Children Stories | ఒక ఊర్లె ఒక గొర్లు కాసెటాయినె ఉంటుండె. ఆయినెకు అస్సలు శెవులు ఇనవడయి. జరంత పెద్ద ఆసామి, మాలెస్క జీవాలున్నయి. మేతకు రోజూ అడివిలకు తోల్కపోయి వత్తుండె. రోజటి తీర్గనే అడివిలకు వోంగనే.. ఏదో జరూరు పని యాదికచ్చింది. జీవాలన్నిట్ని తోల్కపోవుడు ఎందుకని అటీటు సూత్తాంటె.. ఒకాయినె శింతశెట్టు మీన శిగురు దెంపుతాండు. ఈనెకు గూడ శెవుడె. ఆయినెను జూడంగనె పానం లేశచ్చింది. “ఓ అన్న! జరంత సేపు గీ జీవాలను సూడు. ఊళ్లెకు వోయత్త! నీ కట్టముంచుకోను. అచ్చినంక నా కుంటి గొర్రెనిత్త” అంట జెప్పిండు. కిందికెల్లి ఆయినేదో పాటవాడుతుండు అనుకొని శింత మీదున్నోడు.. ‘ఆ.. ఆ..’ అంట తల్కాయ ఊపిండు. మనోడు జెల్ది ఊళ్లెకు వోయి పనిజేసుకొని ఎగిర్తంగనే అచ్చిండు. అచ్చి సూడంగనె.. శింత మీద ఉన్నోడు ఆన్నే ఉన్నడు. ఈనె లెక్కవెట్టుకొని సూత్తె జీవాలన్ని బరాబరున్నయి.
అంతట్లకె శెట్టుమీద ఉన్నాయినె కిందికి రాంగనె.. మస్తు ఖుషీగ కుంటిగొర్రెను తీస్కపోయి శేతుల వెట్టి, శణార్తులు జెప్పిండు గొర్లు కాసెటాయినె. ఆయినెకు గూడ ఇనవడదాయె! “నీ యవ్వ.. నేను శెట్టు మీదనే ఉన్న. నీ గొర్రె కాలు నేనెందుకు ఇరగ్గొట్టిన?” అనుకుంట గొర్రెను ఆనికే ఇచ్చి రుసురుస ఉరికిండు. “తొండి వెట్టకు! నీకు నేను కుంటి గొర్రెనే ఇత్తాన్న. మంచిది నేనెందుకిత్త?”.. అంట ఆడు ఎన్క ఉరికిండు. ఇద్దరి కిస్స మాపటిదాక నడుత్తనే ఉంది. ఆఖరికి యాష్టకచ్చి.. “నీకు గొర్రె లేదు.. బర్రె లేదు. ఎవలకు జెప్పుకొంటవో చెప్పుకో పో!’’ అనుకుంట జీవాలను మలుపుకొని ఇంటికి వోయిండు గొర్ల ఆసామి.
ఇంటికి పోయినా.. ఆయినె పానమంత ఎట్లనో గావట్టింది. ‘గొర్రెనిత్తా అని ఇయ్యకపోతి! మంచిది గాదు’ అని, ఊరి పెద్ద కాడికోయి అయిన ముచ్చటంత జెప్పిండు. ఎట్లనన్న ఆయినెను లెంకులాడి కుంటిగొర్రెను అప్పజెప్పుమని బతిమ్లాడిండు. అంతట్లకే శింతాకు దెంపినాయినె, “శింతాకు.. శింతాకు” అని అమ్ముకుంట ఆల్ల గల్లిలకే అచ్చిండు. ఇద్దరు ఒకల్లనొకల్లు సూసుకున్నరు. ఎంటనే కుంటిగొర్రెను దీస్కపోయి మన ఆసామి మల్ల ఆయినె శేతుల వెట్టిండు. మల్ల ఇదేం తల్కాయనొప్పని ఇయ్యర మయ్యర వొర్రుకుంట లొల్లివెట్టి గాయిగాయి జేశిండు శింతాకు అమ్మెటాయినె. అయినా మన ఆసామి మాత్రం ససేమిరా అంట.. గొర్రెపిల్లను వాపసు తీసుకోలె. ఊరిపెద్ద గూడ.. “నువ్వు దీని కాలిరగొట్టలే! నీకిది ఇనాం” అంట శింత శిగురాయినెకు మస్తు జెప్పిండు. అయినా ఆయిన తాను వట్టుకున్న కుందేలుకు మూడుకాల్లన్నట్టే ఉన్నడు.
ఇట్ల ఈల్లు ఇనేటట్టు లేరనుకున్నడో ఏమో.. కుంటిగొర్రెను వట్టుకొని ఒకటే లంకె వెట్టిండు శిగురు అమ్మెటాయినె. ఏం జేత్తడో సూద్దామని ఆడున్నోల్లందరూ ఆయినెనుకనే ఉరికిండ్రు. ఆయినె ఉరికి.. ఉరికి.. గొర్రె నిచ్చిన ఆసామి దొడ్లకు వోయి, కుంటిగొర్రెను మందల కలిపి ఎన్కకు సూడకుంట లంకె వెట్టిండు. మన ఆసామికి ఏమర్థంగాక పరేషానయ్యిండు. ఇద్దరి శెవుటి ముచ్చట తెలిశిన ఊరోళ్లు కడుపుబ్బ నవ్విండ్లు.
… పత్తిపాక మోహన్
Children stories | ఇకమతులోడి దగ్గర పైసలు కొట్టేయబోయి ఈపు సాపు చేసుకున్న దొంగోడు
Children stories | వంకాయ కూర వండమని మొగడు చెబితే ఈ పెండ్లం చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
చంపి తిందామని వచ్చిన తోడేలును భలే బురిడీ కుట్టించిన కుందేలు