న్యూయార్క్: ఇరాన్‌పై మరింత దూకుడుగా అమెరికా దాడి చేయనున్నది. దీని కోసం మళ్లీ స్టీల్త్ బాంబర్లను సిద్ధం చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన రెండు ఎయిర్ బేస్‌లను వాడుకునేందుకు ప్లాన్ చేసింది. బీ2 బాంబర్ల(B-2 Bombers)ను ఆ ఎయిర్‌బేస్‌ల వద్ద మోహరించే ప్రక్రియను చేపట్టింది. బ్రిటీష్ మిలిటరీకి చెందిన హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియా, గ్లోసెష్టర్షైర్లోని ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్‌ల నుంచి బీ2 బాంబర్లను వినియోగించాలని అమెరికా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ స్థావరాలకు బీ2 బాంబర్లను మోహరిస్తున్నది.
బీ2 బాంబర్ ఖరీదు సుమారు రెండు బిలియన్ల డాలర్లు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఇదే. మరికొన్ని రోజుల్లో బ్రిటన్ ఎయిర్‌బేస్‌లకు బీ2 బాంబర్లు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా బీ2 బాంబర్లు అమెరికా నుంచి నాన్‌స్టాప్ జర్నీ చేసి టెహ్రాన్‌పై అటాక్ చేశాయి. అయితే సుమారు రెండువేల పౌండ్ల బాంబులతో ఆ రోజున ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై బీ2 బాంబర్లు దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.
బ్రిటన్ మిలిటరీ ఎయిర్‌బేస్‌లను అమెరికా వాడుకునేందుకు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ కేంద్రాలకు బీ2 బాంబర్లు చేరుకోనున్నాయి.