ఓసారి కాలేజీకి నాలుగు రోజులు సెలవులు వస్తే.. ఇంటికి వెళ్లడానికి సికింద్రాబాదులో రైలెక్కాను. ఎప్పటిలాగే రంగారావు చిన్నాయన వచ్చి రైలెక్కించారు. కిటికీ సీటు దొరికింది, చేతిలో పుస్తకం ఉంది, ఇంకేం కావాలి? చదువుతూ కూర్చున్నాను. రైల్లోకి జనం ఎక్కుతూ ఉన్నారు.
ఏదో హడావుడికి ఓసారి పుస్తకం లోంచి తలెత్తి చూస్తే.. ఎదురు సీట్లోకి ఓ నడివయసు జంట వచ్చారు. ఆయన కిటికీ వైపు కూర్చుని ఆమెను ఇటు వైపు కూర్చోబెట్టాడు. ఉన్నది ఇద్దరే కానీ, బడాబడా ఓ డజను సామాన్లు ఎక్కించారు. కొన్ని తమ సీట్ల కింద, ఇంకొన్ని నేను కూర్చున్న సీటు కింద పెట్టేసారు. మూడు బ్యాగులు, నాలుగైదు పెద్ద సంచులు, నాలుగు స్టీలు క్యాన్లు.. మొత్తానికి అన్నిటినీ సర్దారు. ‘హమ్మయ్య!’ అనుకునే లోపల.. ఓ పెద్ద ప్రమాదం వచ్చిపడింది వాళ్లకి.
రైలు కదులుతుండగా ఒకాయన హడావుడిగా వచ్చి ఇంకెక్కడా సీటు లేకపోవడంతో వీళ్లు కూర్చున్న సీటుకు అటువైపు కూర్చున్నాడు. నా సీటు పక్కన అప్పటికే ఇద్దరు మగవాళ్లు కూర్చున్నారు గానీ, వాళ్లు చెరో సగం పంచుకుని ఈ లోకంతో సంబంధం లేకుండా పేపరు చదువుతున్నారు. ఇక లేటెస్టుగా వచ్చినాయన నీట్‌గా డ్రెస్ చేసుకుని ఉన్నాడు. చక్కటి క్రాఫ్‌తో అందంగా ఉన్నాడు. ముప్పైకీ, నలభైకీ మధ్య వయస్సు ఉండొచ్చు. చేతిలో ఉన్న చిన్న బ్యాగుని తీసి మీద పెట్టుకున్నాడు. కూలింగ్ గ్లాసెస్ తీసి కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నాడు. కొందరు కళ్లద్దాలు తీస్తే బాగుండరు, ముఖ్యంగా మగవాళ్లు. కానీ, ఈయన కళ్లు చాలా చురుగ్గా ఉన్నాయి. మొత్తానికి బాగున్నాడు. మెడికల్ రిప్రజెంటేటివ్ అనుకుంటా! నా అంతరాత్మ చెప్పింది.
ఇక అప్పట్నుంచీ ఎదురుగా ఉన్నాయనలో కంగారు మొదలైంది. భార్యకు ఒకటే సైగలు.. తను ఇటువైపు వస్తే.. ఆమె కిటికీ వైపు వెళుతుందని. ఆమె ఆ విషయం గమనించలేదు. ఇక ఏమీ చేయలేక నోరు తెరిచి చెప్పాడు. “నువ్వు ఇటొస్తవా! నేనటు కూసుంట” అని. “ఎందుకు లే! నీకు కిటికి అంటే ఇష్టం గద!” అని ఆవిడ అంది. అక్కడికీ ఆ మెడికలాయన తనకూ ఆమెకూ మధ్య అడ్డుగా తన బ్యాగు పెట్టాడు.
నేను పుస్తకం అడ్డుపెట్టుకుని గమనిస్తున్నాను. ఎదురాయన తన బట్టతల ఓసారి నిమురుకుని.. మెడికలాయన ఒత్తయిన జుట్టుకేసి చూసాడు. తన బొజ్జ కేసీ.. పక్కాయన టక్కు కేసీ మార్చి మార్చి చూసి, ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచాడు. తన భార్య ఆ కొత్తాయన పక్కన కూర్చోవడం ఈయనకు ఏ మాత్రం ఇష్టంలేనట్టు ఉంది. అందుకోసం కిటికీ సీటు కూడా త్యాగం చేసి మొత్తానికి ఆవిడ్ని కిటికీ పక్కన కూర్చోబెట్టాడు. ఈలోగా బ్యాగును సీటు మీదే ఉంచి.. మెడికలాయన సీట్లోంచి లేచి వెళ్లిపోయాడు. బట్టతలాయన ఓ పెద్ద నిట్టూర్పు విడిచాడు.
ఇక అప్పుడు సీటు కింద ఉన్న స్టీలు క్యాన్‌ను పెద్ద చప్పుడుతో బయటికి లాగాడు. ఆమె ఓ న్యూస్ పేపర్‌ను తీసి రెండు కాగితాలను ప్లేట్లుగా మడిచింది. క్యాన్లోంచి ఓ డజను చేగోడీలు తీసి ఆయనకు కొన్ని ఎక్కువా, తనకు కొన్ని తక్కువా ఉండేలా రెండిట్లోనూ సర్దింది. అతను నిమిషంలోనే వాటిని పరపరా తినేసి, మరికొన్ని తీసుకున్నాడు. అవీ అయ్యాక, మరో క్యాను తీశాడు. అందులో పల్లీలతో చేసిన బెల్లం లడ్డూలున్నాయి. అవీ ఓ నాలుగు అవలీలగా గుటుక్కుమనిపించాడు. ఆమె అన్నిటినీ సర్దేలోపు ఇంకో గుండ్రటి డబ్బాలోంచి తపేలాచెక్కలు తీసి ఓ రెండు తిన్నాడు. మొత్తానికి తిండి కార్యక్రమం అయ్యాక నీళ్లు తాగి.. ‘బ్రేవు’ మని త్రేన్చాడు.
పుస్తకం చదవడం అయిపోయి పక్కన పెట్టాను. ఆవిడ అప్పుడు నన్ను చూసినట్టుంది. కిందికీ మీదికీ అట్లా చూస్తూనే ఉంది. ఆమె ఎందుకు అలా చూస్తుందో నాకు అర్థం కాలేదు గానీ, చాలా ఇబ్బందిగా అనిపించింది. “ఎక్కడికి పోతున్నవు అమ్మాయీ?” అడిగింది. చెప్పాను. “ఆడ ఎవరుంటరు?” రెండో ప్రశ్న. రెండో జవాబు కూడా అయింది. “మీరెందరు?”?..
‘అదేం ప్రశ్న?’.. “అయిదుగురం! అమ్మా, నాన్న, నాయనమ్మ, అక్క, నేను. ఇంక ఎప్పటికీ ఎవరో ఒకరు చుట్టాలు ఒస్తుంటరు” చెప్పాను. “అహహ! నేను గట్ల అడుగలే! నీకు తోడబుట్టినోళ్లు ఎందరు? అక్కజెల్లెండ్లు, అన్నదమ్ములు?”.. “ఒక్కతే అక్క!” చెప్పాను.
“పెండ్లి అయిందా గామెకు?”.
‘ఎందుకు? నువ్వు చేస్తవా!’ అందామనుకుని.. చిన్నప్పట్నుంచీ నేర్చుకున్న సూక్తిముక్తావళి వల్ల.. “లేదు” అన్నాను. “ఏం జదువుతానవ్?” ఇంకో ప్రశ్న. “చందమామ పత్రిక” చెప్పాను. “అయ్యో! గట్ల గాదు. కాలేజీనా? స్కూలుకు పోతున్నవా?”.. ఈ అవమానము నేను సహింపజాలను. స్కూలా? ఊహూ! ‘కాలేజీ’ అనీ, ‘ఇంటర్’ అనీ చెప్పాను. ఆమె తిరిగి నన్ను ప్రశ్నించకముందే నేను మళ్లీ పుస్తకం పట్టుకున్నాను. కానీ, చాటుగా చూస్తూనే ఉన్నాను.
“గిట్లుండాలె” అన్నది ఆమె ఆయనతో. అప్పటికే కడుపులో పడిన వివిధ తినుబండారాల వల్ల ఆయన కొంచెం జోగుతున్నాడు. “ఎట్ల?” అన్నాడు తేరుకుని.
“గిట్లుండాలె” మళ్లీ చెప్పింది. “అవును. పల్లి లడ్డూలు మంచిగ కుదిరినయి. పాకం మంచిగ పడ్డది” అన్నాడు బొజ్జాయన ఆవలిస్తూ. “ఎహె! గా ఎదురుంగ పిల్లను జూడు. ముద్దుగున్నది. నేను చెప్పంగనే జూడకు. చూసి చూడనట్టు చూడు. మనోనికి గిట్లుండాలె. తెల్లగ, సక్కదనంగ! ఏమంటవ్?”. అతడు కూడా చూశాడు. “అవును! మంచిగున్నది” అన్నాడు.
“మనింట్ల అందరము నల్లగనేనాయే.. తుమ్మ మొద్దుల్లెక్క! నేనొక్కదాన్నే చామంచాయ! మన అరవిందుకు గీ పిల్లయితె మంచిగుంటది. ముద్దుగ తెల్లటి పిల్లలు పుడుతరు” అందామె గుసగుసగా. అయినా నా చెవులకు ఆ మాటలు వినే ఖర్మ పట్టింది. కోపం వచ్చింది గానీ, మళ్లీ సూక్తిముక్తావళి గుర్తొచ్చింది.
“గామె ఎవరో, ఏందో తెల్వదు. మనోనికి మాట్లాడుతవా? తలకాయ తిరుగుతున్నదా! ఊకో!” అన్నాడు బట్టతలాయన. ఆయన గాత్రధర్మానికి మంద్రస్వరం సరిపోదనుకుంటా.. పెద్దగానే వినపడింది.
“అడుగుత. కనుక్కుంట గద!” ఆమె భరోసా.
“మీ నాయిన పేరేందమ్మా?”. చెప్పాను.
“ఏం జేస్తడు?”.. “వ్యవసాయం”.
“యాపాటి ఉన్నది భూమి?”.. “తెల్వదు”.
“మరి మీరిద్దరే బిడ్డలు గద! ఒక్క అల్లున్ని ఇల్లింటం తెచ్చుకుంటరా? లేకపోతె ఎవల్నన్న పిల్లగాన్ని సాదుకుంటరా? ఇంక కనే కోపు (స్కోప్ అన్నమాట) ఉన్నదా?”. ఈ ప్రశ్నాపత్రం నేను ఊహించలేదు. “నాకు తెల్వదండి. మా ఇంట్ల ఎప్పుడూ మాట్లాడుకోలే!” ఎంతో ఓపిక తెచ్చుకున్నాను. నాకు అసలు కోపమే రాదనే బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలి కదా!
“మీరు ఏమిట్లు అమ్మాయి?”.. “అంటే?”.
“మీరు ఏమిటోళ్లు అని! మీ కులం ఏమిటిది?”.
డిసైడింగ్ ప్రశ్న వేసింది. ఇక లాభం లేదు. “మేం గూడ మీ కులమేనండీ! చేగోడీలు, చెక్కలు, లడ్డూలే తింటం” అని.. ఇంకా జనగాం కూడా దాటక మునుపే నా బ్యాగు పట్టుకుని.. “మా ఊరొచ్చింది” అని డోర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. వాళ్లు వరంగల్ వెళ్లేదాకా నా గురించే మాట్లాడుకుని ఉండవచ్చు అనుకుంటూ..
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి