చండ్రుగొండ, నవంబర్ 17 : పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇన్చార్జి) ఎస్.సరిత మంగళవారం తీర్పు వెల్లడించారు. కేసు వివరాలు.. చంద్రుగొండ మండలంలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ @ లాల్ మియా 06 ఆగస్టు 2023న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందుకున్న చంద్రుగొండ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.రవి నిందితుడిపై పలు సెక్షన్ల కిద కేసు నమోదు చేశారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారి షేక్ అబ్దుల్ రెహమాన్ విచారాణాధికారిగా వ్యవహరించారు.
దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 14 మంది సాక్షులను విచారించిన పిదప సయ్యద్ లాలూ @ లాల్ మియా పై నేరం రుజువైంది. దీంతో దోషికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కేసులో దోషికి శిక్ష పడేలా కృషి చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మి, కోర్టు నోడల్ అధికారి ఎస్ఐ డి.రాఘవయ్య, లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ ఆఫీసర్ బి.లక్ష్మణ్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.