తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రుద్రతో ‘నల్లమల చైన్సా’ అంటే ఏంటో చెప్పడం ప్రారంభించాడు సీఐ. ‘రుద్ర.. ఈ యాగంలో నేను బలివ్వాలనుకొన్న వారందరినీ ఎక్కడ బలిస్తే, దాని ఫలం దక్కుతుందో ఆయా రహస్య ప్రాంతాల్లో ఎప్పుడో బంధించా. ఒకవేళ, వాళ్ల జాడను ఎవరైనా కనుగొని, రక్షిస్తారేమోనని అత్యంత పదునైన రంపాలు, గొడ్డళ్లను తాళ్లకు కట్టి, ఓ సెక్యూరిటీ డివైజ్‌తో అనుసంధానించా. వాళ్లను విడిపించాలంటే, ఆ డివైజ్‌ను ఆన్ చేసి అందులో కనిపించే ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇవ్వాలి. అప్పుడే, ఆ బంధనాలు తెంచుకొంటాయి’ అని వికటాట్టహాసం చేశాడు.
ఇంకా శరత్ చెబుతూ ‘సమాధానం చెప్పడంలో పొరపాటు జరిగినా, డివైజ్‌ను ఆన్ చేయకుండా గడప దాటినా ‘నల్లమల చైన్సా’ యాక్టివేట్ అయ్యి బలికాబోయే వ్యక్తి ముక్కలు ముక్కలుగా మిగులుతాడు. ఇప్పుడు లత విషయంలో అదే జరిగింది’ అంటూ అసలు విషయం చెప్పాడు. ‘మరి వారందరినీ కాపాడాలంటే ఏం చేయాలి?’ అంటూ రుద్ర అడిగిన ప్రశ్నకు.. గట్టిగా నవ్విన శరత్.. ‘ఒరేయ్ పిచ్చోడా.. అది కూడా నేనే చెప్పాలా? నేనడిగే 5 ప్రశ్నలకు ఇచ్చిన టైమ్‌లో కరెక్ట్‌గా ఆన్సర్లు చెప్పు. దీంతో బలిచ్చే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో నేను చెప్తా. అక్కడికి వెళ్లి, డివైజ్‌ను ఆన్ చెయ్యి. అందులోని ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. అంతే’ అంటూ కట్లతో కుర్చీలో కూర్చొని ఉంటూనే భుజాలు ఎగురవేశాడు శరత్. దీంతో ఒళ్లు మండిన రుద్ర.. ‘అయితే, భుజాలు ఎగరేయడం ఆపేసి.. క్వశ్చన్లు అడగరా పెద్ద పిచ్చోడా’ అంటూ చురక అంటించాడు.
రుద్రను ఎలాగైనా ఓడించాలన్న కసితో ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు శరత్.. మొదటి ప్రశ్న: నా దగ్గర 8 గుడ్లు ఉన్నాయ్. అందులో రెండింటిని పగులగొట్టా.. రెండింటితో ఫ్రై చేశా.. రెండింటిని తిన్నా.. ఇప్పుడు నా దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయ్.. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..టూ’ రుద్ర ఆన్సర్ చెప్పాడు. ‘రెండో ప్రశ్న.. ఇద్దరు అమ్మాయిలు ఒకే తేదీ, ఒకే సంవత్సరం, ఒకే హాస్పిటల్, ఒకే గదిలో, ఒకే ఆవిడకు పుట్టారు. అయితే వారి వయసు సేమ్ కాదు.. ఎలా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న.. ‘ఒక గదిలో నాలుగు మూలలు ఉన్నాయ్. ప్రతీ మూలలో ఒక బంతి ఉంది. ఆ బంతి ముందు మరో మూడు బంతులు ఉన్నాయ్. ఇప్పుడు ఆ గదిలో ఉన్న మొత్తం బంతుల నుంచి ఒక బంతిని తీసివేస్తే, మిగిలే బంతులు ఎన్ని? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న.. మా మేనత్త ఈ గదిలో వాచీ మర్చిపోయింది.
అని చిన్నప్పుడు నా స్నేహితుడు నన్ను అడిగాడు. ఈ వాక్యంలో మూడు జీవులు ఉన్నాయట. అవేంటీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. ’ రుద్ర సమాధానం చెప్పాడు. చివరి ప్రశ్న. లక్ష్మీదేవి తామరలోనే ఎందుకు కూర్చుంటుంది.. లక్ష్మీదేవికి ఇరుపక్కల ఏనుగులు ఎందుకు ఉంటాయ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ.. ఫోర్..’ రుద్ర సమాధానం చెప్పాడు. తాను అడిగిన అన్ని ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పిన రుద్రతో ‘శభాష్ రుద్ర. బాగా చెప్పావ్. బంధించిన మూడో వ్యక్తిని కాపాడుకోవాలంటే ఉత్తర దిక్కు ఉన్న వాగు ఒడ్డున ఓ చిన్న గదికి వెంటనే వెళ్లు. లేకపోతే, ‘నల్లమల చైన్సా’ విజృంభిస్తుంది’ అంటూ నవ్వాడు శరత్. మూడో వ్యక్తిని ఎలాగైనా కాపాడుకోవాలని రామస్వామి, స్నేహిల్, జయ, శివుడు అండ్ టీమ్‌తో శరత్ చెప్పిన అడ్రస్‌కు పరిగెత్తాడు రుద్ర.
శరత్ చెప్పినట్లే వాగు ఒడ్డున ఓ చిన్న గది ఉంది. గది తలుపు పక్కన ఓ బాక్స్‌లో డివైజ్ ఉంది. దాన్ని యాక్టివేట్ చేశాడు రుద్ర. ఆ వెంటనే ఆ డివైజ్‌లో నుంచి ఓ వాయిస్ బయటకు వినిపించింది. ‘నమస్తే.. ఈ డివైజ్‌ను ఆన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. గదిలోని వ్యక్తిని ‘నల్లమల చైన్సా’ నరికి చంపకుండా ఉండాలంటే స్క్రీన్ మీద కనిపించే ప్రశ్నకు సమాధానాన్ని అదే స్క్రీన్‌పై టైప్ చేయండి. కరెక్ట్ సమాధానం చెప్తే, గదిలోపలి వ్యక్తితో పాటు మీరు కూడా బతికిపోతారు. లేకపోతే, గదిలోపలి వ్యక్తిని చైన్సా బలితీసుకొంటే, మిమ్మల్ని పాతాళ రక్కసి మింగేస్తుంది. నా వాయిస్ ముగియగానే ప్రశ్న కనిపిస్తుంది. ఐదు సెకండ్లలో ఆన్సర్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. ఆల్ ది బెస్ట్’ అని వాయిస్ ఓవర్ ముగిసింది.
అది విన్న రుద్రతో పాటు అందరి కింద భూకంపం వచ్చినంత పనైంది. ‘కొత్తగా ఈ పాతాళ రక్కసి ఏంటి?’ అంటూ అందరూ భయపడుతుండగానే.. డివైజ్ స్క్రీన్‌పై ప్రశ్న కనిపించింది. ‘ఉత్తరం దిక్కునున్న వాగుకు వచ్చిన మీరు ఉత్తరం వైపున తలపెట్టి పడుకొంటే ఏమౌతుంది? పెద్దలు అలా పడుకోవద్దని ఎందుకు అంటారు.. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. వన్, టూ, త్రీ, ఫోర్’ ఇంతలో రుద్ర టైప్ చేయడం పూర్తి చేశాడు. అంతే, గది తలుపు దానంతట అదే తెరుచుకొంది. టేబుల్‌కు కట్టిన ‘నల్లమల చైన్సా’ బంధనాలు తెగిపోయాయి. దీంతో వెంటనే లోపలికి వెళ్లారు రుద్ర అండ్ టీమ్. టేబుల్ మీద పడుకొని ఉన్న ఓ పాతికేండ్ల కుర్రాడిని స్పృహలోకి తీసుకొచ్చారు. అది పక్కనబెడితే, శరత్ అడిగిన ప్రశ్నలకు, డివైజ్‌లోని ప్రశ్నకు రుద్ర ఏ ఆన్సర్లు ఇచ్చాడో..కనిపెట్టారా?
సమాధానం:
మొదటి సమాధానం: 6, రెండో సమాధానం: వేర్వేరు నెలల్లో పుట్టారు, మూడో సమాధానం: 3 కాదు 4 (తీసివేస్తే అంటే తీసి మళ్లీ వేస్తే), నాలుగో సమాధానం: నత్త, ఈగ, చీమ, ఐదో సమాధానం: సరస్సులో తామర నిలకడగా ఉండదు. డబ్బుకు రూపమైన తాను కూడా నిలకడలేనిదాన్ని అని, జాగ్రత్త పడాలని లక్ష్మీదేవి చెప్పడమే దాని అర్థం. తాను ఉన్న వ్యక్తికి లోకంలో గజబలమంతటి శక్తి ఉంటుందని చెప్పడానికే లక్ష్మీదేవికి ఇరువైపులా ఏనుగులు ఉంటాయి. డివైజ్ సమాధానం: భూమి గురుత్వాకర్షణ శక్తి ఉత్తర, దక్షిణా దిశల్లో ఇమిడి ఉంటుంది. అటువైపున తలపెట్టి పడుకొంటే మెదడుపై ప్రభావం ఉండి ఆరోగ్య, మానసిక, రక్తప్రసరణ సమస్యలు వస్తాయి. అందుకే, ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకోవద్దని పెద్దలు చెప్తారు
-రాజశేఖర్ కడవేర్గు