Children Stories | ఒక ఊళ్లె ఇద్దరు ముసలమ్మలు ఉండేటోళ్లు. ఆళ్ల ఇండ్లు గూడ పక్కపక్కన్నే ఉంటుండె. అండ్ల పెద్దామెది దానగుణం, దయగల్ల పానం. ఉన్నకాడికి అందరికి సాయం జేత్తుండె. ఇగ రెండో ఆమె బాగ కువారమున్న మనిషి. ఎదురుంగోల్లు ఎవ్వలు తెల్లగున్న ఓర్వక పోతుండె. ఎట్లనో ఇద్దరికీ బువ్వకైతె తిప్పలు లేకుండ ఎల్లుబాటు అయితుండె. ఒకపారి కాలం కలిసి రాలె. తిండి గింజలకు శాన తిప్పలయ్యింది. ఈ ఇద్దరికి శెరో మేకపిల్ల ఉండె. ఈల్లకే లేకపాయె! ఇంగ వాటికేం బెడుతరు? మేకపిల్ల గోస జూసిన పెద్ద ముసలమ్మ.. అడివికి వోయి దాని బతుకు అది బతుకుతదని అనుకుని, దాన్ని ఇంట్లకెల్లి ఎల్లగొట్టింది.
అవ్వను ఇడ్శిపెట్ట బుద్ధిగాకున్నా.. మేకపిల్ల ఏడ్సుకుంట అడివిలకు వోయింది. అవ్వను యాజ్జేసుకుంట ‘మే! మే!’ అనుకుంట ఒర్రింది. అది ‘మే! మే!’ అని ఒర్రినకొద్దీ.. పెద్ద ముసలమ్మ ఇంట్ల బంగారం, వజ్రాలు, ముత్యాలు రాలవట్టినయి. ఆమె మస్తు ఖుషీ అయ్యింది. ఎన్ని ముత్యాలు, వజ్రాలు అచ్చినయో కొలుసుకద్దమని తవ్వ కోసం చిన్న ముసలమ్మ కాడికి వోయింది. ‘తిండి గింజలన్ని అయిపాయె. మరి గీమె ఏం కొలుసుకుందమని తవ్వ అడుగుతంది? గదేందో తెల్సుకోవాలె!’ అనుకొని, తవ్వ అడుక్కు శింతపండు అంటివెట్టి ఇచ్చింది చిన్న ముసలమ్మ.. ఎంతైన ఇకమతులది గదా!
పెద్ద ముసలమ్మ ముత్యాలు, వజ్రాలు అన్ని కొలుసుకున్నది. అయితే తవ్వ అడుక్కు ఒక ముత్యం అంటుకొని ఉండె.. దాన్ని పెద్ద ముసలవ్వ సూడలే. అట్లనే వాపస్ ఇచ్చింది. అడుక్కు అంటుకున్న ముత్యాన్ని సూడంగనే.. చిన్న ముసలమ్మ ఆగమగమైంది. అట్లిట్ల బుదురకిచ్చి ఇకమతితోని మేక ఏడ్సుడు గురించి కూనం దీసింది. అన్ని సంగతులు అర్సుకొని చిన్న ముసలమ్మ ఆమె మేక ఏడ్వకున్నా.. ఇయ్యరమయ్యర జోపి, వయ్యరవయ్యర ఏడ్శెతట్టు జేశి అడివికి తోలింది. ఈ మేక వొయ్యి ‘మే! మే!’ అని ఒర్రంగనే.. బంగారం, ముత్యాలు, పగుడాలు రాలుతయని నోరు దెర్సుకొని సూడవట్టింది చిన్న ముసలమ్మ. కని.. మీదికెల్లి అన్ని మేక గొతికెలు రాలి వడ్డయి. ఇల్లంత కంపుకంపు అయ్యింది. ముసలమ్మ నెత్తి నోరు గొట్టుకుంది.
… పత్తిపాక మోహన్
Children Stories | మొగడు కోప్పడితే పెండ్లం వండిన బువ్వ కూర.. బియ్యం, వంకాయలుగా అయిపోయినయ్
Children Stories | కొత్తగా దొంగతనానికి వెళ్లి పంచె పోగొట్టుకున్న డేడ్ దిమాక్ దొంగోడు
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు