డివైజ్ అడిగిన ప్రశ్నకు ఇన్స్పెక్టర్ రుద్ర కరెక్ట్‌గా సమాధానం చెప్పాడు. దాంతో, గదిలో సీఐ శరత్ బంధించిన పాతికేండ్ల కుర్రాడిని రక్షించారు రుద్ర అండ్ టీమ్. కానీ, అతను అప్పటికీ స్పృహలోకి రాలేదు. దాంతో, శరత్‌ను బంధించిన డెన్లోకి ఆ యువకుడిని తీసుకెళ్తారు రుద్ర టీమ్. డివైజ్ హెచ్చరించిన ‘పాతాళ రక్కసి’ కథ ఏంటని శరత్‌ను అడిగారు. దీంతో ఒక నవ్వు నవ్విన శరత్.. వారితో ఇలా అన్నాడు.
‘ఒరేయ్ రుద్ర. నువ్వు, నీ తొట్టి గ్యాంగ్‌కు ప్రాణాల మీద చాలా తీపి ఉందిరోయ్. లేకపోతే, ఏందిరా..? ఏది కొత్తగా, భయంగా కనిపించినా.. వినిపించినా.. పొలోమంటూ మందకు మంద ఎగేసుకొని నా దగ్గరకు వస్తారు. అదేంటీ? ఇదేంటీ? అంటూ విసిగిస్తారు. ఇప్పుడు మీకు పాతాళ రక్కసి గురించి తెలియాలి అంతేగా. అదేం లేదు. డివైజ్ అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతే, బంధించిన వ్యక్తిని చైన్సా నరికేస్తుంది’ అంటూ శరత్ మరేదో చెప్పబోతుండగా.. ‘అది మాకు తెలుసురా వెర్రి వెధవా.. ముందు పాతాళ రక్కసి సంగతేంటో చెప్పురా సన్నాసి’ అంటూ మండిపడ్డాడు స్నేహిల్. దీంతో కండ్లతోనే ఉరిమిన శరత్.. ‘ఒరేయ్.. హాఫ్ బ్రెయిన్‌గా. నువ్వు మధ్యలోకి రాకు. ఒక్క పజిల్‌ను కూడా సాల్వ్ చేయలేని నువ్వు నాతో మాట్లాడుతున్నావా.. మొత్తం పూర్తిగా చెప్పేదాకా ఆగలేవా బ్రెయిన్లెస్ ఫెలో?? ’ అంటూ శరత్ ఇంకా ఏదో అంటుండగా.. ‘ఇక చాలు.
ఇప్పటికే ఎక్కువ చేశావ్.. ముందు పాతాళ రక్కసి గురించి చెప్పు’ అంటూ శరత్‌పై విరుచుకుపడ్డ రుద్ర.. కాస్త ఉండమంటూ స్నేహిల్‌కు సైగ చేశాడు. శరత్ మళ్లీ ప్రారంభించాడు. ‘డివైజ్‌లో ఆన్సర్‌ను తప్పుగా చెప్తే, బంధించిన వ్యక్తి చనిపోతాడు. అలాగే, ఆ డివైజ్ దగ్గర నిలబడ్డ ప్రాంతం మొత్తం భూమిలోకి కూరుకుపోతుంది. 50 మీటర్ల లోతుగా ఉన్న ఓ బావి మీద ఆ డివైజ్‌ను సెట్ చేశా. పాతాళ రక్కసి మర్మం అదే’ అంటూ గట్టిగా నవ్వాడు శరత్. ‘ఈ తెలివేదో నేరస్తులను పట్టుకోవడంలో చూపిస్తే, దేశానికైనా ఉపయోగం ఉండేది’ అంటూనసిగాడు స్నేహిల్.
‘రుద్ర.. నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి స్పృహలోకి రావాలంటే, నేను చెప్పిన మందును కరెక్ట్ డోస్‌తో ఇవ్వాలి. లేకుంటే అతన్ని స్పృహలోకి తేవడం ఎవరి తరం కాదు’ అంటూ అసలు విషయం చెప్పాడు శరత్. దీంతో ఆ మందు ఏంటని అడిగాడు రుద్ర. ‘అబ్బా.. అంత ఈజీగా చెప్తానా? నేను అడిగే ఐదు ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పు. అప్పుడు చెప్తా’ అంటూ మెలిక పెట్టాడు శరత్. అప్పటికే ఆ యువకుడు స్పృహ కోల్పోయి చాలా సమయం అవుతుండటం, ఆలస్యమైతే అతని ప్రాణానికి ప్రమాదం అని జయ చెప్పడంతో కంగారుపడుతూ ‘సరే’ అన్నాడు రుద్ర. పజిల్ ప్రారంభించాడు శరత్.
మొదటి ప్రశ్న: శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్..టూ’ రుద్ర ఆన్సర్ చెప్పాడు. ‘రెండో ప్రశ్న.. ఆలిని పోగొట్టుకొన్నది ఒకరు.. వెతకడానికి వెళ్లింది ఇంకొకరు.. ఆ వెతకడానికి వెళ్లిన వ్యక్తి మాతృమూర్తి పెనిమిటి లేకుంటే మనం బతుకలేం? ఈ ప్రశ్నలోని ముగ్గురెవరు?? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. మూడో ప్రశ్న.. BUS ఫుల్‌ఫామ్ ఏంటీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ రుద్ర సమాధానం చెప్పాడు. నాలుగో ప్రశ్న.. CAR ఫుల్‌ఫామ్ ఏంటీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. ’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘చివరి ప్రశ్న.
ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్తేనే.. నేను మెడిసిన్ చెప్తా. అప్పుడు ఆ యువకుడు బతుకుతాడు. లేకపోతే, మీ ముందే చనిపోతాడు’ అన్నాడు శరత్. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్నేహిల్.. ‘ముందు మా రుద్రను ప్రశ్న అడగరా దగుల్బాజీ’ అంటూ అంతెత్తున లేచాడు. ‘ఒరేయ్.. ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడి అన్నట్టు.. నేనేదో రుద్రగాడితో గేమ్ ఆడుతుంటే.. కమెడియన్లా నీ ఎంట్రీ ఏంట్రా? సరే.. అంత ముచ్చటగా ఉందా? అయితే, ఈ ఐదో ప్రశ్న నీకే.. ‘ఏదో డిటెక్టివ్ ఏజెంట్లలాగా మీరు పట్టుకొచ్చారుగా.. ఈ స్పహలేని యువకుడు. వీడి పేరేంటీ? నేను ఇస్తున్న క్లూ.. ఇంతకు ముందు నేను అడిగిన నాలుగు ప్రశ్నల్లో రెండు ప్రశ్నలను కలిపితే, ఇతని పేరు వస్తుంది.
ఒరేయ్ స్నేహిల్.. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..’ అంటూ శరత్ కౌంట్ చేయడం ప్రారంభించాడు. సమయం కావొస్తుండటం, ఏం చెప్పాలో తెలియకపోవడంతో కంగారు పడుతూ రుద్ర దగ్గరకు వచ్చాడు స్నేహిల్. దీంతో కలుగజేసుకొన్న రుద్ర.. ‘శరత్.. పజిల్ గేమ్ నీకూ నాకూ మధ్య. ప్రశ్న అడగాల్సింది నన్ను. ఆన్సర్ చెయ్యాల్సింది నేను’ అంటూ ఇంకేదో చెప్పబోతున్నాడు రుద్ర. దీంతో మధ్యలో కలుగజేసుకొన్న శరత్.. ‘కదా.. మరి, నీ కజిన్ స్నేహిల్ను నోర్ముయ్యమని చెప్పు’ అంటూ మండిపడ్డ శరత్.. ‘రుద్ర.. ఐదో ప్రశ్నకు ఆన్సర్ చెప్పు.. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.. వన్.. టూ.. త్రీ..ఫోర్.. ఫైవ్’ అనేలోపే రుద్ర సమాధానం చెప్పాడు. ‘వహ్వా! కరెక్ట్ ఆన్సర్ చెప్పావు రుద్ర. యెస్ అతని పేరు అదే’ అన్నాడు శరత్. ఇంతకీ, రుద్ర చెప్పిన ఐదు సమాధానాలను మీరు కనిపెట్టారా?
…? రాజశేఖర్ కడవేర్గు