సిటీబ్యూరో, జులై 15 ( నమస్తే తెలంగాణ ) : బతికే ఉన్నా ‘మహా ప్రభో’ అంటూ ఓ వృద్దురాలు(Old woman) ఎక్కని మెట్లు.. కలవని అధికారి లేడు. పింఛన్ మంజూరు చేయండంటూ ఖైరతాబాద్ తహసీల్దార్‌కు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. భర్త చనిపోయిన భారంతో ఉన్న ఆమెకు ఇప్పు డు తాను కూడా చనిపోయానని రికార్డుల్లో ఉందని.. బతికున్నట్టుగా నిరూపించుకోవాలని అధికారులు చెబు తున్నారని ఆ వృద్ధురాలు వేడుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌లోని బీజేఆర్ నగర్‌కు చెందిన కె. రుక్నమ్మకు 59 ఏండ్లు. భర్త చనిపోవడంతో ఆమెకు ఇల్లు గడవడమే కష్టంగా మారింది.
పింఛన్(Pension) కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంకా మంజూరు కావడం లేదని తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వంలో తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా మంజూరు అయిందని పేర్కొంది. ప్రజావాణిలో (Prajavani) గతంలో కూడా దరఖాస్తులు ఇచ్చానని చెప్పింది. తమ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా తప్పుల తడకగా వివరాలను నమోదు చేస్తుండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.