మ కామం చెడ్డది. దానివల్ల రావణుడు, పాండురాజు మొదలైనవారు చెడిపోయారు. అజీర్ణం కలుగుతుందని ఆహారం అసలే మానేయకూడదు. పశువులు మేస్తాయని చేను జల్లకుండా విడిచిపెట్టేయ కూడదు. ఆ విధంగా ధర్మార్థకామాలు ఒకదానినొకటి బాధించకుండా చూసుకోవాలి. అలా చేయడమే సుఖస్వరూపమైన స్వర్గప్రాప్తికి హేతువు అవుతుంది. అయితే ఇది ధర్మమూలంగానే వస్తుందని గుర్తుంచుకోవాలి” అంటూ దత్తకుడు అనేక విషయాలు బోధిస్తున్నాడు.
ఇలా ఉండగా.. రాకుమారి అన్న అయిన చిత్రసేనుడు తరచుగా వచ్చి దత్తకుణ్ని చూసి పోతున్నాడు. చారుమతి వేషంలోని దత్తకుణ్ని మోహించి.. ఆమెను లొంగదీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ, చారుమతి ఏమాత్రం స్పందించకపోవడం వల్ల చింతాక్రాంతుడయ్యాడు.
అతని చింతను తీర్చే ఉపాయం దత్తకుడి స్నేహితుడైన గోణికాపుత్రుని రూపంలో లభించింది.
దత్తకుడు – గోణికాపుత్రుడు కూడా కాశీలో ఒక గురువు వద్దనే చదువుకున్నారు. అతను కూడా ధారానగరానికే వెళ్తున్నాడు. దారిమధ్యలో అతనికో బ్రహ్మచారి కనిపించాడు.
“అయ్యా! నాదొక పల్లెటూరు. నాపేరు గోమఠుడంటారు. బ్రాహ్మణుడిని. చదువు అబ్బలేదు. ముష్టెత్తుకుని జీవిస్తున్నాను. పెళ్లి చేసుకోవడం కోసం నాలుగు డబ్బులు కూడబెట్టుకున్నాను. మీ ఎరుకలో ఎవరైనా ఆడపిల్లలుంటే నాకు పెళ్లి జరిపించగలరా?” అని జాలిగొలిపేలా అడిగాడు.
గోణికాపుత్రుడు నవ్వేసి..
“నేనిప్పుడు ధారానగరం వెళ్తున్నాను. దారిమధ్యలో ఏదైనా సంబంధం తారసపడకపోదు. నాతో రా” అన్నాడు.
ఇద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తూ విపుల అనే పేరుగల అగ్రహారం చేరుకున్నారు. ఆ అగ్రహారంలో సోమవర్మ అనే దైవజ్ఞుడు ఉన్నాడు. అతను జాతకం చెబితే తిరుగుండదంటారు. తన శాస్త్రపాండిత్యం పేరుప్రతిష్ఠలతో పాటుగా.. సోమవర్మకు చాదస్తాన్ని కూడా తెచ్చిపెట్టింది.
సాధారణంగా జ్యోతిషుడు కొత్తవాడైతే ఏ విషయాన్నీ దాచకుండా చెబుతాడని, శాస్త్రపరిజ్ఞానం పెరిగే కొద్దీ అన్నిటికీ తొందరపడకుండా విజ్ఞత ప్రదర్శిస్తాడని చెబుతారు. కానీ, సోమవర్మ విషయంలో అది తల్లకిందులైంది. తన కూతురి జాతకంలో అతిగోప్యంగా ఉంచదగిన విషయాన్ని కూడా ఆయన బాహాటంగా చెప్పివేశాడు. అదేమిటంటే.. జాతకం ప్రకారం ఆమె జారిణి అవుతుంది. ఆ గుణం వల్ల ఆమెలోని ఇతర సుగుణాలన్నీ మరుగున పడతాయి. ఆమెవల్ల పుట్టినింటికీ, మెట్టినింటికీ కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది.
ఆయన చెప్పిన జాతక ఫలాన్ని విని..
“ఇట్లాంటి దిక్కుమాలిన విషయాలను జ్యోతిషం అనేపేరు అడ్డం పెట్టుకుని, లెక్కవేయడానికి మీకేం అధికారం ఉంది?! వేసినా బాహాటంగా ప్రచారం చేయడం నేరం కాదా?! ఇకముందు ఈ విషయం మీరు బయటపెడితే నేను మీ కళ్లముందే గొంతుకు ఉరిపోసుకుని చస్తాను” అని సోమవర్మ భార్య బెదిరించింది.
కానీ, ఆ విషయం దాచడం ఆ కుటుంబానికి సాధ్యం కాలేదు. ఎలాగో బయటికి పొక్కనే పొక్కింది. జాతక ఫలితాలు ఊరిలో అందరికీ తెలిసినందువల్ల ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు.
ఒకనాడు గోణికాపుత్రుడు – గోమఠుడు ఆ ఊరిలోకి వెళ్లారు. వాళ్ల వాలకం చూడగానే సోమవర్మ ఇంటికి సంబంధం కోసం వస్తున్నారని అనుకున్న వారెందరో ఉన్నారు.
“అయ్యో! ఆ పిల్ల జాతకం గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు” అంటూ ఏమేమిటో చెప్పసాగారు.
గోమఠుడికి ఆ మాటలేమీ తలకెక్కలేదు.
“అయ్యా! నేను పెళ్లికి మొకం వాచి ఉన్నాను. చదువు, డబ్బులేనివాడికి పిల్లనెవరు ఇస్తారు? ఆ సోమవర్మ కూతురు జారిణి అయితే కావచ్చును గాక నేను పెళ్లాడతాను” అన్నాడు గోమఠుడు.
అందుకు గోణికాపుత్రుడు..
“ఓయీ! భార్య జారిణి అయితే బంధువులు నవ్వుతారు. ఎగతాళి చేస్తారు. ఇంటి దాసి కూడా ఎకసెక్కాలాడుతుంది. తల్లిదండ్రులు కూడా అటువంటివాణ్ని నిందిస్తారు. అన్నదమ్ములు వట్టి అధముడిగా పరిగణిస్తారు. జారిణి అయిన స్త్రీ మనసిచ్చి మగనితో మాట్లాడదు. చెప్పినపని శ్రద్ధతో చేయదు. భర్త కోపగించుకుంటే దర్పం చూపి మెటికలు విరుస్తుంది. ఏ సందర్భంలో అయినా ప్రతికూలంగానే సంభాషిస్తుంది. అటువంటి భార్యతో నువ్వెలా కాపురం చేయగలవు?!” అన్నాడు.
అందుకు గోమఠుడు..
“అయ్యా! రౌతుకొద్దీ గుర్రమంటారు! మీరే ఏదైనా ఉపాయం చేసి, నన్ను రక్షించలేరా?” అని అడిగాడు.
గోణికాపుత్రుడు తేలికగా నవ్వేశాడు.
“గోమఠా! నీకొక కథ చెబుతాను. సరిగ్గా దానిలో చెప్పినట్లు నడుచుకోగలిగితే.. నువ్వు ఈ గండం గట్టెక్కగలుగుతావు” అన్నాడు.
“చెప్పండి” అంటూ గోమఠుడు చెవులు రిక్కించాడు.
గోణికాపుత్రుడు ఇలా చెప్పసాగాడు..
“పూర్వం ఒక బ్రాహ్మణునికి ఇటువంటి సమస్యే వచ్చింది. తన మేనమామ కూతురిని చిన్ననాడే పెళ్లి చేసుకున్నాడు. వయసు వస్తున్న కొద్దీ భార్యలో వస్తున్న మార్పులను గమనించి చూశాడు. తన భార్య వీధి గుమ్మంలో కూర్చుని దారిన పోయే మగవాళ్లను ఆసక్తిగా గమనించేది. ఇరుగు పొరుగుల్లో ఉండే మగవాళ్ల ముచ్చట్లను ఆరా తీసేది. యవ్వనోదయం కాబోయే సమయంలో ఇటువంటి ప్రవర్తనే మానవుణ్ని చెడుదారి పట్టిస్తుంది. శాస్త్రం నిజమయ్యేలా ఉందనిపించిన తరుణంలో.. ఆ కుర్రవాడు తన భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, ఒక నాటకం ఆడదలుచుకున్నాడు.
మేనమామతో చెప్పి.. తాము నివాసముండే నగరానికి సమీపంలోని మహారణ్య మధ్యంలో గొప్ప మేడ కట్టించాడు. అది పూర్తయిన కొంతకాలానికే అతని భార్య పుష్పవతి అయింది. వెంటనే ఆలస్యం చేయకుండా భార్యతో కలిసి ఆ మేడలో కాపురం పెట్టాడు. ఆమె కంటికి భర్త తప్ప మరో మగవాడు కనిపించే అవకాశం లేదు.
భార్యను ఇనుప పంజరంలో చిలుకను చేసినప్పటికీ ఏనాడూ ఆమెను బాధపెట్టలేదు. తనే స్నేహితుడై మెలగసాగాడు. తలంటి, జడదువ్వి, పూలు ముడిచేవాడు. రకరకాల చీరలు సొగసుగా కట్టేవాడు. తిలకం దిద్దేవాడు. అడవిలోని తన భవంతిలో అనేక సౌకర్యాలు ఉన్నందువల్ల ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా కాలం గడిపేవారు.
ఇదంతా పగటి పూట వ్యవహారం. రాత్రిపూట ఆ ఇంటిలో జరిగే వింత తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఆమె ముఖానికి మసి పూసుకుంటుంది. చింపిరి దుస్తులు కట్టుకుంటుంది. తల విరబోసుకుంటుంది. నెత్తిమీద మండుతున్న కుంపటి పెట్టుకుంటుంది. ఒక చేత బెత్తం, ఇంకో చేత వేపకొమ్మ పట్టుకుంటుంది. వికటాట్టహాసం చేస్తూ మగడు పడుకుని ఉన్న మంచం చుట్టూ మూడుసార్లు తిరుగుతుంది. ‘మూర్ఖుడా! ఇక్కడే పడివుండు. నీ పని చెబుతా!’ అంటూ లోపలికి పోతుంది.
వేడినీళ్లతో జలకమాడి.. మరో రతీదేవిలా అలంకరించుకుని తిరిగి వచ్చి భర్తను కూడుతుంది. వాళ్ల దినచర్య తొలినాటి నుంచి ఇలాగే ఉండేది.
ఇలా ఉండగా ఒకనాడు భర్త అత్యవసరంగా నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా రాత్రికల్లా ఇంటికి తిరిగి చేరుకునేవాడు. కానీ ఆరోజు మాత్రం కుదరలేదు. రాత్రికి తాను ఇంటికి రావడం లేదని, జాగ్రత్తగా ఉండమని భార్యతో చెప్పి వెళ్లాడు.
ఆనాటి సాయంత్రం సమయంలో భర్త ఇంటివద్ద లేని సమయంలో నీటికోసం చెరువుకు వెళ్లిన ఆమెకు నలుగురు బాటసారులు కనిపించారు. వారిని చూడగానే ఆమెలో కామవాంఛ రగులుకుంది. ఆ రాత్రికి తమ ఇంటిలో ఉండవచ్చునని నలుగురినీ పిలుచుకు వచ్చింది.
తేరగా ఆడదాని పొందు లభిస్తుంటే వద్దనుకునే మూర్ఖుడు ఎవడుంటాడు?! నలుగురూ ఆమె వెంట నడిచారు. ఆరాత్రికి ఆమెతో పొందుకోసం గుటకలు మింగుతూ కూర్చున్నారు. ఒకరి తరువాత ఒకరు గదిలోకి వెళ్లి.. కొద్దిసేపటికే కేకలు, పెడబొబ్బలు పెడుతూ ఆ చీకట్లోనే అడవిలోకి పారిపోయారు. కారణం మరేమీ లేదు.. రోజూ భర్తతో ప్రవర్తించినట్లే ఆమె జుట్టు విరబోసుకుని, భయం గొలిపేలా మంచం చుట్టూ ముమ్మారు తిరగడమే!
ఆమెకు ఊహ సరిగా తెలియకముందే భర్త ఏర్పరిచిన నియమం ఇది. శృంగారానికి ముందు ప్రతి స్త్రీ ఇలాగే ప్రవర్తించాలి కాబోలని ఆమె అనుకుంది. ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఆమె మనిషి కాదు, బ్రహ్మరాక్షసి కాబోలు.. తమను చంపేస్తుందేమోనని బాటసారులు భావించారు. వారిదీ తప్పులేదు.
మరునాడు ఉదయం భర్త వచ్చాడు. ఆనాటి రాత్రి భార్యను దగ్గరికి తీసుకుని ఆమె గుండెపై చెవి ఆన్చి ఏదో వింటున్నట్లు నటించసాగాడు.
‘నలుగురు వచ్చారా?! ఊ.. తరువాతేం జరిగింది. చావడిలో కూర్చోబెట్టిందా?! పిండివంటలు చేసిపెట్టిందా?! ఊ.. రాత్రికి వికార వేషం వేసుకుని రాగానే నలుగురూ పారిపోయారా?! మరి వాళ్లు తెచ్చిన వస్తువులేమయ్యాయి?! అటకమీద దాచిపెట్టిందా?!’.. అంటూ జరిగిందంతా పక్కనే ఉండి చూసినట్లు చెప్పసాగాడు. భార్య ముఖంలోకి చూస్తూ..
‘నువ్వు చేసే పని ఇదన్నమాట!’ అంటూ మోకు తీసుకుని, వీపు చిట్లేలాగా కొట్టాడు.
‘జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పకపోయినా నీ రవిక నాకు నిజం చెప్పేస్తుంది’ అని బెదిరించాడు.
భర్త లేని సమయం చూసి, గతరాత్రి తాను ధరించిన రవికను చింపేసిందామె. కానీ, రాత్రికి తిరిగి వచ్చి మళ్లీ కిందటి రాత్రిలాగానే ఆమె గుండెపై చెవి ఆన్చి..
‘అయ్యో! నేను లేనప్పుడు నిన్ను శిక్షించిందా?! దీని సంగతి చెబుతానుండు’ అంటూ మళ్లీ భార్యను చావగొట్టి వదిలిపెట్టాడు.
ఆ దెబ్బతో ఆమెకు మరీ భయం వేసింది. తన భర్తనుంచి తాను రహస్యం దాచలేనని బెంబేలెత్తిపోయింది. అది జరిగిన కొంతకాలానికే వాళ్ల కాపురం నగరానికి మారింది. ఆమెలో భర్తను మోసగించే జారిణీ లక్షణాలు పూర్తిగా నశించిపోయాయి. వాళ్లిద్దరూ చిలకాగోరింకల్లా చాలాకాలం కలిసి కాపురం చేశారు!”..
అని చెప్పాడు గోణికాపుత్రుడు.ఆ మాటలు విన్న గోమఠుడు..“అయ్యా! ఇదే నాకు తారకమంత్రం. నేను కూడా ఇలాంటి పథకమే వేసి, నా భార్యను రక్షించుకుంటాను” అన్నాడు.
“శుభం! ఇంతకూ మన ఆడవాళ్లింత అమాయకులు కనుక మన ఆటలు ఎలాగైనా సాగుతాయి” అన్నాడు గోణికాపుత్రుడు.
అటుపైన సోమవర్మ కూతురికి, గోమఠుడికి వివాహం జరిగింది. గోణికాపుత్రుడు ధారానగరం దిశగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో మగధ దేశానికి రాజధాని అయిన పాటలీపుత్రానికి చేరుకున్నాడు.
(వచ్చేవారం.. వరించి వచ్చిన వనిత)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ