హనుమకొండ చౌరస్తా : మహిళల సాధికారత ( Womens Empowerment ) సమాజ అభివృద్ధికి కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం ( Valluri Ramachandram ) అన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్య, ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్యం ద్వారా మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారన్నారు.
గౌరవ అతిథిగా హాజరైన కేయూ విశ్రాంత ఆచార్యురాలు వి.శోభ మాట్లాడుతూ మహిళా విద్య ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, విద్యావంతులైన మహిళలు కుటుంబం అభివృద్ధికి తోడ్పడటమే కాక సమాజానికి మార్గదర్శకులవుతారని తెలిపారు.
ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ విద్యార్థినులు ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో నాయకత్వ పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రెహ్మాన్, ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.