children stories ( andare stories ) | సీలంక బుడ్డర్ఖాన్ అండరె గురించి మీకు ఎర్కనే గదా! మన తెన్నాల్రామలింగం లెక్కనే మస్తు ఇకమతులోడు. కైతుకాలోడు. ఆడేది జేసినా గమ్మతి.. గమ్మతే! ఒకపారి లంక రాజుకు కొబ్బరి శెట్లు లంకంత పెంచిపియ్యాల్నని మతిల వడ్డది. అనుకున్నదనుకున్నట్టే కొలువులున్న అందరిని విలిశి ముచ్చట జెప్పిండు. రాజు తల్సుకుంటె కాదనేదెవ్వలు? అందరు అవునన్నరు. మంత్రిని విలిశి తొల్త కొలువులున్న అందరికి.. మనిషికి ఐదెకురాల భూమి, కొబ్బరి మొల్కలు, మొల్కకో ఎండి రూపాయి ఇయ్యిమని హుకుం జేశిండు.
శెట్ల ముచ్చట, మంచి శెడ్డలు సూడనీకి ఒక మంత్రిని వెట్టిండు. ఆయినె పని అందరు వెంచుతున్న కొబ్బరి శెట్లు సూడాలె.. రాజుకు మతలబు జెప్పాలె. మన అండరె రాజు కాడ బుడ్డర్ఖాన్ గదా.. ఈనికి గూడా ఐదెకురాల భూమి, కొబ్బరి మొల్కలు, ఐదునూర్లు అచ్చినయి. రాజిచ్చిన మొల్కలు అనామతుకు పాతిండు. రాజిచ్చిన పైసలతోని పెండ్లాం పిల్లల్ని తోల్కోని యాత్రలకు వోయిండు.
శెట్ల మంత్రి రోజోతాన తిరుక్కుంట ఉన్నడు. పైల పైల అండరె తోటకాడికి రాంగనే.. ఆ దినాన్నే పాతిండు కదా! మంచిగ నిగనిగ కనిపిచ్చినయి. అదే ముచ్చట వయ్యిల రాసుకున్నడు. అట్ల రోజొకల్ల జాగల శెట్లను సూశి అత్తండు. అందరి శెట్లు రోజురోజుకు నిగనిగలాడవట్టినయి. పెరుగ వట్టినయి. ఆయినె అట్ల తిరుక్కుంట.. తిరుక్కుంట మల్ల అండరె తోట వంతుకు అచ్చెటాల్లకు ముప్పై దినాలయ్యింది. యాత్రలకు వోయిన అండరె గూడ అప్పుడే అచ్చిండు. పొయ్యి సూశెటాల్లకు ఆడ శెట్లు లెవ్వు.. గిట్లు లెవ్వు! శెట్ల మంత్రి అచ్చే రోజు.. తెల్లారేనని అండరెకు తెలుసు. ఎంటనే పక్కూర్లకెల్లి కొబ్బరి మొల్కలు తెచ్చి, ఎప్పటోలనే వాతిండు. శెట్ల మంత్రి అచ్చి సూశెవరకు అండరె శెట్లు మొదటి దినాన ఎట్లున్నయో.. గిప్పుడు గూడా అట్లనే శిన్నగున్నయి. ముట్టుకొని సూత్తె అప్పుడే వెట్టినట్టు తెల్వవట్టె. ఈనెకు ఏం అర్థం గాలే! పరేషానైపేయిండు. అందరి శెట్లు మనిషంతెత్తు వెరిగినయి. అందరి తోటలు అడివోలె అయినయి. అండరె శెట్ల కత ఎంటనే వయ్యిల రాసుకున్నడు. రోజు తీర్గనే శెట్ల ముచ్చట చెప్పనీకి రాజుతానికి వోయిండు. “మారాజా! రాజ్యంల అందరి శెట్లు అడివోలె వెరిగినయి కని.. అండరె శెట్లు మాత్రం మొదటి దినాన ఎట్లున్నయో ఇయ్యాల్ల గూడ అట్లనే ఉన్నయి” అంట జెప్పిండు. ఎంటనే అండరెను తీసుకురమ్మంట హుకుం జేశిండు రాజు.
రాజు విలుత్తడని అండరెకు ఎర్కనే! గందుకే.. తయారయి గూసున్నడు. అంతట్లకే రాజు వంపిన మనుషులచ్చిండ్లు. ఆల్లతోని కొలువులకు వోయిండు అండరె. శెట్ల మంత్రి జెప్పిన కతంత ఇన్నంక.. “అందరి శెట్లు అడివోలె వెరిగితె నీ శెట్లకు ఏంబుట్టింది? అట్లనే ఉన్నయి” అంట కోపానికచ్చిండు రాజు. దానికి అండరె వంగి దండం బెట్టి.. “మా రాజా! అవ్వి మీరిచ్చిన శెట్లాయె! గాలికి ఎట్ల ఇడిశివెడుత. పొద్దుగాల తోటల వాతి, రోజు రాత్రికి మల్ల పీక్కోని ఇంటికి తీసుకువోతున్న. రాజు సొమ్మాయె! కావలి గాయాలె గదా! అందుకే అంత తాజాగున్నయి” అంట జెప్పిండు. ఆని ఇకమతు అర్థమైన రాజు, కొలువులున్నోల్లంతా కడుపుబ్బ నవ్వుకున్నరు.
. పత్తిపాకమోహన్
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
చంపి తిందామని వచ్చిన తోడేలును భలే బురిడీ కుట్టించిన కుందేలు
Children Stories | రంభనే నా పెండ్లాం