Children Stories | ఒక రాజ్యంల ఓ గరీబు అయ్యగారు ఉంటుండె. ఆయినెకు పొట్టకు బట్టకు ఎల్లుడే.. గగనమైతుండె. తిన్న రోజులకంటె ఉపాసమున్న రోజులే ఎక్వ. అండ్లకు ఆయినె పెండ్లాం.. “పెయ్యిమీద ఈసమెత్తు బంగారమన్న లేదు!” అంట దినాం పోరు వెడ్తుండె. పాపం ఈనె బాగ సదువుకోలె. ఏం జెయ్యలేక దొరికింది దిని, దొరకన్నాడు ఉపాసముంటుండె. రాజు తానికివోయి ఏమైన జేశి సంబావన వట్కరమ్మని పెండ్లాం రుసురుస వెడుతుండె. పెండ్లాం లొల్లి వడలేక పండితుని లెక్క ఏషంగట్టి, శాలువా గీలువా ఏసుకోని, శేతుల పంచాంగం, తాటాకుల వయ్యి వట్టుకుని ఎట్లయితె గట్లయితదని ఒకపారి రాజు తానికి వోయిండు. ఈనె వోయెటాలకు రాజు ఆయినెకున్న గుర్రాలసాలల ఉన్నడు.
ఒక్కొక్క గుర్రాన్ని జూసుకుంట.. నిమురుకుంట.. మాట్లాడుకుంట ఉన్నడు. మన అయ్యగారు ఆడికొయ్యెటాలకు రాజు ఒక తెల్లగుర్రం తాన నిలవడి.. “ఎట్లున్నవ్.. సెబాస్” అంట ఎన్నుమీద గొట్టుకుంట నిమురుతాండు. అంతట్లకే అయ్యగారు.. “రాజా..! ఈ గుర్రం ఉత్తుత్త గుర్రం గాదు. ఎన్కటి జన్మంల పెద్ద పండితుడు. గీత గోవిందం అంత అత్తది. ఇప్పుడు గూడ సదువుద్ది” అంట అన్నడు. ఈ మాటలు ఇనంగనే రాజు పరేషానైండు. “గట్లనా!? మా గుర్రం గురించి ఇంకేమన్న ఇచ్చంత్రాలు ఉన్నయా?” అంట అర్సుకోవట్టిండు. అయ్యగారుకు అదే సాలని.. “ఓ! ఎందుకు లెవ్వు.. ఈడ గడ్డి, గుడాలు వెట్టుట్ల ఇదన్ని మర్శిపేయింది. నెయ్యి.. బెల్లం.. పాన్కం.. పండ్లుగిండ్లు వెట్టి సూడుండ్లి! నాలుగైదు నెల్లల్ల గీతగోవిందం అంత అప్పజెప్పుతది” అన్నడు. దానికి రాజు.. “అయ్యగారూ! గట్లయితే గుర్రాన్ని నువ్వే నీ ఇంటికి తోల్కవో. పాలు, బెల్లం, పండ్లు పైసలు వంపిత్త. అయిదు నెల్లల్ల గీత గోవిందం సదివిపియ్యి. మా సుట్టాలందరికి ఈ ఇచ్చంత్రం సూయిత్త” అన్నడు.
అయ్యగారుకు పాలు, నెయ్యి, బెల్లం, బంగారం.. ఇట్ల మాలెస్క సంబావనిచ్చిండు. గుర్రం కోసం అయ్యగారు అడిగిందియ్యిమని దివానంల జెప్పిండు. ఆ దినంకెల్లి అయ్యగారు మూడుపూటల పుష్టిగ తింటాండు, పంటాండు. ఆడింది ఆట.. పాడింది పాటలెక్క ఇద్దరాలు మొగలు ఉన్నరు. గుర్రానికింత సాలీసాలని గడ్డి ఏత్తాండ్లు. ఏడు దినాలకే గుర్రం సగం ఈడ్సుక వేయింది. కడుపు నిండ తింటున్నా.. అయ్యగారమ్మకు లోపల్లోపల బుగులు బుగులుగున్నది. ‘రాజు అచ్చి గుర్రాన్ని జూత్తె ఎట్ల!? అయిదు నెల్లయినంక గుర్రం గీతగోవిందం ఎట్ల సదువుద్ది?’ అని బయం బట్టుకుంది. ఈ మాటే అయ్యగార్నడిగితె.. నవ్వి ఊకుంటుండె. ఎట్లయితె గట్లయితదని ఆమె గూడ అనుకుంది. నెలకోసారి రాజుతానికి వోయి.. ‘గుర్రం వొకటో అజ్జాయం నేర్సుకుంది.. రెండోది అయిపేయింది.. మూడోది రేపయితది’.. అనుకుంట రాజుతాన మత్తుగ పైసలు వట్టియ్యవట్టిండు అయ్యగారు. ఉండవట్టలేక పెండ్లాం అడిగింది, “ఏం జేత్తవు ఆకరుకు!?” అంట. అంతట్లకె గుర్రం తిండిలేక సచ్చిపేయింది. పెండ్లాన్ని దోల్కోని రాజుతానికి వోయిండు. ఏడ్సుకుంట.. “రాజా! గుర్రం రాత్రి గూశింది. అయిదునెల్లు తండ్లాడి గీత గోవిందం నాలుగు అజ్జాయాలు నేర్పిన. ఇప్పుడు సచ్చిపాయె. నా పాండిత్యం ఎట్ల రూబిడి జెయ్యాలె!? మీతాన సంబావన ఎట్ల దీసుకోవాలె” అంట దొంగ ఏడ్పులు ఏడ్వవట్టిండు. రాజుకు ఈని ఇకమతులన్ని ఎరుకైనా.. అందరి ముంగల ఇజ్జతు వోతదని.. అయ్యగారుకు సంబావనిచ్చి పంపిండు.
… పత్తిపాక మోహన్
Children Stories | ఏం జరిగినా అంతా మంచికే అనుకుంటే ఎంత లాభమో చెప్పే కథ ఇదీ!
Children Stroies | తెనాలి రామలింగడి దగ్గరే డబ్బులు కొట్టేయాలని జూసి బొక్కబోర్లవడ్డ దొంగోడు
Children Stories | ఆపతికి.. సంపతికి పదిమంది ఉండాలె అనేందుకు ఈ కథే ఉదాహరణ
Children Stories | ఇకమతుల నక్క భూదేవి దగ్గరే అప్పు తీసుకొని.. కన్ను పోగొట్టుకుంది