Team India : పొట్టి ప్రపంచకప్ ట్రోఫీ విజయం భారత జట్టు (Team India)ను సంబురాల్లో ముంచేసింది. ఆ సంతోషాన్ని మరువక ముందే జింబాబ్వే పర్యటనలో కుర్ర భారత్ అద్భుత ఆటతో సిరీస్‌ను పట్టేసి ‘వారెవ్వా’ అనిపించింది. ఇక టీ20ల్లో టీమిండియాకు అన్నీ మంచి శకునములేపో అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే.. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)ల మాదిరిగా పొట్టి ఫార్మాట్లో నమ్మదగ్గ ఆటగాళ్ల అవసరం టీమిండియాకు ఎంతో ఉంది.
‘రోకో’ల వీడ్కోలుతో టీ20ల్లో ఓపెనింగ్ కోసం కుర్రాళ్ల మధ్య గట్టి పోటీ మొదలైంది. ముఖ్యంగా యువకెరటాలు యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), అభిషేక్ శర్మ (Abhishek Sharma)ల మధ్య తగ్గపోరు నడుస్తోంది. ఈ విషయంపై కెప్టెన్ గిల్ సైతం స్పందింస్తూ.. ‘ఓపెనింగ్ కోసం పోటీ ఉండడం మంచి విషయమే కదా’ అని టీమిండియా బెంచ్ ఎంత బలమైనదో ఒక్క మాటలో చెప్పేశాడు.
పొట్టి ప్రపంచ కప్ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్‌లో విజయం సరే ఓపెనింగ్ కాంబినేషన్‌పై పెద్ద చర్చకు కారణమైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో సున్నాకే ఔటైనా.. రెండో టీ20లో జూలు విదిల్చాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచిన అభి.. సిక్సర్‌తో సెంచరీ కొట్టేశాడు. 47 బంతుల్లో శతక గర్జన చేసి ఓపెనర్‌గా తాను సరిపోతానంటూ సంకేతాలిచ్చాడు. అంతేకాదు రెండో మ్యాచ్‌లోనే శతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
అయితే.. వరల్డ్ కప్ హీరో యశస్వీ రాకతో సీన్ మారిపోయింది. మూడో టీ20లో జట్టుతో కలిసిన ఈ చిచ్చరపిడుగు తన ఫామ్‌కు తిరుగులేదని చాటాడు. ఆడినంత సేపు దంచేసి 36 రన్స్ కొట్టాడు. ఇక నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసిన యశస్వీ 93 పరుగులతో అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో, ఓపెనర్లుగా యశస్వీ, గిల్ కాంబినేషన్ సూపర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంగూలీ, సచిన్.. సెహ్వాగ్, గంభీర్ మాదిరిగా వీళ్లిద్దరి జోడీ బాగా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
టీ20లకు కోహ్లీ గుడ్ బై చెప్పడంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టేది ఎవరు? అనే ప్రశ్నకు రుతురాజ్ గైక్వాడ్ ‘నేనున్నా’ అంటున్నాడు. లెక్క ప్రకారం ఓపెనర్‌గా ఆడాల్సిన గైక్వాడ్ జట్టు అవసరం, కూర్పు నిమిత్తం జింబాబ్వే పర్యటన రెండో టీ20లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
అయినా సరే ఆటపై ఫోకస్ తగ్గకుండా కళాత్మక షాట్లతో అలరించిన గైక్వాడ్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. దాంతో, విరాట్ కోహ్లీ వారసుడు దొరికేశాడంటూ రుతురాజ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. గైక్వాడ్ నాలుగు మ్యాచుల్లో 133 రన్స్ కొట్టాడు.
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా లేని లోటును వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. జింబాబ్వే టూర్లో సుందర్ 8 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు ఇక ఈ సిరీస్‌లో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) బౌలింగ్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. స్లో, గూగ్లీ బంతులతో జింబాబ్వే బ్యాటర్లను బుట్టలో వేసుకున్న ఈ లెగ్గీ టీ20 పునరాగమనం కోసం ఆశగా ఎదురు చూస్తున్న చాహల్ ఆశలపై నీళ్లు చల్లేశాడు.
ఇక పేస్ యూనిట్లో అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లు హిట్ కొట్టారు. ఆఖరి టీ20లో ముకేశ్ తొలి స్పెల్‌లో, ఆఖరి స్పెల్‌లో రెండేసి వికెట్లు తీసి టీమిండియా విజయంలో భాగమయ్యాడు. జింబాబ్వే టూర్లో కుర్రాళ్లు తమ పాత్రకు న్యాయం చేయడంతో గిల్ సారథ్యంలో టీమిండియా 4-1తో సిరీస్ సొంతం చేసుకుంది.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!#TeamIndia clinch the T20I series 4⃣-1⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJKro#ZIMvIND pic.twitter.com/ulza0Gwbd7
— BCCI (@BCCI) July 14, 2024