అమీన్పూర్ మారుతి హిల్స్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో 40 ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడి లైన్మెన్కు ఒక్కో ఫ్లాట్ యజమాని రూ.వెయ్యి చొప్పున ప్రతి నెలా ఇస్తూ కావలసినంత నీటిని సరఫరా చేయించుకుంటున్నారు. కొండాపూర్‌లోని అన్ని కాలనీల్లో సంబంధిత లైన్మెన్లకు ఒక్కో ఇంటి యజమాని రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా ఇస్తూ నీటిని అందినకాడికి తాగేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రాబోయే రెండు నెలల తర్వాత నగరంలో నీటి కటకట ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జలమండలి అధికారులు తాగునీటి వృథాను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. నీటి వృథాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. జలమండలి పైపు లైన్‌కు అక్రమంగా మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కానీ ఇంటి దొంగలే నీటికి ఇష్టానుసారం అమ్ముకుంటూ అక్రమార్జనకు పాల్పడుతుంటే పట్టించుకోవడం లేదు. నీటి సరఫరాలో అక్రమాలు చేస్తున్నా మొద్దు నిద్రలో ఉంటున్నారు. ముఖ్యంగా నగర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను నిర్వర్తించే లైన్మెన్లు నీటి దందాకు తెరలేపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా రేటు కట్టి.. వసూళ్లకు పాల్పడుతున్నారు.
– సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): లైన్మెన్లు కాలనీలు, అపార్ట్మెంట్ల నివాసితుల దగ్గర వేలాది రూపాయలు తీసుకుంటూ గంటల కొద్దీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఇంటి పరిమాణం, అపార్ట్మెంట్లలో ఉన్న ప్లాట్లను బట్టి ఒక కనెక్షన్‌కు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఆయా నివాసితులకు నీటిని అదనంగా సరఫరా చేసినందుకు నెలవారీగా వసూలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా సబంధిత డివిజన్లలో మేనేజర్లకు తెలిసే జరుగుతున్నదనే చర్చ జరుగుతున్నది. ఎక్కువ మొత్తంలో వసూలయ్యే ప్రాంతాల్లో మేనేజర్లకు వాటా వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి దందాను అడ్డుకోకుంటే డిసెంబర్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.
అమీన్పూర్ మారుతి హిల్స్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో 40 ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడి లైన్మెన్కు ఒక్కో ఫ్లాట్ యజమాని రూ.వెయ్యి చొప్పున ప్రతి నెలా ఇస్తూ కావలసినంత నీటిని సరఫరా చేయించుకుంటున్నారు. కొండాపూర్ పరిసరాల్లోని అన్ని కాలనీల్లో సంబంధిత లైన్మెన్లకు ఒక్కో ఇంటి యజమాని రూ.వెయ్యి నుంచి రూ.5 వేల దాకా ఇస్తూ నీటిని అందినకాడికి తాగేస్తున్నారు. హైటెక్ సిటీలోని కమర్షియల్ భవనాలకు ఇష్టారీతిన జలమండలి నీళ్లు సరఫరా అవుతున్నాయి.
ఇలా నగరంలోని మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, హైటెక్ సిటీ, కూకట్పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, అమీన్పూర్, గోపన్‌పల్లి, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నది. ఇక్కడి లైన్మెన్లు అపార్ట్మెంట్లు, హైరైజ్డ్ భవనాలు, ప్రైవేట్ హాస్టళ్లు, కమర్షియల్ భవనాలు, హౌసింగ్ సొసైటీల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. భవనం స్థాయిని బట్టి నీటిని గంటలకొద్దీ సరఫరా చేస్తూ దండుకుంటున్నారు. జలమండలి సిబ్బంది ధన దాహానికి కమర్షియల్ ప్రాంతాలను ఆనుకుని ఉన్న బస్తీలు, కాలనీల ప్రజలకు తాగునీరందక ఇబ్బందులు పడుతున్నారు. బస్తీలు, పేద మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీల్లో మాత్రం లోప్రెషర్, అతితక్కువ సమయం సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని వాళ్లు డబ్బులు ఇచ్చుకోలేరు కాబట్టి వాళ్లకు 10 నిమిషాలకు మించి సరఫరా చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ధనవంతులు, నీటి సమస్య ఉన్నా ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసుకునే సామర్థ్యం ఉన్నవాళ్లకు మాత్రం గంటల తరబడి సరఫరా చేస్తున్నారు.